తప్పులను కప్పి పుచ్చుకునేందుకు

వైన్‌షాపులను తెరవడమంటే తాళం వేసి గొళ్లెం వదిలేసినట్లే

ప్రజాపక్షం / హైదరాబాద్‌: కరోనా విషయంలో రెండు నెలలుగా ముఖ్యమంత్రి చపలచిత్తంతో వ్యవహరిస్తుం టే, ప్రతిపక్షాలే నిలకడగా సూచనలిస్తున్నాయని టిజెఎస్‌ అధ్యక్షులు ఎం. కోదండరామ్‌ అన్నారు. ప్రభుత్వం తన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తోందన్నారు. లాక్‌డౌన్‌లో వైన్‌షాపులను తెరవడమంటే తాళం వేసి గొళ్లెం వదిలేసినట్లేనని, ఇక లాక్‌డౌన్‌ ఎక్కడిదని ప్రశ్నించారు. ప్రజలు వద్దంటున్నా కేవలం ఆదాయం కోసమే వాటిని తెరిచారని విమర్శించారు. ప్రతిపక్షాలపై సిఎం చేసిన వ్యాఖ్యలను బుధవారం ఫేస్‌బుక్‌ లైవ్‌లో కోదండరామ్‌ తిప్పికొట్టారు. సిఎం మాట్లాడిన భాషను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ప్రతిపక్షాలను ఉద్దేశించి సిఎం కెసిఆర్‌ తన స్థాయిని, హోదాను మరిచి మాట్లాడారని అన్నారు. ప్రతిపక్షాల బాధ్యత సిఎం మీద ఆధారపడి లేదన్నారు. రెండు నెలల కాలంలో సిఎం కెసిఆర్‌ చపలచిత్తంతో వ్యవహరిస్తున్నారని, ముందు కరోనా ఎక్కడిది అన్నారని, పారాసిటమాల్‌ చేసుకుంటే సరిపోతుంది అన్నారని గుర్తు చేశారు. కానీ ప్రతిపక్షాలే నిలకడగా ఉన్నాయని, కరోనా నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మొదటి నుంచి ప్రభుత్వానికి సూచిస్తున్నాయని గుర్తు చేశారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే వాటిని పట్టించుకోకపోగా ఎదురుదాడి చేస్తునారని అన్నారు. తాము ఎవరి దర్శనం కోసం పడిగాపులు పడుతున్నట్టుగా సిఎం వ్యాఖ్యలు ఉన్నాయని, ప్రతిపక్షాల బాధ్యత సిఎం మీద ఆధారపడి లేదని, సిఎం కల్పిస్తే వస్తుంది లేదంటే పోతుంది అనేది పొరపాటు అని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గొంగళి పురుగునైనా ముద్దాడుతామని కెసిఆర్‌ అన్నారని, రాజకీయ జెఎసి అవసరమని ఒక దానిని ఏర్పాటు చేశారని, అందరూ కలిస్తేనే కదా తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. ఇవాళ అందరి పాత్రను సిఎం చిన్నగా చేసే ప్రయత్నం చేస్తున్నారని కోదండరామ్‌ విమర్శించారు. తాము అన్ని జిల్లాలలో వైద్య సదుపాయం కల్పించాలని, పేదలకు అందజేస్తున్న సహాయం సరిపోదని, బియ్యంతో పాటు పప్పు నూనె ఇవ్వాలని, అలాగే రూ.5 వేలు ఇవ్వండి అని అడుగుతున్నామన్నారు. ప్రతిపక్షాలను తూర్పారబట్టినంత మాత్రాన కొట్టుకుపోతాయనుకుంటే, దాని కంటే పెద్ద పొరపాటు మరొకటి లేదన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?