తెలంగాణ వీరప్పన్‌ అరెస్టు

పోలీసుల అదుపులో కలప స్మగ్లర్‌ ఎడ్ల శ్రీను, అతడి అనుచరులు
గోదావరిఖని : కరుడుగట్టిన కలప స్మగ్లర్‌, ‘తెలంగాణ వీరప్పన్‌’ గా పిలిచే ఎడ్ల శ్రీనును పోలీసులు అరెస్టు చేశారు. గత 20 ఏళ్లుగా కలప అక్రమ రవాణా చేస్తూ ఇటు పోలీసులకు.. అటు అటవీ శాఖ అధికారులకు సవాలుగా మారిన ఎడ్ల శ్రీనివాస్‌ అలియాస్‌ పో తారం శ్రీనుతోపాటు అతని అనుచరులను రామగుండం కమిషనరేట్‌ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఎడ్ల శ్రీను గత కొంతకాలంగా తప్పించుకు తిరుగుతున్నాడు. తెలంగాణతో పాటు ఆంధ్రాలో కలప స్మగ్లింగ్‌ చేస్తున్న విషయంపై నిఘా పెట్టాలని, స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న వారిని పట్టుకోవాలని, పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని పోలీసులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో రామగుండం కమిషనరేట్‌ పోలీసులు చాకచాక్యంగా వ్యవహరిస్తు, సాంకేతిక డ్రోన్‌ కెమెరాల సహాయంతో ఆయా నది తీరాల్లో పాతిపెట్టిన కలప దుంగలతో పాటు ఎడ్ల శ్రీనుతో పాటు కలప స్మగ్లింగ్‌ లో అత్యంత కీలక పాత్ర పోషించే నలుగురు వ్యక్తులను పట్టుకొన్నారు. మంగళవారం రామగుండం కమిషనరేట్‌లో విలేకరుల సమావేశంలో రామగుండం సిపి వి.సత్యనారాయణ నిందితుల వివరాలను తెలిపారు. కరుడుగట్టిన కలప స్మగ్లర్‌ తెలంగాణ వీరప్పన్‌గా పిలువబడే ఎడ్ల శ్రీను అలియాస్‌ పోతారం శ్రీనును, నలుగురు వ్యక్తులను రామగుండం కమిషనరేట్‌లోని లా అండ్‌ అర్డర్‌, టాస్క్‌ఫోర్స్‌ మంథని పోలీసులు పకడ్బంది సమాచారంతో అరెస్టు చేసినట్లు తెలిపారు. స్మగ్లింగ్‌లో ఆరితేరిన ఎడ్ల శ్రీను తెలంగాణ పోలీసు మరియు అటవి శాఖల మోస్‌ వాంటెడ్‌ స్మగ్లర్‌గా గురించడం జరిగిందని, రానున్న తరాలకు ఇబ్బందులు ఎదురవకుండా పర్యావరణ సమతుల్యానికి అడవుల సంరక్షణకు ఉండాలని, కలప అక్రమంగా స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపాలని సియం కెసిఆర్‌ ఆదేశాలు జారీ చేయడంతో స్మగ్లర్ల జాబితా తయారు చేసినట్లు తెలిపారు. ఎడ్ల శ్రీను కలప స్మంగ్లింగ్‌లో తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీష్‌గడ్‌ తదితర ప్రాంతాల్లో వాంటెడ్‌ క్రిమినల్‌గా ఉన్నాడని, పోలీసు జాబితాలో అగ్రబాగంలో ఉండడంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు, పలువురు న్యాయవాదులు, రాజకీయ నాయకులు పూర్తి స్థాయిలో అతనికి సహకరించారని తెలిపారు. హైదరాబాద్‌, విజయవాడ, తూర్పుగోదావరి, అన్నవరం, విశాఖపట్నం, అరకు, గుంటూరు, చిలకలూరిపేట, భద్రాచలం, వరంగల్‌, తదితర ఏరియాలలో తలదాచుకున్నాడని చెప్పారు. పక్కా సమాచారంతో ఎడ్ల శ్రీను, కుడిదె కిషన్‌, కోరవేని మధుకర్‌, రాగం శ్రీనివాస్‌, ఎడ్ల సంతోష్‌లను విలోచనవరంలో అరెస్టు చేశామన్నారు. వారు ఉపయోగించిన స్కార్పియో వాహానం, 10 దుండలను స్వాధీనం చేసుకున్నారు. కలప స్మగ్లింగ్‌కు సంబంధించి ఇప్పటివరకు 17 మందిని అరెస్టు చేశామని, మంగళవారం 5 గురు ప్రధాన నిందితులను అరెస్టు చేశామని వివరించారు. ఇంకా ఈ కేసులో మరో 20 మందిని త్వరలో అరెస్టు చేసేందుకు జాబితాను సిద్ధం చేశామని తెలిపారు.
కలప స్మగ్లర్‌ ఎడ్ల శ్రీను నేర చరిత్ర..
తెలంగాణ వీరప్పన్‌లా పిలువబడే ఎడ్ల శ్రీను పెద్దపల్లి జిల్లాలోని మంథని పోతారంకు చెందినవాడని, తన జీవనాధారంలో ఫర్టిలైజర్‌ వ్యాపారం చేశాడు. తన వ్యాపారంలో నష్టాలు రావడంతో పరిచయాలున్న వారితో అటవి ప్రాంతాల్లో నుండి సైకిల్‌ ద్వారా అక్రమ రవాణా చేసేవాడు. అమ్మకాలలో కమిషన్‌ రావడంతో ఫర్టిలైజర్‌ వ్యాపారాన్ని మూసివేశాడు. తానే స్వయంగా నమ్మకం ఉన్న వ్యక్తులతో స్వయంగా అక్రమ కలపను స్మగ్లింగ్‌ చేస్తూ ఓ మాఫియా సామ్రాజ్యాన్ని మొదలు పెట్టి, కరీంనగర్‌, అదిలాబాద్‌, వరంగల్‌ ఉమ్మడి జిల్లాలతో పాటు మహారాష్ట్ర, చత్తీస్‌గడ్‌ అటవీ ప్రాంతాల్లో కలపను నరికి తెలంగాణ వీరప్పన్‌ పేరుతో అక్రమ రవాణా చేశాడు. అక్రమ కలప రవాణాలో ఎక్కువగా అటవి ప్రాంతాలనే ఎన్నుకొని నరికి స్మగింగ్‌ చేసేవాడు. దీంతో ఎడ్ల శ్రీనుపై పోలీసు, అటవి శాఖ వారు 12 కేసుల వరకు నమోదు చేశారు. మంథని పోలీసు స్టేషన్లో 6, కోటపల్లిలో 2, అటవి శాఖ వారు 4 కేసులు నమోదు చేశారు. అలాగే అక్రమ టేకు కలప దిగుమతిలో ముఖ్యంగా పలు సామిల్స్‌కు వివిధ మార్గాల ద్వారా అటవి, పోలీసు శాఖ అధికారులు, పలు రాజకీయ నాయకుల అండదండలతో టేకు కలప అక్రమ రవాణ దందా జరిగింది. అయితే కొన్ని దుంగలు పలు ఏరియాలలో దాచిపెట్టడంతో జియో ట్యాగింగ్‌ ద్వారా, డ్రోన్‌ కెమెరా సహయంతో, నిఘా పెట్టడం ద్వారా పట్టుకున్నారు. కలప అక్రమ స్మగ్లింగ్‌ మాఫియాలో పట్టుబడ్డ ఎడ్ల శ్రీనుతో పాటు కొంతమంది వ్యక్తులపై త్వరలోనే పిడి యాక్ట్‌ అమలు చేయడం జరుగుతోందని, చట్టవ్యతిరేక కార్యకలపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి సత్యనారయణ హెచ్చరించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి డిసిపి సుదర్శన్‌గౌడ్‌, గోదావరిఖని ఎసిపి ఉమెందర్‌, పి.సంజీవ్‌, అడ్మిన్‌ అశోక్‌కుమార్‌, రవికుమార్‌, సిఐలు మహేందర్‌, టాస్క్‌ఫోర్స్‌ సిఐ సరిలాల్‌, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?