తెలంగాణలో కొత్త కేసులు  66

హైదరాబాద్‌లో పెరగనున్న కంటైన్‌మెంట్‌ జోన్లు
‘కంటైన్‌మెంట్‌’లో పర్యటించిన సిఎస్‌
అంబులెన్స్‌లో మృతిచెందిన మంచిర్యాల మహిళకు కరోనా పాజిటివ్‌!
‘గాంధీ’లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు పాజిటివ్‌!
సూర్యాపేట జిల్లాలో కరోనా అలజడి
మంచిర్యాలలో తొలి కేసు నమోదు
రూ.1500 కోసం క్యూలైన్‌లో నిలబడి సొమ్మసిల్లి మహిళ మృతి!
సొంత రాష్ట్రాలకు కాలినడకన వలసకార్మికులు
హైదరాబాద్‌లో విజృంభిస్తున్న కరోనా

ప్రజాపక్షం/హైదరాబాద్‌ : తెలంగాణలో కొవిడ్‌ 19 మహమ్మారి విజృంభిస్తోంది. శుక్రవారం కొత్తగా మరో 66 కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 766కు చేరింది. రెండు రోజుల్లో 116 కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా 30 హైదరాబాద్‌లోనే రాగా.. సూర్యాపేట జిల్లాలో 15 కేసులు నమోదయ్యాయి. మంచిర్యాలలో తొలి కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది.  కాగా, రాష్ట్రంలో కరోనా కేసులు  తగ్గినట్లే తగ్గి గత రెండు, మూడు రోజులుగా కరోనా కేసులు రాష్ట్రంలో భారీగా నమోదవుతున్నాయి. మెల్లమెల్ల గా  వైరస్‌ వ్యాప్తి మిగతా జిల్లాల కు వ్యాపిస్తూ, మరికొన్ని జిల్లాల్లో కేసు లు భారీగా రికార్డు అవుతున్నాయి. హైదరాబాద్‌, నిజామాబాద్‌ తరువాత అత్యధిక కేసులు నమోదైన జిల్లాగా ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉంది. ఉమ్మడి నల్లగొండలో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య శుక్రవారం ఉదయం వరకు 56కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో 50 శాతంపైగా కేసులు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపాల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే నమోదవుతున్నా యి. ప్రతి రోజూ వైద్యారోగ్యశాఖ విడుదల చేస్తున్న కరో నా బులిటెన్‌లో మెజార్టీ కేసులు హైదరాబాద్‌లోనే నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మర్కజ్‌కు వెళ్లిన వారిలో హైదరాబాద్‌ నుంచి వెళ్లినావారే ఉండడం కేసుల సంఖ్య కూడా దానికనుగుణంగానే పెరుగుతున్నా యి. దీంతో పాటే జిహెచ్‌ఎంసి పరిధిలో కంటైన్‌మెంట్‌ జోన్లు ఇప్పటి వరకు 146 ఏర్పాటు చేసి అక్కడ అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను మరింతగా కఠినతరంగా అమలు చేస్తున్నారు. మలక్‌పేట్‌లో ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి కరోనా సోకడంతో అక్కడి కంటైన్‌మెంట్‌ జోన్‌ ప్రాంతా ల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ పర్యటించి అక్కడి పరిస్థితిని ఆరా తీశారు. వైరస్‌ తీవ్రత పెరిగితే రానున్న రోజుల్లో కంటైన్‌మెంట్‌ జోన్లను పెంచే అవకాశం ఉంది. మర్కజ్‌, దేవ్‌బంద్‌కు వెళ్లి వచ్చిన మిగతావారిని గుర్తించేందుకు తెలంగాణ పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నారు. గురువారం (ఏప్రిల్‌ 16) ఒక్కరోజే 50 కేసులు నమోదవడంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 700 మార్కుకు చేరుకోగా శుక్రవారం ఉదయం మరో 8 కేసులు నమోదైనట్లు సమాచారం. సూర్యాపేట జిల్లాల్లో తాజాగా మరో 5 కేసులు నమోదైనట్లు తెలిసింది. మరోవైపు జోగులాంబ గద్వాల జిల్లాలో మరో ఒకటి పాజిటివ్‌ కేసు నమోదైంది. అలాగే తాజాగా మంచిర్యాలలోనూ మహిళకు కరోనా సోకినట్లు సమాచారం. హైదరాబాద్‌లో గాంధీ మెడికల్‌ కాలేజీలో డెటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయినట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల నుంచి గతంలో పనుల కోసం హైదరాబాద్‌కు వచ్చిన వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు పయనమవుతుండడంతో మార్గమద్యంలో వారిని ప్రజా ప్రతినిధులు అడ్డుకుంటున్నారు. తమకు అవసరమైన ఏర్పాట్లను చేసి ఆయా ప్రాంతాల్లో వారందరినీ ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా ప్రాంతంలో కరోనా కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్లుగా ఏర్పాటు చేసి అక్కడి బ్యాంకులను ముందస్తు చర్యల్లో భాగంగా మూసివేశారు. ప్రభుత్వం తమ ఖాతాల్లో జమ చేసిన రూ.1500 కోసం వస్తే జనాలు వస్తే పరిస్థితి మరింత చేయిదాటిపోకుండా ఉండేందుకు ఈ విధమైన కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. అలాగే మంచిర్యాలలోనూ అంతర్‌ జిల్లా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి బయటి వ్యక్తులు ఎవ్వరూ రాకుండా లాక్‌డౌన్‌ మరింత కఠినతరం చేస్తున్నారు.
మంచిర్యాలలో కరోనా ఆందోళన…
కొన్ని రోజుల కిందట కింగ్‌ కోఠి ఆస్పత్రి వద్ద అంబులెన్స్‌లో ప్రాణాలు విడిచిన మంచిర్యాల మహిళకు కరోనా సోకినట్లు సమాచారం. మంచిర్యాలలో ఇదే తొలి కరోనా కేసుగా నమోదైనట్లు తెలుస్తోంది. కరోనా మరణం కావడంతో మంచిర్యాల జిల్లాలో అలజడి నెలకొంది. అంబులెన్స్‌లో చనిపోయిన మహిళకు కరోనా.. ఎలా సోకింది? ఎంత మందిని కలిసింది? అనే చర్చ ప్రజల్లోనూ, అధికారుల్లోనూ నెలకొంది. గురువారం వరకు రాష్ట్రంలోని 28 జిల్లాల్లో కరోనా కేసులు నమోదైనా.. మంచిర్యాల జిల్లా ఇప్పటివరకూ కరోనా గ్రీన్‌ జోన్‌గా ఉంది. తాజా ఘటనతో కలవరం మొదలైంది. సదరు మహిళతో ఎంత మంది కాంటాక్ట్‌ అయ్యారనే వివరాలను అధికారులు ఆరా తీస్తున్నారు. మంచిర్యాలలో ఆమెకు చికిత్స అందించిన వైద్యుల్లోనూ కలవరం మొదలైంది. గ్రామంలో హై అలర్ట్‌ విధించినట్లు తెలుస్తోంది. తాజా ఘటనలో తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య 19కి చేరినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. తెలిసిన వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ముత్తరావుపల్లి గ్రామానికి చెందిన 46 ఏళ్ల ఓ మహిళ వారం రోజుల కిందట అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఆమెను కుమారులు మంచిర్యాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితురాలిని పరీక్షించిన వైద్యులు కరోనా లక్షణాలుగా అనుమానించారు. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. అయితే, తమ తల్లికి కరోనా సోకే అవకాశమే లేదని వాదించిన ఆమె కుమారులు హైదరాబాద్‌ తీసుకెళ్లడానికి నిరాకరించారు. చివరికి వైద్యులు, అధికారుల ఒత్తిడి మేరకు బాధితురాలిని 108 అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే, ఆమెకు కరోనా వైరస్‌ ఉన్నట్లు అప్పటికి నిర్ధారణ కాకపోవడంతో కింగ్‌ కోఠి ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా గాంధీలోని వైద్య సిబ్బంది సూచించినట్లు తెలిసింది. దీంతో చేసేదేంలేక ఆమె కుమారుడు కోఠి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య సిబ్బందితో మాట్లాడే ప్రయత్నం చేస్తుండగా ఆ మహిళ అంబులెన్స్‌లోనే ప్రాణాలు విడిచారు. శుక్రవారం ఆమె నమూనాలకు సంబంధించిన రిపోర్టులు వచ్చినట్లు సమాచారం. బాధితురాలు వైరస్‌ కారణంగానే మృతి చెందినట్లు తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురవుతున్నా. ఆమెకు కరోనా వైరస్‌ ఎలా సోకిందనేది అంతుబట్టని విధంగా ఉంది. అస్వస్థతకు గురైన ఆమెకు స్థానికంగా ఓ వైద్యుడు చికిత్స అందించినట్లు తెలుస్తోంది. గ్రామస్తులందరికీ వైద్యపరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సిద్దమవుతున్నారు.
‘గాంధీ’లో డేటా ఎంట్రీ ఆపరేటర్కు కరోనా పాజిటివ్‌
గాంధీ మెడికల్‌ కాలేజీలో పని చేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు కరోనా సోకినట్లు సమాచారం. ఇదే మెడికల్‌ కాలేజీలోని వైరాలజీ ల్యాబ్‌లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ అక్కడ పీపీఈ కిట్లను ఉపయోగించడంతోపాటు.. పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. దీంతో ఆయనకు కరోనా ఎలా సోకిందనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. విధులు నిర్వర్తిస్తున్నప్పుడే ఆయన కరోనా బారిన పడ్డారా? లేదంటే బయట ఇతర వ్యక్తుల ద్వారా సోకిందా? అనే దిశగా ఆరా తీస్తున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ‘గాంధీ’లో పని చేస్తున్న సిబ్బంది, ప్రొఫెసర్లను ఆందోళనలో చెందుతున్నారు. ఆపరేటర్‌ కుటుంబ సభ్యుల దగ్గరి నుంచి కూ డా శాంపిళ్లను సేకరించినట్లు సమాచారం. ఆయన ఎవరెవర్ని కలిశాడనే దిశగా అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. గాంధీ హాస్పిటల్లో మార్చి ప్రారంభం నుంచి కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తుండగా..మెడికల్‌ కాలేజీలోని వైరాలజీ ల్యాబ్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత రెండు రోజులుగా సదరు డేటా ఎంట్రీ ఆపరేటర్‌లో ఫ్లూ లక్షణాలు కనిపించడంతో విశ్రాంతి తీసుకుంటున్నారు. అనుమానం వచ్చి అతనికి పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌ అని తేలినట్లు తెలిసింది.
రూ.1500 కోసం బ్యాంక్‌ వద్ద భారీ క్యూ, మహిళ మృతి
లాక్‌డౌన్‌లో ప్రజలు ఇబ్బంది పడకుండా రేషన్‌ కార్డు ఉన్న కుటుంబంలో ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేసి, రేషన్‌ కార్డుపై రూ.1500 చొప్పున బ్యాంకుల్లో జమ చేసింది. అయితే, ఆ డబ్బుల కోసం బ్యాంకుల దగ్గర భారీ క్యూలైన్‌ ఉంటున్నాయి. లైన్‌లో ఉన్న వారు భౌతిక దూరం చాలా చోట్ల పాటించ డం లేదు. వనపర్తి, వరంగల్‌, నల్గొండ, సూర్యాపేట, కామారెడ్డి, జోగులాంబ, మంచిర్యాల, హైదరాబాద్‌ ఇతర కొన్ని జిల్లాలో బ్యాంకుల వద్ద జనాలు భౌతిక దూరం పాటించడం లేదు. తాజాగా కామారెడ్డి జిల్లాలో క్యూ లైన్‌లో నిలబడిన ఓ మహిళ చివరకు గుండెపోటుతో మృతిచెందడం విషాదంగా మారింది. వివరాల్లోకి వెళ్తే… కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ వద్ద  ప్రభుత్వం అందిస్తున్న రూ. 1500 తీసుకోవడానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు.. దీంతో బ్యాంక్‌ దగ్గర భారీ క్యూ లైన్‌ అయ్యింది. అయితే కన్నపూర్‌ తండాకు చెందిన నేనావత్‌ కమల(45) అనే మహిళ కూడా క్యూలైన్లో నిలబడ్డారు. ఉదయం నుంచి డబ్బులు తీసుకోవడానికి క్యూలో నిలబడిన కమల హఠాత్తుగా కుప్పకూలిపోయింది.దాంతో అక్కడున్నవారు వెం టనే 108కు ఫోన్‌ చేయడంతో బ్యాంకు వద్దకు చేరుకున్న 108సిబ్బంది ఆమెను పరిశీలించి పల్స్‌ రేట్‌ పూర్తి గా పడిపోయిందని తెలిపినట్లు తెలిసింది. కమల అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. ఆమెకు గుండెపోటు రావడంతో మృతిచెందినట్టు వైద్యులు చెబుతున్నారు. మరోవైపు, బ్యాంకు వద్ద ఖాతాదారులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని అనుకోకుండ ఈ ఘట న జరగడం బాధాకరమైన విషయమని అధికారులు, అక్కడి ప్రజా ప్రతినిధులు చెబుతున్నారు.టోకెన్‌ ప్రకార మే డబ్బులు ఇస్తున్నారని స్థానిక సర్పంచ్‌ తెలిపారు. కా గా, ఆమె మృతిలో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సూర్యాపేటలో కరోనా అలజడి
సూర్యాపటలో కరోనా కేసుల తీవ్రత అక్కడి ప్రజలకు ఆందోళన కల్గిస్తోంది. రోజురోజుకీ అక్కడ కేసుల సంఖ్య పెరుగుగుతండటంతో ప్రజలో భయందోళనలు నెలకొంటున్నాయి. సూర్యాపేట జిల్లాలో తాజాగా మరో 5 కరో నా కేసులు నమోదైనట్లు సమాచారం. దీంతో సూర్యాపేట పట్టణంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.  గురువారం సూర్యాపేట పట్టణంలో16పాజిటివ్‌ కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజా కేసులతో సూర్యాపేట జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 44కు చేరినట్లు జిల్లా కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి తెలిపారు.సూర్యాపేట జిల్లాలో కరోనా కట్టడి కోసం అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. కరీంనగర్‌ తరహాలో సూర్యాపేట, హైదరాబాద్‌ జిల్లాల్లో అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. సూర్యాపేట పట్టణంలో పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో మూడు కంటైన్మెంట్‌ జోన్లు ఏర్పాటు చేశారు.ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనా కేసు ల సంఖ్య 56కు చేరి గ్రేటర్‌ హైదరాబాద్‌, నిజామాబాద్‌ తర్వాత అత్యధిక కేసులు నమోదైన జిల్లాగా నమోదైంది.

DO YOU LIKE THIS ARTICLE?