నేడు సిపిఐ దీక్షలు

ప్రజాపక్షం / హైదరాబాద్‌: కరోనా కారణంగా సమస్యలు ఎదుర్కొం టున్న ప్రజలు, ముఖ్యంగా వలస కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఐ జాతీయ పార్టీ పిలుపు మేరకు దేశ, రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 4వ తేదీన జిల్లా, మండలం, పట్టణం లేదా తమ సొంత ఇళ్లలో పార్టీ జెండాలతో దీక్షలు చేయనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె. నారాయణ, కార్యవర్గ సభ్యులు సయ్యద్‌ అజీజ్‌పాషా, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, పార్టీ శ్రేణులు దీక్షను ఉదయం 11 నుండి సాయంత్రం 5 గంటల వరకు సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌లో చేపడతారని ఒక ప్రకటనలో వివరించారు. డిమాండ్ల సాధనకు కరోనా నిబంధనలు నాలుగు అడుగుల దూరం పాటిస్తూ ఉపవాస దీక్షలు చేపడతారని తెలిపారు. కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులను వారి సొంత స్థలాలకు పంపించాలని, లేదా అన్ని వసతులతో భోజన సదుపాయంతో సహాయక శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు. ప్రైవేట్‌ విద్య, వైద్యశాలలో, ప్రైవేటు సంస్థలలో పని చేస్తున్న ఉద్యోగులకు వేతనాలు ఇప్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్న భోజన వర్కర్స్‌, అంగన్‌వాడీ వర్కర్స్‌, స్కీమ్‌ వర్కర్లకు ప్రభుత్వం వెంటనే జీతాలు చెల్లించాలన్నారు. అసంఘటిత కార్మికులు, చేతి వృత్తిదారుల కుటుంబాలకు రూ.7000 ఆర్థిక సాయం సహాయం అందజేసి ఆదుకోవాలన్నారు. వరి కొనుగోలు క్వింటాకు 5 కిలోల తరుగు విధానంపై చర్యలు తీసుకొని రైతులను ఆదుకోవాలని కోరారు. వడగండ్ల వల్ల నష్టపోయిన పంటలకు నష్టపరిహారం అందించడంతో పాటు పిడుగుపాటుకు గురై మరణించిన వారికి 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?