ధోనీ అరుదైన రికార్డు..

హామిల్టన్‌: భారత సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టి20 భారత్‌కు ప్రతినిథ్యం వహించిన ధోనీ ఓవరాల్‌గా తన కెరీర్‌ 300వ టి20 మ్యాచ్‌ ఆడాడు. మరోవైపు ఈ ఘనతను అందుకున్న తొలి భారత ఆటగాడిగా కూడా ధోనీ రికార్డుల్లోకెక్కాడు. ఇక భారత్‌ తరఫున మిస్టర్‌ కూల్‌ ధోనీ మొత్తం (96) అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడాడు. భారత ధనాధన్‌ టోర్నీ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపిఎల్‌)లో మొత్తం (175) మ్యాచ్‌లు, చాంపియన్స్‌లీగ్‌ టి20ల్లో (24) మ్యాచ్‌లు, తన రాష్ట్ర జట్టు జార్ఖండ్‌ తరఫున (14) మ్యాచ్‌లు, ఫస్ట్‌ క్లాస్‌ టి20లో (1) మ్యాచ్‌ ఆడడంతో ఓవరాల్‌గా పొట్టి ఫార్మాట్‌ క్రికెట్‌లో 300 మ్యాచ్‌లు పూర్తి చేసుకొన్న ఘనతను సొంతం చేసుకున్నాడు. తాజా మ్యాచ్‌తో టి20ల్లో 300 మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్ల జాబితాలో చేరాడు. ఈ జాబితాలో వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌ (446 మ్యాచ్‌లు) అందరికంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక క్రిస్‌ గేల్‌ (వెస్టిండీస్‌), డ్వేన్‌ బ్రావో (వెస్టిండీస్‌), షోయమ్‌ మాలిక్‌ (పాకిస్థాన్‌) ధోనీ కంటే ముందు ఈ జాబితాలో చేరారు. ఇక భారత్‌ తరఫును హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ (296 మ్యాచ్‌లు), సురేశ్‌ రైనా (296) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 300 క్లబ్‌లో చేరిన ధోనీకి సోషల్‌ మీడియాలో అభినందనల వర్షం కురిసింది. మాజీలతో పాటు అభిమానులు భారీ సంఖ్యలో ధోనీకి విషేస్‌ తెలియజేశారు.

DO YOU LIKE THIS ARTICLE?