తెల్ల బంగారానికి మసక

శాస్త్రవేత్తల వైఫల్యమూ కారణమే
పత్తికి ప్రత్యామ్నాయంపై వ్యవసాయశాఖ దృష్టి
సిద్ధం చేసిన వ్యవసాయ వర్సిటీ
వరుస నష్టాలే కారణం

ప్రజాపక్షం / హైదరాబాద్‌ : తెలంగాణ రైతుల ఇంట పసిడి పంటలు పండిం చి తెల్ల బంగారంగా విరాజిల్లిన పత్తి మసకబారిబోయింది. కొన్ని దశాబ్దాల పాటు సాగునీటి సౌకర్యం లేని ప్రాంతాల్లో సైతం చేలల్లో బంగారాన్ని పండించింది. ఓ దశలో వరి వంటి పంట ను కూడా కాదని మెజార్టీ రైతాంగం పత్తి సాగువైపు మొగ్గింది. అలాంటి తెల్ల బంగారం గత కొన్నేళ్లుగా రైతుల ముఖాలను నల్లబారుస్తోంది. ప్రముఖ వాణిజ్యపంటగా ఓ వెలుగు వెలిగిన పత్తిని ఇప్పుడు తగ్గించి దీనికి ప్రత్యామ్నాయం చూడాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సమాచారాన్ని ఇచ్చింది. గత రెండు మూడు నెలలుగా కసరత్తులు చేస్తున్న శాస్త్రవేత్తలు వచ్చే ఖరీఫ్‌ నుంచి పత్తికి బదులు పలు ప్రత్యామ్నాయ పంటలను సిద్ధం చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన సమగ్ర నివేదిక వ్యవసాయశాఖకు అందజేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఖరీఫ్‌ సాగును ఒక సారి పరిశీలిస్తే… సాధారణ సాగు విస్తీర్ణంలో సగానికి పైగా పత్తినే పండించేవారు. రాష్ట్రంలో 2017 మొత్తం పంటల సాగు విస్తీర్ణం దాదాపు 80లక్షల ఎకరాలు కాగా, అందులో 42లక్షల ఎకరాల్లో పత్తినే సాగు చేశారు. అంటే సగానికి పైగా తెల్లబంగారమే రాజ్యమేలింది. ఆ ఏడాది కూడా దిగుబడులు తగ్గి పత్తి రైతు నష్టాన్ని చవిచూసినప్పటికీ పత్తిపై మోజును తగ్గించుకోలేదు. 2018 ఏకంగా 44.30 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు.అయితే చీడపీడల కారణంగా దిగుబడులు తగ్గిపోయి ఒక వైపు, నాణ్యత తగ్గి సరైన ధర రాక మరో వైపు పత్తి రైతులు దారుణంగా నష్టపోయారు. ఒకప్పుడు అధిక లాభాలను తెచ్చిపెట్టిన పత్తి ఉన్నట్టుండి ఇంతగా పడిపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తే దీనిలో రైతుల కంటే ఎక్కువగా వ్యవసాయశాఖ, వ్యవసాయ శాస్త్రవేత్తల వైఫల్యము ఉన్నాయన్నది స్పష్టంగా గోచరిస్తోంది. రైతులంతా పత్తికి ఎగబడుతుండడంతో మార్కెట్లోకి నకిలీ విత్తనాలు పెద్ద ఎత్తున ప్రవేశించడం మొదలు పెట్టాయి. దీనిని అరికట్టడంలో వ్యవసాయశాఖ విఫలం కావడం పత్తి రైతు నష్టపోవడానికి ఒక కారణం. మరో ప్రధాన కారణం గత మూడు, నాలుగేళ్లుగా పత్తిని గులాబీ రంగు పురుగు ఆశిస్తోంది. దీని కారణంగా చక్కగా పెరిగి అధిక దిగుబడులు వచ్చే పత్తి చేళ్లు కూడా ఎందుకు పనికి రాని విధంగా తయారవుతున్నా యి. దీనిని నివారించేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారులు ఇస్తున్న సూచనలు అంతగా ఫలించడం లేదు. అంతే కాదు ఈ పురుగు సోకకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు, సోకిన అనంతరం నివారించడానికి ఉపయోగించాల్సిన క్రిమిసంహారక మందుల తయారీలోనూ వ్యవసాయ శాస్త్రవేత్తలు విజయం సాధించడం లేదు. దీంతో ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ రకాల పురుగు మందులతోనే గులాబీ పురుగును నివారించే ప్రయత్నాలు చేస్తున్నా… అవి ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో చివరకు పత్తికి ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవడమే సరైనదన్న నిర్ణయానికి వ్యవసాయ శాఖ వచ్చేసింది.

DO YOU LIKE THIS ARTICLE?