నిరుద్యోగానికి పరిష్కారమేదీ?

కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీ పట్ల సిపిఐ, ఎఐటియుసి అసంతృప్తి

ప్రజాపక్షం/న్యూఢిల్లీ ; కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారంనాడు ప్రకటించిన తొలి దశ ఆర్థిక ప్యాకేజీ పట్ల సిపిఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు పార్టీ జాతీయ కార్యదర్శివర్గం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. కరో నా విజృంభణ, లాక్‌డౌన్‌ ప్రభావం వల్ల రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, అయి తే రాష్ట్రాలకు చేయూతనిచ్చే విధంగా ఈ ప్యాకేజీ లేదని విమర్శించింది. సమాఖ్య స్ఫూర్తికే ఇది విరుద్ధమని వ్యాఖ్యానించిం ది. దేశం తీవ్ర సవాళ్లు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ప్యాకేజీ ప్రకటించేటప్పుడు అన్ని వర్గాలను దృష్టిలో వుంచుకోవాలని, కానీ కేంద్రం బాధిత వర్గాలను పట్టించుకున్న ట్లు కన్పించలేదని తెలిపింది. పెరుగుతున్న నిరుద్యోగానికి కేంద్రం ఎలాంటి పరిష్కారం చూపడం లేదని, భవిష్యత్‌లో ఇది మరింత ముప్పు కలిగించబోతున్నదని హెచ్చరించింది. ఎంఎస్‌ఎంఇలకు భారీగా ప్యాకేజీ ఇచ్చినట్లు కేంద్రం చెప్పుకుంటున్నదని, అయితే ఎంఎస్‌ఎంఇల అసలు నిర్వచనం ఏంటో చెప్పాలని ప్రశ్నించింది. ఇది పేరుకే ఎంఎస్‌ఎంఇలని, ఇది కార్పొరేట్‌ శక్తులకే లాభదాయకమని సిపిఐ విమర్శించింది. ఆరోగ్యం, గృహనిర్మాణం, ప్రాతిపదిక సౌకర్యాల్లో ప్రభుత్వ రంగ పాత్రను పెంచే విధంగా ప్యాకే జీ లేదని, పేరుకే స్వావలంబన గురించి చెప్పుకుంటున్నారే తప్ప ఆచరణాత్మకంగా అది కన్పించడం లేదని వ్యాఖ్యానించింది. కార్మికులకు, వ్యవసాయ రంగానికి మరింత సాయం అందజేయాలని సిపిఐ డిమాండ్‌ చేసింది.
నగదు బదిలీ చేయాలి : ఎఐటియుసి
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ పట్ల ఎఐటియుసి అసంతృప్తి ప్రకటించింది. ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి అమర్‌జీత్‌ కౌర్‌ గురువారంనాడు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో 6 కోట్లకు పైగా ఎంఎస్‌ఎంఇలు వుండగా, ప్రభుత్వ అరాచక ఆర్ధిక విధానాల పుణ్యమా అని అవి 40 లక్షలకు పడిపోయాయని, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు ఎంఎస్‌ఎంఇలకు ప్యాకేజీలు ప్రకటించడం విడ్డూరంగా వుందన్నారు. పైగా వాస్తవ రూపంలో ఈ ప్యాకేజీ పూర్తిగా కార్పొరేట్‌ రంగానికి లబ్ధిచేకూరనుందని అన్నారు. ఆరేళ్లుగా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక నమూనా కార్మిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టిందని, మూడు దశల లాక్‌డౌన్‌ ముగిసినా ఇప్పటివరకు వలస కార్మికులను ఆదుకోవడానికి కేంద్రం ఒక రూపాయి కూడా వెచ్చించలేదని ఆరోపించారు. ఇపిఎఫ్‌ను ప్రభుత్వమే భరిస్తుందని చెప్పినప్పటికీ, పిఎఫ్‌ సౌకర్యం లేని కార్మికులు 45 కోట్ల మంది ఉన్నారన్న సంగతి మర్చిపోరాదని పేర్కొన్నారు. కార్మికులు, ఉద్యోగులకు నిజంగానే సాయం చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి వుంటే, తక్షణమే మూడు నెలలపాటు రూ. 7,500 చొప్పున నగదు బదిలీ చేయాలని అమర్‌జీత్‌ కౌర్‌ డిమాండ్‌ చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?