తూర్పు వెళ్లే రైలు

1225 మంది వలస కార్మికులతో లింగంపల్లి నుంచి జార్ఖండ్‌ బయలుదేరిన రైలు
ప్రయాణంలో తిండి, నీరు సమకూర్చిన రైల్వే
ప్రజాపక్షం/హైదరాబాద్‌ : వలస కార్మికులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. లాక్‌డౌన్‌ కారణంగా ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. లాక్‌డౌన్‌ కాలంలో తీవ్ర ఇబ్బందులకు గురైన కార్మికులకు ఉపశమనం కలిగింది. లాక్‌డౌన్‌ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకు పోయిన వలస కూలీలు, విద్యార్థులు, యాంత్రికులు స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వడంతో వారంతా స్వస్థలాలకు పయనమయ్యారు. హైదరాబాద్‌ లింగంపల్లి నుంచి కాగజ్‌ నగర్‌ మీదుగా హాతియా (జార్ఖంఢ్‌) వరకు ఒక రైలు వలస కూలీలతో ఉదయం 4.50 గంటలకు బయలుదేరింది. ఈ ప్రత్యేక రైలులో 1225 మంది ప్రయాణికులు ఉన్నారు. రైల్వే శాఖ లాక్‌డౌన్‌ ప్రకటించిన అనంతరం మొదటిసారిగా కూలీలను తరలించేందుకు ప్యాసింజర్‌ రైళ్లను నడుపుతోంది. సంగారెడ్డి జిల్లా కంది ఐఐటి హైదరాబాద్‌లో చిక్కుకు పోయిన వలస కార్మికులను ఎట్టకేలకు స్వస్థలాకు పంపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులకు అనుగుణంగా వసల కార్మికులను శుక్రవారం తెల్లవారు జామున సంగారెడ్డి నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 57 బస్సుల్లో లింగంపల్లి రైల్యే స్టేషన్‌కు తరలించారు. లింగంపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి వారిని తెల్లవారు జామున 5 గంటలకు రైలులో జార్ఖండ్‌కు పంపించారు. జిల్లా కలెక్టర్‌ ఎం.హనుమంతరావు, ఎస్‌.పి చంద్రశేఖర్‌రెడ్డి, రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగం చప్ప ట్లు కొట్టి వారికి వీడ్కోలు పలికారు. కాగా, లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులను తరలించడానికి ఏర్పాటు చేసిన తొలి రైలు ఇదే కావడం విశేషం. వారికి కావలసిన ఆహారం ఇతర సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. తమను స్వస్థలాకు పంపించాలంటూ వలస కార్మికులు కంది ఐఐటి వద్ద బుధవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో వారి ని అడ్డుకున్న పోలీసులపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పోలీసు వాహనాలు ధ్వంసమైన విషయం తెల్సిందే. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలు, విద్యార్థులు, పర్యాటకులు వారి స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్రం అనుమతిచ్చింది. అయితే రోడ్డు మార్గం ద్వారానే వారిని స్వస్థలాలకు తరలించేలా రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని కేంద్రం ఆదేశాలు జారీచేసింది. ఈ నిర్ణయంపై పలు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. వలస కూలీలను స్వస్థలాలకు పంపించేందుకు తాత్కాలిక రైళ్లు నడపాలని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. రాష్ట్రా ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు కేంద్రం కొంత సానుకూలంగా స్పందించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైల్యే అధికారులు కార్మికులను ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. రైలులో వలస కూలీలకు కావాలిసన ఆహార పదార్థాలు , తాగు నీరు సౌకర్యం కల్పించారు.

DO YOU LIKE THIS ARTICLE?