ధరణి దరిద్రం

లబోదిబోమంటున్న లక్షల మంది రైతులు
వెబ్‌సైట్‌లో వికారాబాద్‌ జిల్లా రైతుల వివరాలు మాత్రమే
మిగిలిన 32 జిల్లాల రైతులకు లభించని సమాచారం

ప్రజాపక్షం/ హైదరాబాద్‌ : ప్రతి రైతు తన భూ వివరాలను చూసుకునేందుకు ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ఆరు నెలల క్రితం ఏర్పాటు చేసిన ధరణి వెబ్‌సైట్‌ నవ్వులపాలైంది. ఈ వెబ్‌సైట్‌లో 33 జిల్లాలకు చెందిన రైతులకు సంబంధించిన భూ వివరాలు ఉండాలి. అయితే కేవలం వికారాబాద్‌ జిల్లా రైతులకు సంబంధించిన వివరాలు మాత్రమే ప్రస్తుతం ఈ వెబ్‌సైట్‌లో లభ్యమవుతున్నాయి. మిగిలిన 32 జిల్లాలకు చెందిన రైతుల వివరాలు రావడం లేదు. ఈ పరిస్థితి రెండు నెలల నుంచి దాపురించి ఉంది. ఏదైనా రైతు భూమి అమ్మినా, ఖరీదు చేసినా తన భూ వివరాలు ఆన్‌లైన్‌లో చేరింది, లేనిది పరిశీలించుకునేందుకు రైతులకు ఉపయోగకరంగా ఉండేలా ధరణి వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. తన పేరిట ఎంత వ్యవసాయ భూమి ఉంది, ఏ గ్రామంలో ఏ సర్వే నెంబర్‌లో ఏ రైతుల పేర్లపై ఎనెన్ని ఎకరాల భూమి ఉంది అనే వివరాలు ఈ వెబ్‌సైట్‌లో లభించాల్సి ఉంది. అలాగే తన భూమి సర్వేనెంబర్‌ మ్యాప్‌ కొలతతో కూడాన వివరాలు పూర్తిగా లభిస్తుంది. గ్రామ రైతుల పేర్లు, భూ వివరాలు ఒక్క క్లిక్‌తోనే ధరణి వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. అయితే రైతులు తమ భూ వివరాలు తెలుసుకునేందుకు ధరణి వెబ్‌సైట్‌ను తెరిస్తే అందులో తమ జిల్లా పేర్లు కూడా దర్శనమివ్వడంలేదని రైతులు లబోదిబోమంటున్నారు. తన భూమి వివరాలు తెలుసుకోవాలంటే మీ కేంద్రాలకు వెళ్లి అక్కడ ఫీజు చెల్లిస్తే తప్పా వివరాలు తెలుసుకోవడం సాధ్య పడడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కోసారి మీ కేంద్రాలలో సైతం ధరణి వెబ్‌సైట్‌ తెరుచుకోక పోవడంతో నిర్వాహకులు కూడా ఆందోళన వ్యక్తం చేసిన ఉదంతాలు ఉన్నాయి. సర్వర్‌ డౌన్‌ అయ్యిందని, అందుకే ధరణి వెబ్‌సైట్‌ తెచురుకోవడం లేదనే సమాధానం ప్రభుత్వం నుంచి వస్తుండడంతో మీ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే తమకు రావాల్సిన ఉపాధి రాకుండా పోతుందని, మీ కేంద్రంలో అన్ని ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లు సకాలంలో పనిచేస్తేనే తమకు ఎంతోకొంత ఉపాధి దక్కుతుందని వారు వాపోతున్నారు. మంచిర్యాల జిల్లా వెన్నెల మండలం నందుపల్లి గ్రామ రైతు కొండపల్లి శరత్‌తో ఇటీవల సిఎం చంద్రశేఖర్‌రావు ఫోన్‌లో మాట్లాడి అతని భూ సమస్యను పరిష్కరించడం రాష్ట్రంలో చర్చానీయాంశమైంది. రాష్ట్రంలో భూ సమస్యను ఎందుర్కొంటున్న శరత్‌లాంటి రైతులు లక్షలాధి మంది ఉన్నారు. వీరందరి సమస్యను కూడా పరిష్కరించాలని రైతులు సిఎంను కోరుతున్నారు. తమ భూమి అమ్మినా, లేదా ఇతర రైతుల భూమి ఖరీదు చేసినా వాటి వివరాలు తమ పేర్లపై బదిలీ కావడం లేదని వారు వాపోతున్నారు. భూమి క్రయవిక్రయాలు ముందుగా స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో జరుగుతుంది. ఆ తరువాత రిజిస్ట్రేషన్‌ పత్రాలను తీసుకెళ్లి మండల కార్యాలయంలో మోటేషన్‌ కోసం తహసిల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఆ తరువాత ఆ వెంటనే మీ సేవా కేంద్రానికి వెళ్లి అక్కడ కూడా దరఖాస్తు పెట్టుకోవాలి. ఆ దరఖాస్తు ఆన్‌లైన్‌ ద్వారా సంబంధిత తహసిల్దార్‌కు చేరుతుంది. ఆ తరువాత మండల కార్యాలయ సిబ్బంది ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తు వివరాలను తమ వద్ద ఉన్న రికార్డులతో సరిచూసుకుని మోటేషన్‌ కార్యక్రమం తిరిగి ఆన్‌లైన్‌ అంటే ధరణి వెబ్‌సైట్‌ తెరిచి చేయాల్సి ఉంటుంది. అలాగే తమ వద్ద ఉన్న ఆర్‌ఒఆర్‌ బుక్‌లో భూమి అమ్మిన రైతు పేరును తొలగించి, ఖరీదు చేసిన రైతు వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. ఇలా ఆన్‌లైన్‌లో భూమి ఖరీదు చేసిన రైతు వివరాలను పొందు పర్చిన వెంటనే అతనికి పట్టాదారు పాస్‌పుస్తకం జారీ చేయాలి. అయితే ధరణి వెబ్‌సైట్‌ పుణ్యమా అని మోటేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవడం కష్టంగా మారింది. ఒకవేళ దరఖాస్తు పెట్టినా ఆ దరఖాస్తును పరిశీలించేందుకు కూడా అధికారులు వెబ్‌సైట్‌ ద్వారానే చేయాల్సి ఉంటుంది. మండల కార్యాలయాల్లో ఇంటర్‌నెట్‌ సమస్య ఒకటికాగా మరోపక్క సకాలంలో ధరణి వెబ్‌సైట్‌ తెరుచుకోదు.

DO YOU LIKE THIS ARTICLE?