నెలాఖరులో టిపిసిసికి కొత్త చీఫ్‌?

రేసులో పలువురు నేతలు
ముందంజలో శ్రీధర్‌బాబు?

ప్రజాపక్షం/హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తరువాత టిపిసిసికి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే అధిష్టానానికి తన రాజీనామా లేఖను సమర్పించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో నెలాఖరుక ల్లా కొత్త అధ్యక్షుడిని నియమించనున్నారు. దీంతో పిసిసి అధ్యక్ష పదవికి పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. అందులో టిపిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌లు ఎ.రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, మాజీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. అయి తే మధ్యే మార్గంగా ఇటీవల ఎంఎల్‌సిగా గెలిచిన మాజీ మంత్రి జీవన్‌రెడ్డి పేరు కూడా వినపడుతుంది. మాజీ ఎంపి వి.హనుమంతరావు సైతం అవకాశం వస్తే బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఎంపి ఎన్నికల ఫలితాలు ఆధారంగా రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్‌, పొన్నంల పేర్లు పరిశీలనలో ఉండే అవకాశం ఉంది. ఉత్తమ్‌ రాజీనామాతో ఢిల్లీ నుండి అధిష్టానం దూత ఇటీవల హైదరాబాద్‌కు వచ్చి తదుపరి టిపిసిసి చీఫ్‌పై ముఖ్యనేతల అభిప్రాయాలు సేకరించినట్లు తెలిసింది. తాజాగా శ్రీధర్‌బాబు పేరును అధిష్టానం సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. నాలుగుసార్లు ఎంఎల్‌ఏగా గెలవడంతో పాటు, మంత్రిగా పని చేసిన అనుభవం, సీనియర్‌ కావడంతోపాటు అందరితో కలివిడిగా ఉండడం, సిఎల్‌పి నేతతో సాన్నిహిత్యం ఉండడంతో పార్టీలో ఆయనవైపు కొంత మొగ్గు ఉన్నట్లు తెలిసింది. దీనికి తోడు త్వరలో శ్రీధర్‌బాబే బిఫామ్‌లు ఇస్తారని గాంధీభవన్‌లో ఒక ముఖ్యనేత వ్యాఖ్యానించడం కూడా ఇందుకు ఊతమిస్తోంది.

DO YOU LIKE THIS ARTICLE?