తెలంగాణలో మరో 33 కేసులు

యాదాద్రిలో నలుగురికి పాజిటివ్‌లు
ప్రజాపక్షం/హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు క్లీన్‌జిల్లాగా వున్న యాదాద్రి భువనగిరిలో నలుగురికి పాజిటివ్‌ కేసులు రావడం భయపెడుతోంది. ముంబయి నుంచి తరలివచ్చిన వలస కార్మికులకు పాజిటివ్‌ వున్నట్లు తేల్చారు. శనివాంనాడు 31 కేసులు నమోదు అవ్వగా.. ఆదివారం నాడు ఒక్కరోజే 33 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1196కి చేరినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తన హెల్త్‌బులిటెన్‌లో వెల్లడించింది. మరణాల సంఖ్య 30గా నమోదైనట్లు పేర్కొంది. తాజాగా నమోదైన కేసుల్లో 26 కేసులు జిహెచ్‌ఎంసి పరిధిలోనివే కావడం గమనార్హం. మిగిలిన ఏడు కేసులు వివిధ రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చిన వలస కార్మికులకు సంబంధించినవని తెలిపింది. ఇప్పటి వరకు 751 మంది మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారని, ప్రస్తుతం 415 మంది చికిత్స పొందుతున్నారని వైద్యారోగ్యశాఖ తెలిపింది.ఇప్పటి వరకూ ఎలాంటి పాజిటివ్‌ కేసులు నమోదు కాకుండా గ్రీన్‌జోన్‌గా ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో కొత్తగా కరోనా కేసులు వెలుగు చూడటం కలకలం రేపింది. తాజాగా జిల్లాలో నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు జిల్లా కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ తెలిపారు. ఆత్మకూరు(ఎం) మండలంలో 3 పాజిటివ్‌ కేసులు, సంస్థాన్‌ నారాయణపురంలో ఒక కేసు నమోదైనట్టు వెల్లడించారు. వీరంతా ముంబయి నుంచి స్వగ్రామాలకు వచ్చిన వారేనని తెలిపారు. కరోనా సోకినవారి ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తిస్తున్నట్టు కలెక్టర్‌ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఏడు చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్‌, భూపాలపల్లి, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్‌, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, మహబూబాబాద్‌, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్‌, నల్గొండ, కుమరంభీం ఆసిఫాబాద్‌, ఖమ్మం, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, సూర్యాపేట, నారాయణపేట, వరంగల్‌ అర్బన్‌, నిర్మల్‌ జిల్లాల్లో గత 14 రోజులుగా ఎలాంటి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

DO YOU LIKE THIS ARTICLE?