నేడు కాంగ్రెస్‌ ఎంపి, ఎంఎల్‌సి అభ్యర్థులు కొలిక్కి!

ప్రజాపక్షం / హైదరాబాద్‌: లోక్‌సభ నియోజవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక పరిశీలనకు నియమించిన టిపిసిసి ఎన్నికల కమిటీ (పిఇసి) సమావేశం మంగళవారం జరగనుంది. పార్టీ ఎన్నికల కమిటీ అధ్యక్షుడు, టిపిసిసి చీఫ్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో డిసిసి అధ్యక్షులు తమ జిల్లా పరిధిలో ఒక్కో స్థానానికి ఐదుగురు అభ్యర్థులను సూచిస్తూ జాబితాను సమర్పించనున్నారు. అనంతరం కమిటీ సభ్యు లు ఈ జాబితాను పరిశీలించి ఒక్కో స్థానానికి ఒకటి నుండి మూడు పేర్లను సూచిస్తూ అధిష్టానానికి జాబితాను పంపనుంది. ఇదిలా ఉం డగా ఎంఎల్‌సి స్థానాలకు కూడా అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తు తం ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ అయిన తొమ్మిది ఎంఎల్‌సి స్థానాల్లో రెండు స్థానాల్లోనే పోటీ చేయాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. అవి కరీంనగర్‌ గ్రాడ్యుయేట్‌ స్థానం, ఎంఎల్‌ఎ కోటాలోఎంఎల్‌సి కోటాలో మరో స్థానం. కరీంనగర్‌ స్థానం నుంచి మాజీ మంత్రి ఎ.జీవన్‌రెడ్డి పేరు దాదాపుగా ఖరారైంది. ఇక ఎంఎల్‌ఎ కోటాలో ఎంఎల్‌సి విషయంలో మంగళవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అభ్యర్థి ఎంపికపై వేసిన ఎంఎల్‌ఎలతో కూడిన కమిటీ 30 మంది ఆశావాహుల పేర్లను సోమవారం సిఎల్‌పి కార్యాలయంలో సమావేశమై పరిశీలించింది.

DO YOU LIKE THIS ARTICLE?