నిజామాబాద్‌లో ఎన్నికలు వాయిదా?

రెండు మూడు రోజుల్లో తెలుస్తుంది
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌

ప్రజాపక్షం / హైదరాబాద్‌ : నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికలు వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. నామినేషన్‌ల ఉపసంహరణ గడువు ముగిసేసరికి 185 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో ఇవిఎంలతో కాకుండా అనివార్యంగా బ్యా లెట్‌ పేపర్ల ద్వారానే ఎన్నికలను నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాలెట్‌ పేపర్‌ ద్వారానే నిజామాబాద్‌ ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ సష్టం చేశారు. పోలింగ్‌కు ఇంకా రెండు వారాల మిగలడంతో 185 మంది అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు, బ్యాలెట్‌ పేపర్‌ ముద్రణ, వాటికి సరిపడిన బ్యాలెట్‌ బాక్సులను సమకూర్చుకోక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. బ్యాలెట్‌ పేపర్‌లో తొలుత గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, ఆ తరువాత ప్రాంతీయ పార్టీలు, తరువాత కామన్‌ సింబల్‌ పొందిన రిజిస్టర్డ్‌ పార్టీలు వరుస క్రమంలో ముందుంటాయి. వాటి తరువాత స్వతంత్ర అభ్యర్థుల పేర్లు అక్షర క్రమంలో ఉంటుంది. అయితే ప్రస్తుతం ఎన్నికల కమిషన్‌ వద్ద 93 ఫ్రీ సింబల్స్‌ ఉన్నాయి. వాటి నుండి స్వతంత్ర అభ్యర్థులు మూడు ఆప్షన్స్‌ ఇవ్సాల్సి ఉంటుంది. ఈ వ్యవహారమంతా పూర్తి కావడానికి సమయం తీసుకునే అవకాశముంది. పైగా ఒక్కరి పేరులో అక్షరం అటూ ఇటూ పోయినా, గుర్తులు తారుమారైనా ఎన్నిక రద్దయ్యే అవకాశం ఉన్నది. నిజామాబాద్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నివేదించారు. ఎన్నికల నిర్వహణకు ఇతర నియోజక వర్గాల్లో తీసుకుంటున్నట్లుగానే నిజామాబాద్‌లోనూ ఏర్పాట్లకు సంబంధించి తీసుకుంటామని, అయితే 185 మంది పోటీలో ఉండడంతో వారికి గుర్తుల కేటాయింపు మొదలుకొని పేర్ల సరిగ్గా ముద్రించుకునేలా తమకు సమయం ఉండాలని రజత్‌ కుమార్‌ మీడియాకు తెలిపారు. గుర్తుల కేటాయింపునకు అభ్యర్థులకు సమయం ఇవ్వాల్సి ఉంటుందని, ఒక్కో అభ్యర్థి తమకు ఫలానా గుర్తు కావాలని కోరుకుంటారని, ఈ ప్రక్రియకే ఐదురోజులు పడుతుందన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?