దేశవ్యాప్తంగా స్కూళ్లు, హాళ్లు బంద్‌!

పర్యాటక ప్రదేశాలు కూడా మూసివేత
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ ప్రభావం కారణంగా ఇప్పటికే తెలంగాణ వంటి రాష్ట్రాల్లో విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు తదితర ప్రదేశాలను ఈనెల 31వ తేదీవరకు మూసివేయనుండగా, తాజాగా ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు విడుదల కానున్నాయి. మార్చి 31వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలు (స్కూళ్లు, కాలేజీలు, యూనివర్శిటీలు, శిక్షణా సంస్థలు తదితరాలు), జిమ్‌లు, మ్యూజియంలు, సాంస్కృతిక, సామాజిక కేం ద్రాలు, స్విమ్మింగ్‌ పూల్స్‌, సినిమా ధియేటర్లు, అలాగే ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఎఎస్‌ఐ) పర్యవేక్షణలో నడిచే చారిత్రక ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలను మూసివేయనున్నట్లు కేం ద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌ సోమవారంనాడు తెలిపారు. ఈ అంశాన్ని చాలా సీరియన్‌గా తీసుకోనున్నట్లు చెప్పారు. కోవిడ్‌ 19 పరిణామాలపై సోమవారం మధ్యాహ్నం మంత్రుల కమిటీ (జిఓఎం) సమావేశమై సుదీర్ఘంగా చర్చించింది. కరోనా వైరస్‌ మన దేశంలో రెండో దశలో వుందని, ఎక్కువమంది ప్రజలకు అది సోకాలంటే 15 రోజుల సమయం పడుతుందని, అందుకే ఈ 15 రోజులూ అత్యంత కీలకమైనవిగా కమిటీ అభిప్రాయపడింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు, సినిమా ధియేటర్లు, పర్యాటక ప్రాంతాలను మూసివేయాలని కమిటీ సమావేశం ప్రతిపాదించింది. దీనికి కమిటీ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ పదిహేను రోజుల కాలంలో ఆన్‌లైన్‌ విద్యను ప్రోత్సహించాలని కూడా నిర్ణయించింది. దేశంలో ఎఎస్‌ఐ రక్షణలో 3,691 చారిత్రక నిర్మాణాలు వున్నాయి. ఇవన్నీ పర్యాటక ప్రాంతాలే. ఇక్కడకు వచ్చే సందర్శకుల సంఖ్య విపరీతం. పైగా విదేశీయుల తాకిడి ఎక్కువగా వుండే ప్రదేశాలు ఇవే. అందుకే ఈ ప్రదేశాలను 31వ తేదీ వరకు మూసివేయాలని కమిటీ నిర్ణయించిందని పటేల్‌ తెలిపారు. తాజాగా ఒడిశా, జమ్మూకశ్మీర్‌, లఢక్‌, కేరళలలో ఒక్కొక్కటి చొప్పున నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. హైదరాబాద్‌లో కూడా మరో కేసు నమోదైనట్లుగా భావిస్తున్నారు. ఇప్పటివరకు దేశంలో 10 మంది కరోనా రోగులను డిశ్చార్జి చేయగా, ముగ్గురు ఆరోగ్యవంతులయ్యారు. ఇద్దరు మరణించారు.

DO YOU LIKE THIS ARTICLE?