తగ్గని వరద

ఉత్తరాది రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తం

న్యూఢిల్లీ : ఉత్తరాది రాష్ట్రాల్లో వరద ఉధృతికి పూర్తిగా తెరపడలేదు. ఫలితంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. జమ్మూకశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌తోపాటు ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. పలు ప్రాంతాల్లో భవనాలు, ఇతర కట్టడాలు పాక్షికంగా కూలడంతో మృతుల సంఖ్య పెరుగుతున్నది. ఆకస్మిక వరదలతోపాటు కొట్టుకొచ్చిన బురద ఇళ్లను, రోడ్లను ముంచెత్తుతున్నది. పేరుకుపోతున్న బురదతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. జమ్మూకశ్మీర్‌లో వరదలకు వంతెనలు కొట్టుకుపోయాయి. కొంత చరియలు విరిగిపడుతున్నాయి. బుధవారం నాటి ఆకస్మిక వరదల్లో తొమ్మిది మంది మృతి చెందిన విషయం విదితమే. తొమ్మిది ఇళ్లు కొట్టుకుపోగా, విపత్తు నిర్వాహణ దళాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. అక్కడే శిథిలాల నుంచి ఐదు మృత దేహాలను వెలికితీశారు. మరికొంత మంది ఇంకా చిక్కుకుపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పద్దర్‌ ప్రాంతం నుంచి 60 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోరెండు మూడురోజులు భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కిష్టావర్‌ జిల్లా పరిపాలన యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలకు నదీ జలాలు దెహ్రాడూన్‌లోని తప్కేశ్వర్‌ మహాదేవ్‌ ఆలయంలోకి ప్రవేశించాయి. గంగోత్రిలోనూ వరద ఉధృతి కొనసాగుతోంది. వరదలు ఒకటిరెండు రోజులు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మధ్యప్రదేశ్‌ను కూడా ఆకస్మిక వరదలు ముంచెత్తుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోతున్నాయి. ప్రాణ నష్టం ఎక్కువగా ఉండవచ్చని అంటున్నారు. అయితే, అధికారికంగా ఇంకా ప్రకటన వెలువడలేదు. ఇలావుంటే, పశ్చిమ బెంగాల్‌ను భారీ వర్షాలు వెంటాడుతున్నాయి. కోల్‌కతాలో వీధులన్నీ జలమయమయ్యాయి. రహదారులు జలాశయాలను తలపిస్తున్నాయి. ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ, ఆస్తి నష్టం ఎక్కువగానే ఉంటుందని సమాచారం.

DO YOU LIKE THIS ARTICLE?