దంపతుల ఆత్మహత్య

ప్రాణాల మీదకు తెచ్చిన మధ్యవర్తిత్వం
ఉద్యోగాలిప్పిస్తామని ముగ్గురు మోసం చేశారంటూ వీడియోలో మరణ వాంగ్మూలం
రూ.60.24 లక్షలు ముట్టజెప్పినట్లు వెల్లడి
ప్రజాపక్షం/ పరకాలవరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాలలో దంపతులు సెల్ఫీ వీడి యో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం కలకలం సృష్టించింది. మధ్యవర్తిత్వం వహించి మోసపోవ డం దంపతుల ప్రాణాల మీదకు తెచ్చిన విషాదమిది. విద్యుత్‌ శాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించడంతో తెలిసిన వారి వద్ద డబ్బులు వసూలు చేసి ఇచ్చి మోసపోయానని గ్రహించిన తాళ్లపెల్లి కేశవస్వామి అనే వ్యక్తి తనతో పాటు తన భార్యకు పురుగుల మందు తాగించి ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు ముందు కుటుంబసభ్యులతో కలిసి సెల్ఫీవీడియో తీసి తమను మోసం చేసిన వారి పేర్లను, ఇతర వివరాలను తెలిపి ఇదే మరణ వాంగ్మూలంగా భావించాలని పోలీస్‌ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసిన విషయం పలువురిని కంటతడి పెట్టించింది. ఆత్మహత్య చేసుకున్న తాళ్లపెల్లి కేశవస్వామి సెల్ఫీ వీడియోలో తెలిపిన కథనం ప్రకారం… వరంగల్‌ రూరల్‌ జిల్లా దుగ్గొండి మండలం పొనగల్లు గ్రామానికి చెందిన తాళ్లపెల్లి కేశవస్వామి(53)ని ధర్మసాగర్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్న పుల్లబాబు, విద్యుత్‌ శాఖ కాంట్రాక్టర్‌ వాలునాయక్‌, గాడిపెల్లి వెంకటేశ్వర్లు అనే వ్యక్తులు తమ పరిచయాలతో విద్యుత్‌ శాఖ, ఇతర శాఖల్లో ఆపరేటర్‌, అటెండర్‌ ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించారు. ఈ నేపథ్యంలో కేశవస్వామి మధ్యవర్తిగా వ్యవహరించి వరంగల్‌, ములుగు, డోర్నకల్‌, అచ్చంపేట ప్రాంతాలకు చెందిన నిరుద్యోగుల వద్ద డబ్బులు వసూలు చేశాడు. వసూలు చేసిన డబ్బుల్లో గాడిపెల్లి వెంకటేశ్వర్లుకు రూ.17 లక్షలు, పుల్లబాబుకు రూ.40 లక్షలను, వాలునాయక్‌కు రూ.3.24 లక్షలను కేశవస్వామి ముట్టజెప్పాడు. ఉద్యోగాలు ఇంకా రాలేదని డబ్బులిచ్చిన వారు కొన్ని నెలలుగా కేశవస్వామిని ఒత్తిడి చేయడంతో బాబు, వాలునాయక్‌, వెంకటేశ్వర్లను గట్టిగా నిలదీయగా తనను మోసం చేశారని తాళ్లపెల్లి కేశవస్వామి గ్రహించాడు. వసూలు చేసి ఇచ్చిన డబ్బులు ఇవ్వకపోగా కేశవస్వామిని, ఆయన భార్య పిల్లలను చంపుతామని బెదిరించడంతో చేసేదేమీలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని భార్యతో కలిసి పరకాలకు వచ్చాడు. పరకాల ఎస్‌సి కాలనీలోని చర్చి ఆవరణలో కేశవస్వామి, ఆయన భార్య సంధ్యారాణి క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలాన్ని పరకాల ఎసిపి శ్రీనివాస్‌, సిఐ మహేందర్‌రెడ్డిలు సందర్శించారు. సెల్ఫీ వీడియోలో తాము మోసపోయిన తీరును కేశవస్వామి వివరించారు.

DO YOU LIKE THIS ARTICLE?