త్యాగం వాయుసేనది.. దోపిడీ మోడీది

రాంచీ సభలో రాహుల్‌ గాంధీ
రాంచీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ లక్ష్యం గా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మాటాల తూటాలు పేల్చారు. పదునైన మాటాలతో మోడీపై నిప్పులు చెరిగారు. భారత వైమానిక దళం దేశాన్ని రక్షిస్తుంటే, ప్రధాని మోడీ మాత్రం వైమానిక దళం నుంచి రూ. 30 వేల కోట్లు దొంగిలించారని ఆరోపించారు. శనివారం రాహుల్‌గాంధీ జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని మోరబాదీ మైదానంలో కాంగ్రెస్‌ నిర్వహించిన పరివర్తన్‌ ఉల్గులన్‌ మహార్యాలీలో పాల్గొని మాట్లాడారు. రాఫెల్‌ ఒప్పదంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. రూ. 30 వేల కోట్లు దొంగిలించి అనీల్‌ అంబానీకి కట్టబెట్టారని విమర్శించారు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ దేశాన్ని రక్షిస్తోంది. ఈ దేశం కోసం వారి విలువైన జీవితాల్ని అంకితం చేస్తోంది. కానీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎయిర్‌ఫోర్స్‌ దగ్గర డబ్బులు దొంగిలించి అనిల్‌ అంబానీ జేబుల్లో పెడుతున్నారు. ఇది చాలా సిగ్గుచేటు” అని అన్నారు. సైనికుల త్యాగాలను ఎన్నికల్లో లబ్ధి చేకూర్చుకునేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని, ఇది నిజంగా బాధాకరమని రాహుల్‌ అన్నారు. పారిశ్రామికవేత్తలకు రూ. 3.5 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారని కానీ, రైతులకు, విద్యార్థులకు, దుకాణాదారులకు మాత్రం ఏమీ చేయలేదని మండిపడ్డారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వస్తే కనీస ఆదాయ హామీ పథకాన్ని ప్రవేశపెడుతామని రాహుల్‌ పునరుద్ఘాటించారు. ఈ నగదు నేరుగా పేదల ఖాతాల్లోనే జమచేస్తామని చెప్పారు. కొద్ది రోజుల క్రితం వరకు రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోళ్లలో గోల్‌మాల్‌ జరిగిందని నరేంద్రమోడీపై, కేంద్ర ప్రభుత్వంపై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

DO YOU LIKE THIS ARTICLE?