నరేంద్ర మోడీని దించాల్సిందే

దేశంలో శాంతికి, భద్రతకు, భవితకు అది అనివార్యం
మోడీకి, కెసిఆర్‌కు మధ్య రహస్య ఒప్పందం
భువనగిరిలో సిపిఐ అభ్యర్థి గోదా శ్రీరాములు గెలుపును కాంక్షిస్తూ జరిగిన బహిరంగసభలో వామపక్ష నాయకులు

ప్రజాపక్షం/ యాదాద్రి భవనగిరి : కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ అరాచక పాలనకు అంతు లేకుండా పోయిందని, దేశంలో శాంతికి, భద్రతకు, భవితకు ఆయనను గద్దె దించాల్సిన అవసరముందని వామపక్ష నాయకులు అన్నా రు. మోడీకి, కెసిఆర్‌కు మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని చెప్పారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో భారత కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి గోదా శ్రీరాములు గెలుపును కోరుతూ యాదా ద్రి భువనగిరి జిల్లా కేంద్రమైన భువనగిరి రైల్వేస్టేషన్‌ నుంచి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వరకు భారీ ప్రదర్శన జరిగింది. అనంతరం జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ మాజీ ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ బహిరంగ సభకు సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ ఎమ్మెల్సీ అజీజ్‌ పాషా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బహిరంగ సభకు ముఖ్య విచ్చేసిన సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ నిస్వార్థ కార్యకర్త, అలుపెరగని పోరాట ఉద్యమకారుడు, ప్రజల మనిషి గోదా శ్రీరాములుకు అధిక సంఖ్యలో ఓట్లు వేసి, అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. పెద్ద నోట్ల రద్దుతో వ్యాపారస్థులు,పేదలు అధికంగా చితికిపోయారని, జిఎస్‌టితో వ్యాపారస్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. మోడీ ప్రభుత్వ విదేశాల నుంచి నల్లధనం తీసుకురాలేదని కానీ, పెద్ద నోట్ల రద్దు చేసి దేశం నల్లధనాన్ని తెల్లధనంగా మార్చిందన్నారు. దేశంలో అవినీతిని, అన్యాయాన్ని ఎదుర్కొవటానికి ప్రాతినిథ్యం ఉండాలని, దేశానికి కమ్యూనిస్టుల అవసరం తప్పనిసరని ఆయన అన్నారు. రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఫ్రాన్స్‌ కుంభకోణం అనిల్‌ అంబానీ లాంటి పెట్టుబడిదారులను బిజెపి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ ఎమ్మెల్సీ అజీజ్‌ పాషా, పశ్య పద్మ, సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎం.డి. జాంగీర్‌, సిపిఐ సహ కార్యదర్శులు యానాల దామోదర్‌రెడ్డి, బోలగాని సత్యనారాయణ, సిపిఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి పల్లా నరసింహారెడ్డి, ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఉజ్జిని రత్నాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.డి.ఇమ్రాన్‌,ఏశాల అశోక్‌, రాజయ్య, ముత్యాలు, బండి జంగమ్మ, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?