నేడు సిపిఐ నిరసనలు

ప్రజాపక్షం/న్యూఢిల్లీ: వలస కార్మికులు, పేదల సాధకబాధకాలను పరిష్కరించే చర్యలను డిమాండ్‌ చేస్తూ ఈనెల 19వ తేదీ మంగళవారంనాడు సిపిఐ ఆధ్వర్యంలో జరిగే నిరసనలను జయప్రదం చేయాల్సిందిగా సిపిఐ తన పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేసింది. భవిష్యత్‌ ఉద్యమాలకు ఇది ఆరంభం మాత్రమేనని సిపిఐ ప్రధా నకార్యదర్శి డి.రాజా సోమవారంనాడొక ప్రకటనలో వెల్లడించారు. వేలాదిమంది వలస కార్మికులు జీవనోపాధులు కోల్పోయి, ఆహారం లేక, స్వస్థలాలకు చేరుకునేందుకు చేతిలో డబ్బులేక, కుటుంబాలను పోషించుకోలేక కనీవినీ ఎరుగని కష్టాలనుభవిస్తున్నారని, వారి దయనీయ స్థితిని, కడగండ్లను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. ప్రధాని ప్రకటించిన ప్యాకేజీ ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు వాటిలో చెప్పుకోదగింది ఏమీ లేదని వ్యాఖ్యానించారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వినాశకరమైన నయా ఉదార విధానాల వల్ల జబ్బుపడిన ఆర్థిక వ్యవస్థ సంక్షోభానికి కోవిడ్‌ 19 తోడయిందని తెలిపారు. సిపిఐ తన ఉమ్మడి ప్రచారాందోళనల్లో పా ల్గొంటూనే, స్వతంత్రంగా కూడా కార్యక్రమాలు నిర్వహించాలని, మోడీ సర్కారు అనుసరిస్తున్న అమానుష, సామాజిక దోపిడీ యత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కాకపోతే, ఆందోళన సందర్భంగా భౌతిక దూరం పాటించటం, ముఖానికి మాస్క్‌ లు ధరించటం వంటి నియమాలను పాటించాలని కోరారు.
హోచిమిన్‌ ప్రభృతులకు నివాళి
మే 19, 20 తేదీలు సిపిఐ శ్రేణులకు అత్యంత ప్రాముఖ్యత గల దినాలని, 19న వియత్నాం విముక్తి కోసం పోరాడిన మహా కమ్యూనిస్టు నేత హోచిమిన్‌ జయంతి అని, అలాగే 20న దళితుల అభ్యున్నతి కోసం పోరాడిన తమిళుడు ఇయోథీ థాస్‌ పండితార్‌ 175వ జయంతి అని, వీరిద్దరికీ నివాళులర్పించాలని కార్యకర్తలను డి.రాజా కోరారు. సమైక్య ప్రజాతంత్ర సోషలిస్టు రిపబ్లిక్‌ వియత్నాం ఆవిర్భావంలో హోచిమిన్‌ గొప్ప పాత్ర వహించడంతోపాటు జపాన్‌ సైనికులు, అమెరికా, ఫ్రాన్స్‌ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడి నేటికీ స్ఫూర్తిప్రధాతగా నిలిచారని గుర్తుచేశారు. ఇక ఇయోథీ థాస్‌ పండితార్‌ గొప్ప సామాజిక మార్పునకు అద్వితీయ కృషి చేశారని, అంబేద్కర్‌ పుట్టడానికి ఏభయ్యేళ్ల క్రితమే ఆయన బౌద్ధ బోధనల కోణం నుంచి తమిళ ప్రజలను చైతన్యపరిచి, దళిత జనోద్ధరణకు దోహదం చేశారని గుర్తుచేశారు. హోచిమిన్‌, పండితార్‌ ఆశయాలకు అనుగుణంగా కృషి చేయడమే పార్టీ కార్యకర్తలు వారికిచ్చే నిజమైన నివాళి అవుతుందని రాజా అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్‌ కాలంలో దెబ్బతిన్న ప్రజలందరికీ వీలైనంత మేరకు సాయం చేయాలని కోరారు.

DO YOU LIKE THIS ARTICLE?