నవలా రచయిత అమితవ్‌ ఘోష్‌కు జ్ఞానపీఠ్‌ అవార్డు

న్యూఢిల్లీ : ప్రముఖ నవలా రచయిత అమితవ్‌ ఘోష్‌కు 2018వ సంవత్సరానికి గాను జ్ఞానపీఠ్‌ అవార్డు లభించింది. దేశంలోనే అత్యున్నత సాహితీ పురస్కారమైన జ్ఞానపీఠ్‌ అవార్డు ఎంపిక కమిటీకి నవలా రచయిత ప్రతిభా రే ఛైర్మన్‌గా వ్యవహరించారు. ప్రతిభా రే అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో అమితవ్‌ ఘోష్‌కు ఈ ఏడాది జ్ఞానపీఠ్‌ అవార్డు ఇవ్వాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. అమితవ్‌ ఘోష్‌ దేశం గర్వించదగ్గ ఒక గొప్ప నవలా రచయిత అని కమిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. 1956లో జన్మించిన అమితవ్‌ ఘోష్‌ కాల్పనిక, కాల్పనికేతర నవలను ఎన్నింటినో రాశారు. ఆయన రాసిన ప్రధాన నవలల్లో ది సర్కిల్‌ ఆఫ్‌ రీజన్‌ (1986), షాడో లైన్స్‌ (1988), ది కలకత్తా క్రోమోజోమ్‌ (1995), సీ ఆఫ్‌ పాపీస్‌ (2008) వంటివి వున్నాయి. 2007లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ఇచ్చి సత్కరించింది.

DO YOU LIKE THIS ARTICLE?