నిరాశ పడొద్దు : జడేజా

లండన్‌ : ప్రపంచకప్‌కు ముందు సన్నాహక మ్యాచ్‌ను భారత్‌ పరాజయంతో ప్రారంభించిన విషయం తెలిసిందే. శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ ఓటమితో భారత అభిమానులు తీవ్ర నిరాశకులోనయ్యారు. ప్రపంచకప్‌ హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన జట్టు ఆ స్థాయికి తగ్గ ప్రదర్శ కనబర్చకుండా కుదేలవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా స్వింగ్‌ దెబ్బకు భారత బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టడం మన బలహీనతను తెలియజేసింది. ఇక ఈ మ్యాచ్‌లో అందరూ చేతులెత్తేసినా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (50 బంతుల్లో 54; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మాత్రం చిరస్మరణీయ హాఫ్‌ సంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌ అనంతరం జడేజా మాట్లాడుతూ.. ఒక్క మ్యాచ్‌ ఓటమితో బాధపడవద్దని, ఆటగాళ్లపై ఓ అంచనాకి రావద్దని విజ్ఞప్తి చేశాడు. ‘ఇది మా తొలి మ్యాచ్‌. ఒక్క చెత్త ఇన్నింగ్స్‌లో ఆటగాళ్లను జడ్జ్‌ చేయవద్దు. బ్యాటింగ్‌ విభాగం గురించి బాధపడాల్సిన అవసరమే లేదు. ప్రపంచ మేటీ బ్యాటింగ్‌లైనప్‌ మనకుంది. ఇంగ్లాండ్‌లో ఫ్లాట్‌ పిచ్‌లు ఎప్పుడూ కఠినమే. ఇక్కడ కుదరురుకోవడానికి కొంత సమయం కావాలి. ఇక మేమంతా దానిపైనే కసరత్తులు చేస్తున్నాం. దీనికి బాధపడాల్సిన అవసరమే లేదు. మేం మంచి క్రికెట్‌ ఆడుతాం. బ్యాటింగ్‌ విభాగం నైపుణ్యం కోసం చాలా కష్టపడుతుంది. అంతా అనుభవం ఉన్న ఆటగాళ్లే. ఎవరు అధైర్యపడవద్దు. వార్మప్‌ మ్యాచ్‌ పిచ్‌ ఇంగ్లీష్‌ పరిస్థితులకు అనువైనది. మొదటి ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌కు అనుకూలించిన ఈ పిచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు అనుకూలించింది. ఇక తర్వాత జరిగే మరో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో సత్తా చాటి ప్రపంచకప్‌కు సమరోత్సాహంతో సిద్ధమవుతామని జడేజా వివరించాడు.

DO YOU LIKE THIS ARTICLE?