త్వరలో ఆర్‌టిసి చార్జీల పెంపు!

రంగం సిద్దం చేసిన సంస్థ యాజమాన్యం
ఏటా రూ.250 కోట్ల ఆదాయానికి ప్రతిపాదనలు
ఆర్‌టిసి నిపుణుల కమిటీలోనూ సుదీర్ఘ చర్చ
ఎన్నికల కోడ్‌ ముగియగానే ప్రభుత్వం వద్దకు దస్త్రం

ప్రజాపక్షం /హైదరాబాద్‌: నిత్యం నష్టాలలో కూరుకుపోతున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవా ణా సంస్థ (టిఎస్‌ఆర్‌టిసి) కొంత మేరకు ఆదాయ వనరులను పెంచుకునేందుకు బస్‌ చార్జీలను పెంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. ఏటా దాదాపు రూ.250 కోట్ల ఆదాయం వచ్చే విధంగా చార్జీలను పెంచాలని ఆర్‌టిసి యాజమాన్యం ప్రతిపాదనలను రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న చార్జీలను పది నుంచి 15 శాతం మేరకు పెంచడం ద్వారా ఈ మొత్తం ఆదాయాన్ని రాబట్టుకుని కొంత మేరకు నష్టాలను అధిగమించాలని ఆర్‌టిసి భావిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఆర్‌టిసి చివరిసారిగా 2013 సంవత్సరం నవంబర్‌ 6వ తేదీన చార్జీలను పెంచగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆవిర్భవించిన అనంతరం 2016 జూన్‌ 27వ తేదీన చార్జీలను పెంచింది. గత మూడేళ్లుగా డీజిల్‌ ధరలు, స్పేర్‌ పార్ట్‌ ధరలు, కార్మికుల జీతాలు, నిర్వహణ ఖర్చులు పెరిగినప్పటికీ చార్జీలు మాత్రం పెంచలేదని, ఈ కారణంగా సంస్థకు తీవ్రమైన నష్టాలు వస్తున్నాయని, చార్జీలు పెంచక తప్పదని అధికారులు తరచూ ప్రభుత్వానికి నివేదిస్తూనే ఉన్నారు. బస్‌ చార్జీలు పెంచేందుకు అనుమతించాలనే ఆర్‌టిసి ఆలోచనను ఆరు నెలల కిందనే ప్రభుత్వం ముందుంచగా వరుసగా స్థానిక సంస్థలు, అసెంబ్లీ, లోక్‌సభ, పరిషత్‌ ఎన్నికలు జరుగుతుండడంతో ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఇప్పటివరకు అంగీకరించలేదని అధికారులు అంటున్నారు. తాజాగా ఈ నెల 23వ తేదీన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరం ఎన్నికల కోడ్‌ ముగియగానే బస్‌ చార్జీల పెంపుదల ఫైల్‌ను ముందుకు కదిలించాలని ఆర్‌టిసి అధికారులు భావిస్తున్నారు. గత మూడేళ్ల కింద పెంచిన బస్‌ చార్జీలతో ఆర్‌టిసికి ఏటా రూ.286 కోట్ల ఆదాయం సమకూరుతుంది. గతంలో పెంచిన మాదిరిగానే ఈసారి కూడా ప్రజల నుంచి నిరసన రాకుండా గ్రామీణ సర్వీసులైన పల్లె వెలుగు చార్జీలను 30 కిలోమీటర్ల వరకు రూ.1, 30 కిలోమీటర్ల పైన రూ.2, ఇతర అన్ని రకాల సర్వీసుల్లో పది నుంచి పదిహేను శాతం వరకు చార్జీలు పెంపుదలకు ఆర్‌టిసి యాజమాన్యం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఈ చార్జీలతో పాటు నెలవారి బస్‌ పాస్‌లు, ఎన్‌జిఒలు, విద్యార్థుల బస్‌ పాస్‌ల ధరలు కూడా కొంత మేరకు పెంచాలని ఆర్‌టిసి అధికారులు భావిస్తున్నారు. ప్రతి రోజు బస్సులను నడిపేందుకు ఆర్‌టిసికి రూ.12 కోట్లు ఖర్చు అవుతుండగా ఆదాయం రూ.11.11 కోట్లు వస్తున్నది. ఫలితంగా ప్రతి రోజూ సంస్థకు కోటి రూపాయల కోట్ల నష్టం వాటిల్లుతున్నది.

DO YOU LIKE THIS ARTICLE?