ధోనీకి జరిమానా

జైపూర్‌ : చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీకి పెద్ద జరిమానా పడింది. రాజస్థాన్‌ రాయల్స్‌తో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌ సందర్భంగా డగౌట్‌లో ఉన్న ధోనీ మైదానంలోకి ప్రవేశించి అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. అయితే, ధోని చర్యను ఐపిఎల్‌ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన రెండో స్థాయి నేరంగా పరిగణిస్తూ జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. క్రీడా స్ఫూర్తిని దెబ్బతీసినందుకు గానూ ఐపిఎల్‌ యాజమాన్యం ఆర్టికల్‌ 2.20 ప్రకారం శిక్షలు విధిస్తుంది. దీంతో ధోనికి మ్యాచ్‌ ఫీజులో 50శాతం కోత పడింది.
అసలేం జరిగిందంటే..
జైపూర్‌ వేదికగా గురువారం చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. 155 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన చెన్నైకి ఆఖర్లో మూడు బంతులకు 9 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో ఉన్న శాంట్నర్‌కు రాజస్థాన్‌ బౌలర్‌ బెన్‌ స్టోక్స్‌.. వికెట్ల కంటే ఎత్తులో బంతిని విసిరాడు. మైదానంలో అంపైర్లులుగా ఉన్న ఉలాస్‌ గాందే, బ్రూస్‌ ఆక్స్ఫర్డ్‌ తొలుత ఆ బంతిని నో బాల్‌గా ప్రకటించారు. తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కితీసుకున్నారు. దీంతో డగౌట్లో ఉన్న ధోనీ మైదానంలోకి ఆవేశంగా వచ్చి అంపైర్లతో మాట్లాడుతూ అసహనం వ్యక్తం చేశాడు. అందుకు గానూ ధోనీకి ఐపిఎల్‌ యాజమాన్యం జరిమానా విధించింది.
ధోనీపై మాజీలు మండిపాటు
రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య గురువారం జరిగిన మ్యాచ్‌లో ధోని చర్య వివాధస్పదంగా మారింది. అంపైర్ల నిర్ణయాన్ని తప్పుబట్టిన ధోని డాగౌట్‌ నుంచి నేరుగా మైదానంలోకి వచ్చి వారితో వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. అయితే ధోని తీరుపై పలువురు మాజీ క్రికెటర్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధోని చేసింది ముమ్మాటికీ తప్పేనని చేబుతున్నారు. ఈ అంశంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ మార్క్‌ వా స్పందిస్తూ.. ఐపిఎల్లో ఆటగాళ్లపై ఫ్రాంచైజీల ఒత్తిడి ఉంటుందని నాకు తెలుసు.. కానీ ఇద్దరు కెప్టెన్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, ధోని చర్యలు ఏమాత్రం మంచి పరిణామాలు కావని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ మైకెల్‌ వాన్‌ కూడా కొంచెం ఘాటుగానే స్పందించాడు. ‘ఒక కెప్టెన్‌గా నువ్వు అంపైర్లను గౌరవించాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నాడు. ఈ సంఘటన క్రికెట్‌లో ఒక ఉదాహరణగా మిగిలిపోతుందన్నాడు.
ఇది చాలా చిన్న శిక్షే: మంజ్రేకర్‌
మైదానంలో అంపైర్లతో దురుసుగా ప్రవర్తించిన తీరుకు ధోనికి పడిన శిక్ష చాలా చిన్నదని మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ అభ్రిపాయపడ్డాడు. ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కింద ధోనీకి మ్యాచ్‌ ఫీజులో 50శాతం కోత విధిస్తూ ఐపిఎల్‌ సంఘం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఇది చాలా చిన్న శిక్ష అని.. ధోని తన హద్దులు దాటి ప్రవర్తించాడని మంజ్రేకర్‌ పేర్కొన్నాడు. కాకపోతే అన్ని సందర్భాల్లోనూ అదృష్టం ధోని వెంటే ఉంటోందన్నాడు. ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయాన్ని పోస్టు చేశాడు.

DO YOU LIKE THIS ARTICLE?