నేడు తుది విడత పరిషత్‌ పోరు

27 జిల్లాల్లో 161 జడ్‌పిటిసి, 1738 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు
9494 పోలింగ్‌ కేంద్రాలు
ఈ నెల 27న ఓట్ల లెక్కింపు

ప్రజాపక్షం / హైదరాబాద్‌ : జిల్లా, మండల పరిషత్‌ల ఎన్నికలు ముగింపు దశకు వచ్చేశాయి. ఈ నెల 6,10,14 తేదీల్లో మూడు విడతలుగా ఈ ఎన్నికలు నిర్వహించడానికి నోటిఫికేషన్‌ జారీ చేయగా, ఇప్పటికే రెండు విడతలు పూర్తయ్యాయి. మూడోది ఆఖరుది అయిన పరిషత్‌ పోరులో ఓటరు మంగళవారం తన తీర్పును బ్యాలెట్‌ పత్రాల్లో నిక్షిప్తం చేయనున్నాడు. చివరి విడత పోలింగ్‌ మంగళవారం ఉద యం ఏడు గంటల నుంచి ప్రారంభం కానుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు, మిగిలిన చోట్ల సాయం త్రం ఐదు గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు లోక్‌సభ ఫలితాల అనంతరం ఈ నెల 27న నిర్వహిస్తారు. లెక్కింపు ఎప్పుడు పూర్తయితే అప్పుడు పలితాలను ప్రకటిస్తారు. మొత్తం 32 జిల్లాలు ఉండగా ఆఖరు విడతలో 17 జిల్లాల్లో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. మిగిలిన 5 జిల్లాల్లో రెండు విడతల్లోనే ఆ జిల్లాల్లో ఉన్న మొత్తం జడ్‌పిటిసి, ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యా యి. మూడో విడతలో జరిగే ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం మొత్తం 9494 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి ఓటర్ల సంఖ్యను బట్టి ఐదుగురు ఎన్నికల సిబ్బందిని నియమించారు. బ్యాలెట్‌ పత్రాలు, ఇండెలిబుల్‌ ఇంక్‌ బాటిళ్లు, సీళ్లను పోలింగ్‌ కేంద్రాలకు తరలించారు. పోలీస్‌ యంత్రాంగం పోలింగ్‌ జరిగే ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసింది. స్థానిక పోలీసులతో పాటు ఇతర ప్రాం తాల నుంచి ప్రత్యేక పోలీస్‌ బలగాలను మోహరించారు. వీరితో పాటు మొబైల్‌ పోలీస్‌ బృందాలను ఏర్పాటు చేశారు. ఏదేని ఫిర్యాదు వచ్చిన వెంటనే అక్కడికి తక్షణం చేరుకుని పరిస్థితులను చక్కదిద్దేందుకు ఈ బృందాలు పనిచేస్తాయి. మూడో విడతలో నల్లగొండ జిల్లాలో అత్యధిక స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ అత్యధికంగా 691 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జగిత్యాల, వరంగల్‌ అర్బన్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని ఎంపిటిసి, జడ్‌పిటిసి స్తానాలన్నింటికి మొదటి రెండు విడతల్లోనే ఎన్నికలు పూర్తవగా మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో మొత్తం స్థానాలకు మొదటి విడతలోనే ఎన్నికలు పూర్తయ్యాయి. తొలి రెండు విడతల కంటే ఆఖరుదైన మూడో విడతలో పోరు తీవ్రంగా ఉంది. పోటీలో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా పెద్ద సంఖ్యలో తలపడుతున్నారు. బుజ్జగింపుల పర్వంలోనూ చాలా మటుకు దిగిరాకపోవడం, అధికార, ప్రధాన ప్రతిపక్షాల్లోనూ కొన్ని చోట్ల రెబల్స్‌ బరిలో ఉండడంతో మూడో విడత ప్రచారం కూడా పోటాపోటీగా సాగింది. అక్కడక్కడ ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు పెద్ద ఎత్తునే జరిగాయి. రూ.10.24 లక్షల నగదు, రూ.5.16లక్షలు విలువ చేసే మద్యం, ఇతర కానుకలు పట్టుబడ్డాయంటే అభ్యర్థులు విజయం కోసం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశారని అర్థమవుతోంది. మూడో విడతలో 161 జడ్‌పిటిసి స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా ఉపసంహరణల అనంతరం ఒక్కో స్థానం నుంచి సగటున ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?