ఢిల్లీలో పెట్రోల్‌ కంటే డీజిల్‌ ప్రియం

వరుసగా 18వ రోజూ ధర పెంచిన చమురు సంస్థలు
అయితే ఈ సారి పెట్రోల్‌కు కాస్త ఊరట
న్యూఢిల్లీ : డీజిల్‌ ధర వరుసగా 18వ రోజు కూడా పెరిగింది. తాజా పెంపుతో బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో డీజిల్‌ ధర ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా పెట్రోల్‌ ధరను మించిపోయింది. దేశీయ చమురు సంస్థలు విడుదల చేసిన ధరల నోటిఫికేషన్‌ ప్రకారం వరుసగా 17 రోజుల పాటు పెట్రోల్‌ ధరులు పెరగగా, 18వ రోజు మాత్రం విరామమిచ్చాయి. అయితే డీజిల్‌ ధరను దేశ వ్యాప్తంగా లీటరకు 48 పైసలు పెంచాయి. ప్రస్తుతం ఢిల్లీలో డీజిల్‌ ధరలు రూ. 79.88 ఉండగా, పెట్రోల్‌ ధరలు 79.66గా ఉన్నాయి. అయితే ఆయా రాష్ట్రా ల్లో స్థానిక పన్నులు అదనంగా కలపడంతో ఆ మేరకు ధరల్లో వ్యత్యాసం ఉండనుంది. ఇదిలా ఉండగా, కేవలం దేశ రాజధానిలో మాత్రమే పెట్రోల్‌ కంటే డీజిల్‌ పిరమైంది. రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో స్థానిక విక్రయాలు లేదా వ్యాట్‌ను పెంచడం వల్ల ఇంధ నం ధరలు గణనీయంగా పెరిగాయి. కాగా, పెట్రోల్‌ ధర ముంబయిలో లీటరుకు రూ. 86.54 ఉండగా, డీజిల్‌ ధర రూ. 78.22గా ఉంది. చెన్నైలో పెట్రోల్‌కు రూ. 83.04, డీజిల్‌కు రూ. 77.17గా ఉంది. అదే విధంగా కోల్‌కతాలో పట్రోల్‌ ధర లీటరుకు రూ. 81.45, డీజిల్‌కు 75.06, బెంగళూరులో పెట్రోల్‌ రూ. 82.35, డీజిల్‌ రూ. 75.96, హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ. 82.79, డీజిల్‌ రూ. 78.06గా ఉంది. సంప్రదాయం ప్రకారమైతే డీజిల్‌పై ట్యాక్స్‌కు తక్కువగా ఉండడం వల్ల పెట్రోల్‌ కంటే డీజిల్‌కు లీటరుకు రూ. 18 తక్కువగా ఉంటుంది. కానీ కొన్ని సంవత్సరాల నుంచి పన్నులు పెంచుతుండడం వల్ల రెండింటి ధరల మధ్య వ్యత్యాసం చాలా స్వల్వంగా ఉంది. కాగా, జూన్‌ 7వ తేదీ నుంచి చమురు సంస్థలు ధరలను వరుసుగా పెంచుతూ వస్తున్నాయి. అయితే 18వ రోజు మాత్రమే కేవలం డీజిల్‌ ధరను మాత్రమే పెంచాయి. దీంతో డీజిల్‌ ధర తారాస్థాయికి చేరింది. ఈ 18 రోజుల్లో కలుపుకొని డీజిల్‌ ధర మొత్తంగా రూ. 10.49, పెరగగా, 17 రోజుల్లో కలుపుకొని పెట్రోల్‌ ధర మొత్తంగా రూ. 8.50 పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా రవాణా, పారిశ్రామిక కార్యకలాపాలపై పరిమితులను సడలించడంతో ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. జూన్‌ 7కు ముందు లాక్‌డౌన్‌ కారణంగా 82 రోజుల పాటు దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదు.

DO YOU LIKE THIS ARTICLE?