నేడు ఓపెన్‌!

తెరచుకోనున్న హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రార్థనాస్థలాలు
ప్రజాపక్షం/హైదరాబాద్‌ : కరోనా లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు అనంతరం రాష్ట్రంలో సోమవారం నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌ మాల్స్‌, మతపరమైన ప్రార్థన స్థలాలు తెరుచుకోనున్నాయి. భౌతిక దూరం పాటిస్తూ తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ వాటిని నిర్వహించాలని ప్రభు త్వం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన లాక్‌డౌన్‌ సడలింపు మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలను అన్నింటినీ తప్పకుండా ఈ కార్యకలాపాల్లో పాటించాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. గేమింగ్‌ సెంటర్లు, సినిమా హాల్స్‌ తెరిచేందుకు అనుమతించలేదు. హోటళ్లు, రెస్టారెం ట్లు, షాపింగ్‌మాల్స్‌, ప్రార్థన స్థలాలకు వచ్చే వారికి ప్రధాన ద్వారాల వద్దనే హ్యాండ్‌ వాష్‌, శానిటైజర్లు అందుబాటులో ఉంచడంతో పాటు థర్మల్‌ స్కానింగ్‌ తప్పకుండా చేయాలని ప్రభుత్వం సూచించింది. అందురూ తప్పకుండా మాస్కులు వాడేవిధంగా చర్యలు తీసుకోవాలి. పెద్ద ఎత్తున జన సముహాలను నిషేధించింది. కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై పోస్టర్లు, అడియో, వీడియోల ద్వారా ప్రచారం చేయాలని సూచించింది. ఎసిలను 24 నుంచి 30 డిగ్రీల వరకు ఉపయోగించాలి. కంటైన్‌మెంట్‌ జోన్‌లలో మాత్రం ఈనెల 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని ఉత్తర్వులలో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా గత మూడు నెలలుగా మూసివేసిన హోటళ్లు, మాల్స్‌ను తెరిచేందుకు సంబంధిత యజమాన్యాలు చర్యలు చేపట్టాయి. కరోనా వ్యాప్తిని నివారించేందుకు ప్రభుత్వం సూచించిన మేరకు వాటి ప్రాంగణాలను శుభ్రం చేయడం, శానిటైజ్‌ చేయడం తదితర చర్యలు తీసుకున్నాయి. ప్రభుత్వ అనుమతితో రాష్ట్రంలోని దేవాలయాలను తెరిచేందుకు దేవాదాయ శాఖ తగిన ఏర్పాట్లు చేసింది.

DO YOU LIKE THIS ARTICLE?