నిలిచేదెవరో..?

ఆ నాలుగు స్థానాల కోసం తీవ్ర పోటీ
ఐపిఎల్‌ సీజన్‌ నెలకొన్న ఉత్కంఠత
క్రీడా విభాగం: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపిఎల్‌) 12వ సీజన్‌ చివరి అంకానికి చేరుకుంటోంది. మే 5తో లీగ్‌ దశ ముగుస్తుంది. మరో వారం రోజుల్లో ప్లేఆఫ్‌ మ్యాచ్లు మొదలవుతాయి. లీగ్‌ దశలో జట్లన్నీ హోరాహోరీగా తలపడుతున్నాయి. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్లేఆఫ్‌ ఆశలు ఇప్పటికే ఖరారు చేసుకుంది. ఢిల్లీ, ముంబయి జట్లు కూడా చెన్నై బాటలోనే ప్రయానిస్తుంటే.. హైదరాబాద్‌ కూడా పడిలేచుతూ వారి వెనుకాలే ఉంది. ప్రస్తుతం ఈ నాలుగు జట్లు పాయింట్ల పట్టికలో టాప్‌ ఉన్నాయి. ఇక పట్టికలో అడుగున ఉన్న నాలుగు జట్లకూ ఇంకా అవకాశాలు ఉండటంతో సీజన్‌ నానాటికీ రసవత్తరంగా మారుతోంది. పట్టికలో ఆఖర్లో నిలిచిన పంజాబ్‌, కోల్‌కతా, రాజస్థాన్‌, బెంగళూరు జట్లు సైతం ప్లేఆఫ్‌లో చోటు సంపాదించొచ్చు. కానీ ఈ జట్లు మిగిలిన తమ లీగ్‌ మ్యాచుల్లో కచ్చితంగా విజయాలు సాధించాల్సిందే. అప్పుడే ఈ జట్లు కూడా రేసులో నిలబడవచ్చు. ఈ సీజన్‌ను పేలవంగా ఆరంభించిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, రాజస్థాన్‌ రాయల్స్‌ ఇప్పుడు మెరుగైన ప్రదర్శనలతో వరుస విజయాలు సాధిస్తున్నారు. తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచుల్లో ఈ జట్లు విజయం ఢంకా మోగిస్తున్నారు. మరోవైపు టోర్నీలో మంచి ఆరంభాన్ని అందుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌, కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ జట్లు చివరి దశలో మాత్రం తేలిపోతున్నాయి. కెకెఆర్‌ జట్టు వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై తమ ప్లేఆఫ్‌ అవకాశాలను చేజేతులు నాశనం చేసుకుంటోంది. ఇక పంజాబ్‌ జట్టు కూడా వరుస ఓటములతో నిరాశ పరుస్తోంది. లీగ్‌ దశ చివరి దశకు రావడంతో అటు ఆయా ఫ్రాంచైజీలతో పాటు, అభిమానుల్లో కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం ఏప్రిల్‌ 26న ముంబయి ఇండియన్స్‌ సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఆ మ్యాచ్‌ వరకు పాయింట్ల పట్టికలో ఏఏ జట్టు ఏఏ స్థానంలో ఉంది. వారి ప్లే ఆఫ్‌ అవకాశాలు ఎలా ఉన్నాయో ఓసారి కన్నేస్దాం.
చెన్నై మరోసారి..
డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరోసారి ప్లే ఆఫ్‌కు చేరువైంది. ప్రస్తుతం ఈ జట్టు సాధించిన పాయింట్లను బట్టి చూస్తే ఈ జట్టు ప్లే ఆఫ్‌కు చేరుకున్నట్టే. చెన్నైకు ప్లేఆఫ్‌ బెంగలేదు. వ్యూహాత్మకంగా ఆ జట్టు తొలి దశలో ఎక్కువ మ్యాచులు గెలిచింది. ఇప్పటి వరకు అత్యధిక సార్లు టైటిల్‌ పోర్లు ఆడిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరోసారి అదే బాటలో నడుస్తూ ప్లే ఆఫ్‌ బెర్త్‌ను దాదాపు ఖాయం చేసుకున్న తొలి జట్టుగా నిలిచింది. ఈ సీజన్‌లో చెన్నై ఇప్పటి వరకు 12 మ్యాచులు ఆడింది. అందులో 8 గెలిచి 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు వారి లక్ష్యం ఏంటంటే పట్టికలో ఒకటి లేదా రెండో స్థానంలో కొనసాగడం. అలాగైతే ప్లేఆఫ్‌లో ఓడినా ఫైనల్‌ చేరేందుకు మరో అవకాశం ఉంటుంది. ధోనీసేన మే1న ఢిల్లీ, 5న పంజాబ్‌తో తలపడనుంది. అందులో ఒక్క మ్యాచ్‌ గెలిచినా తొలి రెండు స్థానాల్లో నిలుచునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ జట్టు ఓటముల పాలవ్వడం కలవరపరిచే అంశం. ధోనీ లేకుంటే అగ్రశ్రేణి జట్టులా కనిపించడం లేదు. ఈ సీజన్‌లో ధోనీ రెండు మ్యాచ్‌లకు దూరమైతే ఆ రెండు మ్యాచుల్లోనూ చెన్నై ఓటములను చవిచూసింది.
అడుగు దూరంలో ముంబయి..
స్టార్‌ ఆటగాళ్లతో కూడిన ముంబయి ఇండియన్స్‌ జట్టు అదే తరహ ప్రదర్శనలతో ఆకట్టుకోంటుంది. కీలక మ్యాచుల్లో విజయాలు సాధిస్తూ ప్లే ఆఫ్‌కు అడుగు దూరంలో నిలిచింది. ప్లే ఆఫ్‌కు తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో రోహిత్‌ సేన వరుస విజయాలతో ముందుకు దూసుకెళ్లుతోంది. సారథి రోహిత్‌ శర్మ ఫామ్‌ అందుకోవడంతో ముంబయి ఇండియన్స్‌కు మరింత బలం చేకూరింది. ముంబయి ఇపపివరకు 11 మ్యాచులు ఆడింది. అందులో 7 మ్యాచుల్లో గెలిచింది. నెట్‌ రన్‌రేట్‌ +0.537 ఉండటంతో 14 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. చెన్నైపై 46 పరుగుల విజయం రోహిత్‌ సేనకు ఎంతో మేలు చేసింది. ఆ జట్టుకు మరో 3 మ్యాచులు మిగిలున్నాయి. కోల్‌కతాతో రెండు, హైదరాబాద్‌తో ఒకటి ఆడాలి. రెండు మ్యాచుల్లో గెలిస్తే తొలి రెండు స్థానాల్లో నిలవొచ్చు. ప్రస్తుతం ముంబయి జట్టు మంచి ఫామ్‌లో ఉంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో ఈ జట్టు మెరుగ్గా ఆడుతోంది.
ఢిల్లీకి కొత్త పేరు కలిసొచ్చింది..
ఢిల్లీ క్యాపిటల్స్‌ పేరు మార్చుకోవడం ఆ జట్టుకు కలిసోచ్చింది. ఎప్పుడో సచిన్‌ టెండూల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌ ఐపిఎల్‌ ఆడినప్పుడు ఢిల్లీ ఫ్రాంచైజీ ప్లేఆఫ్‌ చేరింది. మళ్లీ ఇన్నాళ్లకు అదృష్టం వరించనుంది. పేరు, యాజమాన్యం, సహాయ బృందం మారిన తర్వాత జట్టులో ఊపు వచ్చింది. బృంద స్ఫూర్తి, పరిణతి పెరిగాయి. ఈ సీజన్‌లో కొత్త ఆటగాళ్లతో ఢిల్లీ జట్టు ఇరగదీస్తోంది. శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంతో పాటు.. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, యువ ఆటగాళ్లు, పంత్‌, షాలు చెలరేగి ఆడుతున్నారు. వీరితో పాటు విదేశి ఆటగాళ్లు ఢిల్లీకి అదనపు బలంగా మారారు. అందరూ కలిసి చురుగ్గా ఆడుతూ తమ జట్టుకు విజయ పథంలో నడిపిస్తున్నారు. ఈ సీజన్‌లో ఢిల్లీ ఆడిన 11 మ్యాచుల్లో 7 గెలిచి 14 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. నెట్‌ రన్‌రేట్‌ ముంబయితో పోలిస్తే కాస్త తక్కువే కానీ సానుకూలంగానే ఉంది. మరో రెండు పాయింట్లు సాధిస్తే ప్లేఆఫ్‌ చేరినట్టే. అంటే బెంగళూరు, చెన్నై, రాజస్థాన్‌తో జరిగే మ్యాచుల్లో ఏ ఒకట్లో గెలిచినా ఢిల్లీకి బెంగ ఉండదు. రెండు గెలిస్తే మరీ మంచిదే. కోచ్‌ రికీ పాంటింగ్‌, సలహాదారు సౌరవ్‌ గంగూలీ వ్యూహాలు ఆ జట్టు తలరాత మార్చాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఢిల్లీ విజయాల్లో వీరి పాత్ర కీలకంగా ఉందనడంలో సందేహంలేదు.
హైదరాబాద్‌కు రన్‌రేటే ప్లస్‌ పాయింట్‌..
ఐపిఎల్‌ కొత్త సీజన్‌లో ఆచితూచి ఆడుతున్న హైదరాబాద్‌ రన్‌రేట్‌ను మెరుగ్గా ఉంచుకోవడం ఆ జట్టుకు ప్లస్‌ పాయింట్‌గా మారింది. అన్ని జట్ల కంటే ఎక్కువగా నెట్‌ రన్‌రేట్‌ +0.654 ఉండటంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కాస్త నిశ్చింతగానే కనిపిస్తోంది. ఇప్పటివరకు 10 మ్యాచులు ఆడిన హైదరాబాద్‌ ఐదు గెలిచి 10 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మంచి ఫామ్‌లో ఉన్న హైదరాబాద్‌ ప్లేఆఫ్‌ చేరడం ఖాయమే. కానీ ఆ జట్టు విధ్వంసకర ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌, జానీ బెయిర్‌ స్టోలు జట్టును వీడనుండటం కలవరపరిచే అంశం. బెయిర్‌ స్టో ఇప్పటికే ఐపిఎల్‌ నుంచి వెళ్లిపోయాడు. మరో వారంలో వార్నర్‌ కూడా స్వదేశం ప్రయాణమవనున్నాడు. ఈ సీజన్‌లో హైదరాబాద్‌ విజయాల్లో వీరిద్దరే ముఖ్య పాత్ర పోషించారు. వారు లేని లోటు జట్టుపై స్పష్టంగా కనబడతోంది. ఇక రాజస్థాన్‌, పంజాబ్‌, ముంబయి, బెంగళూరులతో సన్‌రైజర్స్‌ మిగతా మ్యాచులు ఆడనుంది. వీటిలో రెండు గెలిచినా మెరుగైన రన్‌రేట్‌ కారణంగా ప్లేఆఫ్‌ అవకాశాలు సజీవంగా ఉంటాయి. అయితే కచ్చితంగా 3 గెలిస్తే మరో జట్టు ఫలితాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఫామ్‌ను కోల్పోయిన కెప్టెన్‌ విలియమ్సన్‌ మళ్లీ ఫామ్‌లో వస్తే హైదరాబాద్‌కు తిరుగే ఉండదు.
పంజాబ్‌ పడిలేచుతూ..
ప్రస్తుత ఐపిఎల్‌ సీజన్‌లో ఎక్కువగా వార్తల్లో నిలిచిన జట్టు కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌. సారథి రవిచంద్రన్‌ అశ్విన్‌ మన్కడింగ్‌తో బట్లర్‌ను ఔట్‌ చేసిన విషయం తెలిసిందే. చాలా రోజుల వరకు అదే మన్కడింగ్‌ చర్చ హాట్‌ టాపిక్‌గా నడిచింది. ఈ సీజన్‌ ఐపిఎల్‌లో పంజాబ్‌ జర్నీ పడిలేచుతూ కొనసాగుతోంది. ఆరంభంలో దూకుడు ప్రదర్శించిన పంజాబ్‌ రానురాను డీలా పడింది. ఈ సీజన్‌లో 11 మ్యాచులాడిన పంజాబ్‌ 5 మ్యాచుల్లో గెలిచి 10 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఇక సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌ పంజాబ్‌కు చావోరేవోలాంటిది. అందులో గెలిస్తేనే ప్లేఆఫ్‌ ఆశలు సజీవంగా ఉంటాయి. ప్రస్తుతం పంజాబ్‌కు హైదరాబాద్‌ నుంచే గట్టి పోటీ ఉంది. హైదరాబాద్‌ కంటే ఒక మ్యాచ్‌ ఎక్కువగా ఆడిన పంజాబ్‌ మిగిలిన మూడు మ్యాచుల్లో తప్పనిసరిగా విజయాలు సాధిస్తేనే ప్లే ఆఫ్‌కు చేరుతోంది. హైదరాబాద్‌, కోల్‌కతా, చెన్నైలతో జరిగే అన్ని మ్యాచుల్లో విజయం సాధిస్తేనే పంజాబ్‌కు ప్లే ఆఫ్‌ బెర్తు దక్కుతుంది.
కోల్‌కతా ఆఖర్లో అట్టర్‌ ఫ్లాప్‌..
తొలి దశలో వరుస విజయాలతో చెలరేగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌. ఆఖరి ధశలో మాత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయింది. ప్రస్తుతం విషాదంతంగా ప్రయాణిస్తోంది. వరుసగా ఆరు అపజయాలు ఎదరవడం దినేశ్‌ కార్తీక్‌ సేనను కలవరపెడుతోంది. ఆత్మవిశ్వాసం తగ్గుతోంది. రెండు సార్లు విజేతైన ఆ జట్టు మిగిలిని అన్ని మ్యాచుల్లో విజయం సాధిస్తేనే ప్లేఆఫ్‌ చేరుతుంది. 11 మ్యాచుల్లో 4 గెలిచి 8 పాయింట్లతో 6వ స్థానానికి పడిపోయింది. నెట్‌ రన్‌రేట్‌ సైతం -0.050 అనుకూలంగా లేదు. అయితే చివరి నాలుగు జట్లలో ఇదే మెరుగు. ముంబయితో రెండు, పంజాబ్‌తో ఒక మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న ముంబయిని రెండుసార్లు ఓడించడం కెకెఆర్‌ఆకు సులువైన విషయమేమీ కాదు. కానీ ప్లే ఆఫ్‌కు చేరడం కోసం ఈ జట్టు తన చివరి మ్యాచ్‌లను ఎలా ఆడుతుందో చూడాలి. ప్రస్తుతం డబుల్‌ హ్యాట్రిక్‌ ఓటములతో కెకెఆర్‌ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయింది.
రాజస్థాన్‌కు కష్టమే..
రాజస్థాన్‌కు ప్లే ఆఫ్‌కు చేరడం ఈసారి కూడా కష్టమే. ఈ సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ 11 మ్యాచుల్లో 4 గెలిచింది. 8 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. మిగతా మూడు మ్యాచుల్లో గెలిచినా ఆ జట్టుకు ప్లేఆఫ్‌ తలుపులు మూసుకుపోయినట్టే అనిపిస్తోంది. ఈ జట్టు నెట్‌ రన్‌రేట్‌ -0.390 మరీ దారుణంగా ఉంది. అందుకే ఈ జట్టు మగిలిన అన్ని మ్యాచుల్లో నెగ్గిన ముందుకెళ్లడం కష్టమే. ఇక ఏమైన అద్భుతాలు జరిగి, రన్‌రేట్‌ మెరుగు పరుచుకొని, అన్ని మ్యాచుల్లో గెలిస్తే అవకాశం ఉంటుంది. తమ మిగిలిన మ్యాచుల్లో హైదరాబాద్‌, బెంగళూరు, ఢిల్లీలతో రాజస్థాన్‌ తలపడనుంది. ఈజట్లను ఓడించడం ఆర్‌ఆర్‌కు సులువేంకాదు. ఈ మూడింట్లో ఏ ఒక్కట్లో ఓడిన రాజస్థాన్‌ ఖేల్‌ ఖతం.
ఒక్కటి ఓడినా బెంగళూరు పని సమాప్తం..
ప్రతి సీజన్‌లాగే ఈ సీజన్‌లోనూ బెంగళూరు తమ పాత కథను పునరావృతం చేసింది. సీజన్‌ మొదలయ్యే ప్రతిసారీ ‘ఈ సారి కప్‌ మనదే’ నినాదంతో ఊదరగొడుతుంది రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు. ప్రపంచ టాప్‌ క్లాస్‌ ఆటగాళ్లతో ఈ జట్టు హాట్‌ ఫేవరేట్‌గా బరిలో దిగుతోంది. కానీ మైదానంలో మాత్రం తేలిపోతోంది. తొలి దశలో వరుసగా ఆరు మ్యాచుల్లో ఓటమి పాలవ్వడం కోహ్లీసేనను ఇప్పుడు వేధిస్తోంది. బెంగళూరు ఇప్పటివరకు 11 మ్యాచుల్లో 4 గెలిచి 8 పాయింట్లతో పట్టికలో చిట్ట చివరి స్థానంలో ఉంది. ఈ జట్టు నెట్‌ రన్‌రేట్‌ సైతం (-0.683) ఘోరంగా ఉంది. ఇక మిగిలిన మ్యాచుల్లో ఢిల్లీ, హైదరాబాద్‌, రాజస్థాన్‌లను ఎదుర్కోవాల్సి ఉంది. మూడు మ్యాచుల్లో గెలిచి చివరి నాలుగు జట్ల కన్నా మెరుగైన రన్‌రేట్‌ ఉంటే కోహ్లీసేన ప్లేఆఫ్‌కు చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం హ్యాట్రిక్‌ విజయాలతో జోరుమీదున్న బెంగళూరుకు అద్భుతాలు చేయడం అసాధ్యమేమీ కాదు. విజయాలతో పాటు రన్‌రేట్‌ను కూడా మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది. ఈ మూడింట్లో ఏ ఒకట్లో ఓడినఆర్‌సిబి ఆశలు అడియాసలే అవుతాయి. ఈ జట్టు కెప్టెన్‌ కోహ్లీ, డివిలియర్స్‌పైనే ఎక్కువగా ఆదరపడిం ఉంటుంది. ఈ ఇద్దరిలో ఎవరూ రాణించకపోయిన దాని ప్రభావం జట్టు ఫలితంపై స్పష్టంగా కనిపిస్తోంది.

DO YOU LIKE THIS ARTICLE?