నీరవ్‌మోడీ కేసులో దర్యాప్తు అధికారి బదిలీ

రెండు గంటల వ్యవధిలోనే ఉత్తర్వు రద్దు
మోడీ సర్కారు నిర్వాకం

న్యూఢిల్లీ : బ్యాంకులకు ఎగనామం పెట్టి విదేశాల్లో తిరుగుతున్న నీరవ్‌ మోడీకి సంబంధించిన కేసులో దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) అధికారిని నరేంద్రమోడీ ప్రభుత్వం శుక్రవారం బదిలీ చేసింది. అయితే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అడ్డంకిగా మారడంతో కేవలం రెండు గంటల వ్యవధిలోనే ఈ బదిలీని రద్దు చేసింది. నీరవ్‌ మోడీ కేసులో ఇడి జాయింట్‌ డైరెక్టర్‌ సత్యబ్రత కుమార్‌ దర్యా ప్తు చేస్తున్నారు. ఇప్పటికే పలు ఆస్తుల జప్తులో ఆయన కీలకపాత్ర పోషించారు. లండన్‌లో దాక్కున్న నీరవ్‌ మోడీ అప్పగింత అనివార్యం కావడంతో ఈ కేసును డీలాపర్చేందుకు నరేంద్రమోడీ ప్రభుత్వం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నదని, అందులో భాగంగానే సత్యబ్రత కుమార్‌ను ఇడి జాయింట్‌ డైరెక్టర్‌ పదవి నుంచి ముంబయి ఇడి స్పెషల్‌ డైరెక్టర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వు జారీ చేసింది. అయితే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఇది ఉల్లంఘించడమేనని ఫిర్యాదు అందిన రెండు గంటల వ్యవధిలో కేంద్ర ప్రభు త్వం అతని బదిలీని నిలుపుదల చేస్తూ రెండో ఉత్తర్వును జారీ చేసింది. ఈ రెండు ఉత్తర్వుల ప్రతులను ‘ది వైర్‌’ న్యూస్‌ వెబ్‌సైట్‌ పోస్ట్‌ చేసి కలకలం సృష్టించింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సాగిన బొగ్గు కుంభకోణం దర్యాప్తులో కూడా సత్యబ్రత కుమార్‌ విచారణాధికారిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం తాను ఇడి బృందంలో సభ్యునిగా వున్నందున, ఈ బదిలీ, బదిలీ రద్దు ఉత్తర్వులపై తాను వ్యాఖ్యానించలేనని సత్యబ్రత కుమార్‌ లండన్‌ నుంచి ‘ది వైర్‌’కు తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?