నిర్లక్ష్యం శాపమై..

సవాల్‌గా మారనున్న వలస
ఉత్పత్తి రంగంపై తీవ్ర ప్రభావం
భారంకానున్న ఉపాధి కల్పన
ప్రజాపక్షం/ ఖమ్మం బ్యూరో : వలస జీవనం ఇనాటిది కాదు. అనాదిగా సాగుతోంది. వందల కిలోమీటర్లు వెళ్లి తమకు తెలిసిన పని చేసుకుంటూ జీవించే వారి సంఖ్య దేశంలో కోట్లలోనే ఉంది. కరోనా మహమ్మారి వలస జీవితాలను ఛిద్రం చేసింది. కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌తో ఉపా ధి కోల్పోయి చెప్పనలవి కాని బాధలు పడ్డారు. కర్మాగారాలతో సహా మొత్తం స్తంభించిపోవడంతో పూటగడవడం భారమైంది. ఈ దశలో తమను స్వస్థలాలకు పంపమని కూలీలు చేసిన డిమాండ్‌ను కూడా పాలక వర్గాలు నెరవేర్చ లేదు. చంటి పిల్లలను ఎత్తుకుని నెత్తిన సామాన్ల మూటలు పెట్టుకుని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి స్వస్థలాలకు కొందరు చేరుకోగా, మరి కొందరు చేరుకుంటున్నారు. ఆదుకోవడం కాదు కదా.. పట్టించుకోవడం లేదన్న అపవాదును పాలకులు మూటకట్టుకున్నారు. ప్రశ్నిస్తే చెప్పే కోట్లాది రూపాయల సహాయ నిధి ఏ దరిచేరిందో కానీ.. వలస కూలీలకు అంద లేదన్నది వాస్తవం. వలస కూలీలు పూర్తిగా స్వస్థలాలకు చేరితే దేశీయ ఉత్పత్తిరంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. కొన్ని కర్మాగారాలు పూర్తిగా మూతపడే ప్రమాదం ఉంది. నైపుణ్యత గల, నైపుణ్యత లేని రంగాల్లోనూ సగ భాగం వలస కార్మికులదే. ఖమ్మం జిల్లాలో గ్రానైట్‌ పరిశ్రమలో సుమారు 60 వేల మంది కూలీలు పనిచేస్తుండగా ఇందులో 55వేల మంది వలస కార్మికులు ఉండడం గమనార్హం. వలస కార్మికులు లేకపోతే గ్రానైట్‌ పరిశ్రమ గడ్డు స్థితిని ఎదుర్కొక తప్పదు. ఇటుక, సున్నం, పెంకు ఫ్యాక్టరీలలోనూ శ్రమ మొత్తం వలస కార్మికులదే. హమాలీలుగా బీహార్‌కు చెందిన వేలాది మంది కార్మికులు తెలంగాణలో పని చేస్తున్నారు. నిర్మాణ రంగంలోనూ, ఇతరత్రా పనులు చేస్తున్న వారిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే ఎక్కువ. హైదరాబాద్‌ నగరంలో ఇండ్లలో పనిచేసే కార్మికుల సంఖ్య 50 వేల పైమాటే. ఇప్పుడు వారంతా స్వస్థలాలకు చేరడంతో కూలీల కొరత తీవ్రమైంది. మరో పక్క వలస కూలీలంతా గ్రామాలకు చేరడంతో వీరందరికీ ఉపాధి చూపడం సమస్యగా మారనుంది. లాక్‌డౌన్‌లో వలస కూలీల్లో ఆత్మస్థుర్యైం నింపి ఆర్థిక వెసులుబాటు కల్పిస్తే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదు. లాక్‌డౌన్‌ ఇబ్బందులు చవిచూసిన తర్వాత తిరిగి వలస వెళ్లడమంటే వణికిపోతున్నారు. ఇబ్బందుల్లో యాజమాన్యాలను కాదు అందులో పనిచేస్తున్న కూలీల సంక్షేమం గురించి ఆలోచించడం ఇప్పటికైనా పాలకులు మొదలు పెడితే మంచిది.

DO YOU LIKE THIS ARTICLE?