నామ్‌కే వాస్తే!

కంటైన్మెంట్‌ ఏరియాలు మినహా అన్నీ గ్రీన్‌జోన్లే
రాష్ట్రంలో 31వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు
రాత్రి కర్ఫ్యూ యథావిధిగా కొనసాగింపు
ఆర్‌టిసి బస్సుల రవాణాకు అనుమతి
హైదరాబాద్‌లో సిటీ బస్సులు, అంతర్రాష్ట్ర బస్సులు నడవవు

ప్రార్థనా మందిరాలు మూసివేత, మతపరమైన ఉత్సవాలపై నిషేధం
ఫంక్షన్‌ హాల్స్‌, సినిమా హాల్స్‌, మాల్స్‌, సభలు, ర్యాలీలు, సమావేశాలు, విద్యాసంస్థలు, బార్లు, క్లబ్బులు, పబ్బులు, స్పోర్ట్‌, స్విమ్మింగ్‌ పూల్స్‌, పార్కులు, జిమ్‌లు, మెట్రో రైల్‌ సేవలు బంద్‌
మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వెల్లడి

ప్రజాపక్షం/హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ను ఈనెల 29 నుంచి 31వరకు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. కంటైన్మెంట్‌ ఏరియాలు మినహా అన్ని జోన్లను గ్రీన్‌ జోన్లేనని సిఎం వెల్లడించారు. హైదరాబాద్‌ నగరం మినహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అన్నిరకాల దుకాణాలు ప్రారంభించవచ్చన్నారు. కంటైన్మెంట్‌ ఏరియాలో ఎట్టి పరిస్థితుల్లో ఏదీ తెరువద్దని, జిహెచ్‌ంఎసి పరిధితో పాటు మిగతా ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పద్దతిలో, సరి బేసి సంఖ్యలో దుకాణాలు తెరువచ్చన్నారు. ప్రజా రవాణాకు అనుమతిస్తున్నామని, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు వందశాతం యథావిధిగా కార్యకలాపాలు కొనసాగతాయన్నారు. ఉత్పత్తి సంస్థలు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ యథావిధిగా కొనసాగుతుందన్నారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం సాయంత్రం ప్రగతిభవన్‌లో జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అనంతరం సిఎం కెసిఆర్‌ మీడియాకు వివరించారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఆర్‌టిసి బస్సులను అనుమతిస్తున్నట్లు సిఎం చెప్పారు. ఇతర రాష్ట్రాల బస్సులు తెలంగాణ రాష్ట్రానికి అనుమతించబోమని, టిఎస్‌ఆర్‌టిసి బస్సులను ఇతర రాష్ట్రాలకు నడపబోమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో సిటీ బస్సులు నడపబోమన్నారు. ఆర్‌టిసి బస్సులలో కూడా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తారన్నారు. ఆటోలు, ట్యాక్సీలు అనుమతినిస్తారని, ఆటో, ట్యాక్సీలో నిబంధనలు పాటించాలని, లేదంటే పోలీసులు జరిమానా విధిస్తారన్నారు. సెలూన్‌ షాపులు, ఇ సంస్థలకు వంద శాతం అనుమతి ఉంటుందన్నారు. మతాలు ప్రార్థన మందిరాలు, మతపరమైన ఉత్సవాలపై నిషేధం ఉంటుందన్నారు. ఫంక్షన్‌హాల్స్‌, సినిమా హాల్స్‌, మాల్స్‌, సభలు, ర్యాలీలు, సమావేశాలు, విద్యాసంస్థలు, బార్లు, క్లబ్బులు, పబ్బులు, స్పోర్ట్‌, స్విమ్మింగ్‌ ఫూల్స్‌, పార్కులు, జిమ్ములు, మెట్రో రైల్‌ సేవలు ఇంతకుముందు మాదిరిగానే మూసి ఉంటాయని సిఎం వివరించారు. మాస్కులు తప్పనిసరిగా బంద్‌ పాటించాలన్నారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత శానిటైజ్‌ చేసుకోవాలని సూచించారు. వినియోగదారులు కూడా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని చెప్పారు. అవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని, అవసరం లేని వారు బయటకు వచ్చి హంగామా సృష్టించవద్దని, లేదంటే తిరిగి పూర్తిగా లాక్‌డౌన్‌ను పాటించాల్సి ఉంటుందని సిఎం హెచ్చరించారు. 65 సంవత్సరాలు దాటిన వారు ఎక్కడపడితే అక్కడ తిరుగొద్దని, వారిని కాపాడుకోవాలని కెసిఆర్‌ కోరారు. ఇప్పటి వరకు నిబంధనలు పాటించి ప్రజలు సహకరించారని, ఫలితంగానే కరోనాను బాగానే నియంత్రించామని, ఇబ్బందులు రాలేదని, ఇలాగే కొనసాగితే తక్కువ కాలంలోనే కరోనా ప్రమాదం నుంచి బయటపడతామని సిఎం అన్నారు. 1452 కుటుంబాలు కంటైన్మెంట్‌ ఏరియాలో ఉన్నాయని, ఈ ప్రాంతాల్లో పోలీసు పహారా ఉంటుందని, వీరికి అన్ని ఏర్పాట్లు చేస్తామని, వారికి ఆహార సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పారు. నగర ప్రజల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయించామని, మరో గత్యతరం లేదని, అందరి భవిష్యత్‌ ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయించామన్నారు. ప్రపంచం మొత్తం వైద్య శాస్త్రవేత్త లు, నిపుణులు రేపో, మాపో వచ్చే పరిస్థితి తెలియదని, ఎన్ని మాసాలు ఉంటుం దో కచ్చితంగా చెప్పే పరిస్థితి లేదన్నారు. కరోనాతో కలిసి జీవించే పరిస్థితి నేర్చుకోవాలని చెప్పారు. కరోనా రెండూ పోవాల్సిందేనని, బతుకు కొనసాగాలని, బతుకు బంద్‌ పెట్టి అనేక మాసాలు కూర్చోలేమని సిఎం కెసిఆర్‌ స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం
నీటి వాటాపై స్పష్టమైన అవగాహన ఉంది: సిఎం
ప్రజాపక్షం/హైదరాబాద్‌: ఉమ్మడి రాష్ట్రంలో కేటాయింపుల మేరకే ప్రాజెక్ట్లు కట్టుకున్నామని, పోతిరెడ్డిపాడుపై సమయం వచ్చినప్పుడు స్పందిస్తాని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నా రు. నీటి వాటాలపై తెలంగాణ రాష్ట్రానికి స్పష్టమైన అవగాహన ఉందని, తమకున్న వాటా మేరకు నీళ్లను వాడుకుంటున్నామని సిఎం చెప్పారు. గోదావరి మిగులు జలాలు ఎవరు వాడుకున్నా అభ్యంతరం లేదని, గోదవారి మిగులు జలాలను రాయలసీమ వాడుకోవచ్చన్నారు. తెలంగాణ ప్రజలకు భంగం కలిగితే మాత్రం ఊరుకునేది లేదని సిఎం అన్నారు. కృష్ణా జలాల విషయంలో మాత్రం రాజీపడే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం సాయంత్రం ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్‌ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అనంతరం సిఎం మీడియా సమావేశంలో వివరించారు. చట్టం పరిధిలో తమ ప్రజలకు న్యాయం చేస్తామని సిఎం చెప్పారు. బాబ్లీపై పంచాయతీ పెట్టి ఏం సాధించారని సిఎం కెసిఆర్‌ ప్రశ్నించారు. పోతిరెడ్డి పాడు గురించి ఎవరు కొట్లాడారో ప్రజలకు తెలుసునని, పోతిరెడ్డి అతిభయంకరంగా పోరాటం చేశానని, వివాదాలకు పోకుండా సమస్యలు పరిష్కరించుకుంటామని ఆయన చెప్పారు. నీళ్ల గురించి, కెసిఆర్‌ గురించి ప్రతిపక్షాలు మాట్లాడడం పరువు తీసుకోవడమేనన్నారు. ఆంధ్ర సిఎం సంచులు మోసిన వారు ఎవరో తెలుసునన్నారు. పాలమూరు ఎత్తిపోతల సుప్రీం కోర్టులో కేసు వేశారని, ఆర్డర్‌ ఇచ్చారని, ఆపెక్స్‌ కమిటీ పో మ్మటే పోయామని, చట్టం పరిధిలో తమ ప్రజలకు న్యాయం చేసేందుకు క ట్టుబడి ఉన్నామని, ఉల్లంఘించలేదని, వివాదాలకు పోదల్చుకోలేదని, ధై ర్యం ఉండే వ్యక్తిని అన్నారు. ప్రతిపక్షాల గురించి పట్టించుకోవద్దని ప్రజలు చెబుతున్నారన్నారు. బేసిన్లు లేవని, బేషజాలు లేవని ఇరు రాష్ట్రాలకు సరిపో ను నీటి లభ్యత నదుల్లో ఉందన్నారు. చంద్రబాబు బాబ్లీ పంచాయతీ పెట్టి ఏమి సాధించారని, కృష్ణాలో ఒక టిఎంసి కోసం బస్తీమే సవాల్‌ అని వివాదా లు తెచ్చుకున్నారరని, నేడు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం సామరస్యపూర్వకంగా వారికి చెప్పి మహారాష్ట్ర నుండి నీటిని తీసుకొచ్చామని సిఎం కెసిఆర్‌ చెప్పారు. రాయలసీమకు నీరు గోదావరి నుండి మిగులు జలాలు తీసుకుంటే తమకు అభ్యంతరం లేదని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగితే ఒక్క క్షణం కూడా ఆగబోమని, వ్వరితో రాజీ పడే ప్రసక్తే లేదని సిఎం స్పష్టం చేశారు. గోదావరి జలాలు ఎక్కడికి తీసుకెళ్లినా తమకు అభ్యంతంర లేదని చెప్పారు. తమకు రెండు నాల్కలు లేవని, తమను దెబ్బకొట్టే పద్ధతిలో ఉంటే తప్పకుండా నిరసన తెలుపుతామన్నారు. గోదావరిలో నిపుణుల కమిటీ తమ వాటా పోను 650 మిగులు జలాలు కావాలని అడుతున్నామన్నారు. తాగు , సాగు నీటి విషయంలో పొరుగు రాష్ట్రాలతో కలిసే పనిచేస్తున్నామని, వివాదా లే లేవని, అన్యోన్యంగా ఉన్నామని, దీంతో కొందరి కండ్లు మండుతున్నాయన్నారు.

రాష్ట్రాలు బిచ్చగాళ్లా?
పన్నులు పెంచితే డబ్బులిస్తారా
విద్యుత్‌ సంస్కరణలు అమలు చేయం
కేంద్రంపై ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆగ్రహం

ప్రజాపక్షం/హైదరాబాద్‌ : కేంద్ర ప్యాకేజీ ఒక పచ్చిమోసం, దగా, అంకెల గారడీ, అంతా గ్యాస్‌ అని సిఎం కెసిఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర విద్యుత్‌ సంస్కరణలు అమలు చేయబోమని, ఆ ముష్టి రెండున్నర కోట్ల రూపాయలు తీసుకోబోమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాజ్యాంగబద్ధమైనవేనని, కేంద్రానికి సబార్డినెట్స్‌ కావన్నారు. రాష్ట్రాలను కేంద్రం బిచ్చగాళ్లుగా చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాలపైన ఇలాంటి పెత్తనాలు చెలాయించడం సమాఖ్య వ్యవస్థకే విఘాతమని, ప్రధాని మోడీ చెప్పిన సమాఖ్య వ్యవస్థ పూర్తి ఢొల్ల, బోగస్‌ అని కేంద్ర ప్యాకేజీతో తేలిపోయిందన్నారు. కేంద్ర ప్యాకేజీ ఒక దుర్మార్గమైన ప్యాకేజీ అని, నియంతృత్వ వైఖరితో ఉన్నదని ఖండించారు. రాష్ట్రాలను కేంద్రం బిచ్చగాళ్లుగా బావిస్తుందని, కేంద్ర సంస్క రణలు అంటే ఇదేనా అని ప్రశ్నించారు. కేంద్రం రాష్ట్రానికి రెండు శాతం ఎఫ్‌ఆర్‌బిఎం పెంచిందని, తద్వారా అదనంగా మరో రూ.20 వేల కోట్ల రుణానికి అనుమతి వస్తుందని, దీనిని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి వస్తుందని వివరించారు. దీనికి కూడా దరిద్య్ర ఆంక్షలు ఉన్నాయన్నారు. ప్రతి రూ. 2500 కోట్లకు సంస్కరణల్లో భాగంగా ఆంక్షలు విధించారని వివరించారు. విద్యుత్‌ సంస్కరణాల్లో భాగంగా ప్రజల నెత్తిమీద కత్తి పెడితే రూ.2500 కోట్లు, ఇస్తారంటా..?,మార్కెట్‌ కమిటీల్లో కేంద్ర సంస్కరణలు అమలు చేస్తే మరో రూ. 2500 కోట్లు ఇస్తారంట, మున్సిపాలిటీల్లో ఆస్తిపన్నులను పెంచి ప్రజలపైన భారం వేస్తే ఇంకో రూ. 2500 కోట్లు ఇస్తరంట దీనిని ప్యాకేజి అంటారా..? దీనిని ఏమనలి, రాష్ట్రాలను ప్రొత్సహించే విధానం ఇదేనాఅని కెసిఆర్‌ ప్రశ్నించారు. మార్కెట్‌ కమిటీల్లో కూడా కేంద్ర సంస్కరణలు అమలు చేస్తే ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎందుకన్నారు. దీనిని ప్యాకేజీ అనరని, ఫెడరల్‌ వ్యవస్థలో అవలంభించాల్సిన విధానం ఇది కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పట్ల వ్యవహారించే తీరు దుర్మార్గమన్నారు. ఇలాంటి ప్యాకేజీతో కేంద్ర ప్రభుత్వం తన పరువు తానే తీసుకుందని, ఇది బోగస్సా, మంచిదా అనేది రానున్న రోజుల్లో తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. కేంద్ర వ్యవహార శైలి బాధకరమన్నారు. కేంద్రం చాలా దారుణంగా వ్యవహారిస్తోందన్నారు. విపత్కర పరిస్థితుల్లో ఇది చేస్తేనే పైసలు ఇస్తామని పిల్లల కొట్లాటలాగా ఉన్నదని చెప్పారు. “మెడమీద కత్తిపెట్టి నువ్వు కరెంటు సంస్కరణ చేయి చేస్తే నీకు బిచ్చమిస్త రెండు వేల కోట్లు” అని కేంద్రం చెబుతుందన్నారు. శిశుపాలునికి వంద తప్పులు నిండాలని, తప్పులు పండిన తర్వాత ఎలా ఫైటింగ్‌ ఉంటుదో చూడాలని ఒక ప్రశ్నకు సిఎం సమాధానమిచ్చారు.

DO YOU LIKE THIS ARTICLE?