తప్పుడు లెక్కలు?

లెక్కలకు మించి లక్షల్లో కరోనా మరణాలు!
స్పష్టం చేస్తున్న తాజా అధ్యయనం
న్యూఢిల్లీ : కరోనా మరణాల విషయంలో కేంద్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెప్తున్నదా? వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయా? లెక్కలకు మించి లక్షల్లో కరోనా మరణాలు సం భవించాయా? ఈ ప్రశ్నలకు తాజా అధ్యయనం అవుననే సమాధానమిస్తున్నది. కరోనా కట్టడిలో విఫలమైందనే విమర్శలను ఎదుర్కోవడానికి భయపడి కేంద్రం మరణాల సంఖ్యను తక్కువగా చూపించి ఉండవచ్చు. లేదా ప్రజలు మరిం త భయాందోళనకు గురవుతారన్న అనుమానం తో పూర్తి వివరాలను అందించకపోయి ఉండవచ్చు. కారణాలు ఏవైనప్పటికీ, కరోనా మరణాల్లో అధికారిక లెక్కలకు, వాస్తవ వివరాలకు మధ్య చాలా తేడా ఉందని మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణ్యం నేతృత్వంలోని బృందం చేసిన అధ్యయనం తేల్చిచెప్పింది. కనీసం 49 లక్షల మరణాలు లెక్కల్లోకి రాలేదంటే, ప్రకటిత, వాస్తవ పరిస్థితులకు ఎంత భారీ తేడా ఉందో ఊహించుకోవచ్చు. అధికారికల గణాంకాలను అనుసరించి అమెరికా, బ్రెజిల్‌ తరువాత ప్రపంచంలోనే మూడో అత్యధికంగా 4,14,000 కరోనా మరణాలు భారతలో సంభవించాయి. అయితే, వాస్తవానికి 34 లక్షల నుంచి 49 లక్షల వరకు అదనపు మరణాలు నమోదై ఉంటాయని వివిధ మార్గాల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా పేర్కొంది. మే మాసంలోనే లక్షా 70 వేల మంది మృతి చెందారంటే, దేశంలో వనరుల కొరత ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుందని ఆ నివేదిక తెలిపింది. మందులు, ఆక్సిజన్‌ కొరత, మౌలిక సదుపాయాలు లేకపోవడం, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా జరగకపోవడం వంటి పలు అంశాలు భారత్‌లో కరోనా విలయానికి కారంమని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. భవిష్యత్తులో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది.

DO YOU LIKE THIS ARTICLE?