దేశంలో రికార్డు స్థాయిలో కేసులు

24 గంటల్లో 15,413 పాజిటివ్‌లు నమోదు
మరో 306 మంది మృతి, 13,254కు చేరిన మృతులు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కరాళనృత్యం ఆగడం లేదు. కొత్త కేసుల సంఖ్యలో రోజురోజుకీ రికార్డులు నమోదవుతున్నాయి. వరుసగా 10వ రోజు కూడా 10 వేలకు పైగా మంది కరోనా బారిన పడ్డారు. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య నాలుగు లక్షలు దాటిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం 8 గంటల వరకు గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 15,413 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఒక్కరోజు వ్యవధిలో రికార్డయిన కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,10,461కు పెరిగింది. వీరిలో 1,69,451 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 2,27,755 మంది కోలుకున్నారు. ఇక కొత్తగా 306 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మృతిచెందిన వారి సంఖ్య 13,254కి పెరిగింది. దేశవ్యాప్తంగా రివకరీ రేటు 55.48శాతంగా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. అయితే కోలుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడం కొంత ఊరట కలిగిస్తుంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,90,730 కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వైరస్‌ వెలుగు చూసిన నాటి నుంచి దేశవ్యాప్తంగా 68,07,226 నమూనాలను పరీక్షించారు. ప్రపంచంలో కరోనా మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్‌ ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో కొనసాగుతుండగా, పాజిటివ్‌ కేసుల సంఖ్యలో మాత్రం భారత్‌ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది. రోజువారీగా చూస్తే, అమెరికా, బ్రెజిల్‌, భారత్‌లలోనే నిత్యం అధిక పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇదిలా ఉండగా దేశంలో 8 రోజుల క్రితం మూడు లక్షల కేసులు ఉండగా, ఆదివారం నాటికి నాలుగు లక్షలకు పైగా కేసులు రికార్డయ్యాయి. దేశంలో 100 కేసుల నుంచి తొలి లక్ష కేసులు నమోదవడానికి 64 రోజులు పట్టగా.. 15 రోజుల్లోనే ఆ సంఖ్య రెండు లక్షలు దాటింది. ఆ తరువాత మరో పది రోజుల్లో మూడు లక్షలకు చేరుకుంది. ఇక కేవలం ఎనిమిది రోజుల్లోనే కేసుల సంఖ్య మూడు లక్షల నుంచి నాలుగు లక్షలకు చేరుకోవడం గమనార్హం. జూన్‌ 1 నుంచి 21వ తేదీ వరకు 2,19,926 మందికి పైగా కరోనా బారిన పడ్డారు. బాధితల సంఖ్య పెరుగుతున్న మొ దటి ఐదు రాష్ట్రాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌లు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో నిత్యం గణనీయంగా కొత్త కేసులు వస్తున్నా యి.
ముంబయి విలవిల
మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకీ కేసు ల సంఖ్య పెరిగిపోతుండటంతో దేశ ఆర్థిక రాజధాని నగరమైన ముంబ యి వణుకుతోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 3874 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,54,000 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1,28,205మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా మరో 160మంది మృతి చెందడంతో కొవిడ్‌ బారిన పడి మరణించిన వారి సంఖ్య 5984కి చేరింది. కరోనాతో నెలకొన్న పరిస్థితులతో ముంబయి మహానగరం విలవిలలాడుతోంది. శనివారం నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క ముంబయి నగరంలోనే 1190 కేసు లు వచ్చాయి. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా 160మంది మృతిచెందగా.. వాటి లో 136 ఈ మహానగరంలోనే నమోదు కావడం అక్కడి తీవ్రతకు అద్దం ప డుతోంది. దేశంలోనే అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రంగా తొలి స్థానంలో కొనసాగుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి. శనివారం ఒక్క రోజే 77 మంది మృతి చెందారు. మరణాల సంఖ్యలో ఢిల్లీ దేశంలో రెండవ స్థానంలో ఉండగా, కేసుల సంఖ్యలో మూ డవ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 2,112 మంది చనిపోగా, 53,746 కేసులు నమోదయ్యాయి. అటు తమిళనాడులోనూ కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 56,845 కేసులు నమోదయ్యాయి. కొత్తగా 38 మంది మరణించారు. మొత్త మృతుల సంఖ్య 704కు చేరింది. అయితే కేసుల సంఖ్యలో రెండవ స్థానంలో కొనసాగుతుంది. ఇక గుజరాత్‌లోనూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 26,680 ఉండగా, ఇప్పటి వరకు 1,638 మంది కరోనా కాటుకు బలయ్యారు. మరణాల సంఖ్యలో రాష్ట్రం దేశంలోనే మూడవ స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్‌లో 16,594 కేసులు నమోదు కాగా, 507 మంది మరణించారు. అయితే రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌లోనూ నిత్యం పది నుంచి 15 వేల వరకు కేసులు నమోదయ్యాయి.

DO YOU LIKE THIS ARTICLE?