డీజిల్‌, పెట్రోల్‌ పెనుభారంపై దేశవ్యాప్త నిరసనలు

నిరంతరాయంగా పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ప్రజలు భగ్గుమన్నారు. దేశవ్యాప్తంగా వామపక్షాలతోపాటు కాంగ్రెస్‌, ఆర్‌జెడి తదితర ప్రతిపక్షాల ఆధ్వర్యంలో నిరసన జ్వాలలు పెల్లుబికాయి. హైదరాబాద్‌లో వామపక్షాలు కొవిడ్‌ నిబంధనలకు లోబడి పెద్ద ఎత్తున నిరసన చేపట్టగా, కేరళలో అధికార వామపక్షాలతోపాటు, ఇతర పార్టీలు వేర్వేరుగా ఆందోళనలు నిర్వహించాయి. భోపాల్‌లో రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ ఆధ్వర్యంలో సైకిల్‌ర్యాలీ జరగ్గా, పోలీసులు దిగ్విజయ్‌తోపాటు 150 మందిపై కేసులు పెట్టి అరెస్టు చేశారు. కోల్‌కతా, విజయవాడ, లక్నో, అగర్తల, బెంగుళూరు, తిరువనంతపురం, భువనేశ్వర్‌, నాగ్‌పూర్‌, పూణె, రాంచి తదితర ప్రాంతాల్లో నిరసనలు తలెత్తాయి.

కళ్లు చెవులు మూసుకున్న ప్రధాని
నోరు విప్పని కెసిఆర్‌

ప్రజాపక్షం/హైదరాబాద్‌: కరోనా కాలంలో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం, ధరల పెంపుతో పెనుభారం మోపుతోందని వామపక్ష పార్టీల నాయకులు విమర్శించారు. సాయం అందించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయాన్ని సమకూర్చుకునేందుకే ప్రయత్నిస్తున్నాయని, సామాన్యుల జేబులను కొట్టివేస్తున్నాయని ధ్వజమెత్తారు. “పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తక్షణమే తగ్గించాలని” డిమాండ్‌ చేస్తూ హైదరాబాద్‌లోని నారాయణగూడ వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసనలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, కార్యదర్శి వర్గ సభ్యులు వి.ఎస్‌.బోస్‌, హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి ఇ.టి.నర్సింహ్మ, సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కార్యదర్శి వర్గ సభ్యులు డి.జి.నర్సింహ్మ, బి.వెంకట్‌, హైదరాబాద్‌ కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌, సిపిఐ ఎం.ఎల్‌. న్యూడెమోక్రసి రాష్ట్ర నాయకురాలు రమాదేవి, ఎంసిపిఐ(యు) రాష్ట్ర నాయకులు తాండ్రకుమార్‌, ఆర్‌ఎస్‌పి రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు, సిపిఐ(ఎం.ఎల్‌) లిబరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి రాజేశ్‌, ఎఐఎఫ్‌బి నాయకులు తదితరులు హాజరయ్యారు.“కరోనా సమయంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచడం సిగ్గు సిగ్గు, పెంచిన ధరలను తక్షణమే తగ్గించాలని” నిరసనకారులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నట్టే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయని విమర్శించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో సగానికి సగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పన్నులే ఉన్నాయన్నారు. ప్రభుత్వాలు తమ ఆదాయాలను పెంచుకునేందుకు పేదలు, సామాన్యుల నడ్డి విరుస్తున్నాయన్నారు. చమురు ధరలు పెరుగుతుంటే ప్రధానమంత్రి మోడీ కళ్లు, చెవులు కనిపించడం లేదా అని ఎద్దేవా చేశారు. ఈ ధరల ప్రభావం నిత్యావసర ధరలపై పడుతోందని, తద్వారా ప్రజలపై మరింత భారం పడుతుందని అన్నారు. బరితెగించి ధరలను పెంచుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పన్నులను ఉపసంహరించాలని ఆయన డిమాండ్‌ చేశారు.
ఎమర్జెన్సీని అమలు చేస్తున్న మోడీ ప్రభుత్వం బి.వి.రాఘవులు
మోడీ ప్రభుత్వం అనధికారికంగా ఎమర్జెన్సీని అమలు చేస్తోందని సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. పౌర హక్కులను కాలరాస్తోందని, ప్రజాస్వామ్యాన్ని మోడీ ప్రభుత్వం పాతర వేస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యవాదులపై కేసులు నమోదు చేస్తోందన్నారు. ప్రజలకు సహాయం చేయాల్సిన ప్రభుత్వం, ప్రజల నోళ్లు కొట్టి బలవంతంగా పన్నులను వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను సగానికి సగం తగ్గించాలని డిమాండ్‌ చేశారు. సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర పన్నుల కారణంగానే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయని ఆరోపించారు. 70 శాతం పన్నులు వసూలు చేస్తున్నారన్నారు. సిపిఐ (ఎం.ఎల్‌) న్యూడెమోక్రటిక్‌ రాష్ట్ర నాయకులు రమాదేవి మాట్లాడుతూ కరోనా సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను పట్టించుకోకుండా వదిలిపెట్టడం దుర్మార్గ చర్యగా అభివర్ణించారు. కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఎంసిపిఐ(యు) రాష్ట్ర నాయకులు తాండ్రకుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ కంపెనీలను ప్రైవేటీకరణ చేసిన తర్వాత పాలకులు ఏం చేస్తారని, గడ్డి పీకుతారా అని ఎద్దేవా చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ హైదరాబాద్‌ నగర కార్యవర్గ సభ్యులు ఎస్‌.ఎం.మన్నన్‌, టి.రాకేష్‌సింగ్‌, ఎన్‌.శ్రీకాంత్‌, డి.హరినాథ్‌గౌడ్‌, ఎఐటియుసి హైదరాబాద్‌ ప్రధాన కార్యదర్శి కమతం యాదగిరి, ఆర్‌.మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, పెట్రో ఉత్పత్తుల ధరలని తగ్గించాలని, కరోనా పరీక్షలను అందరికీ ఉచితంగా చేయాలని, అదిక కరెంటు ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సిపిఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ గురువారం విద్యానగర్‌ నుండి చేపట్టిన నిరసన ప్రదర్శనను పోలీసులు అడ్డకోవడంతో న్యూడెమోక్రసీ కార్యాలయవం వద్దే నిరసన నిర్వహించింది.

DO YOU LIKE THIS ARTICLE?