డాక్టర్‌ రాస్తేనే  మెడిసిన్‌

చీటి లేకుండా మందులు ఇవ్వొద్దు
డాక్టర్‌ రాస్తేనే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరానికి మందులు : మెడికల్‌ షాపులకు కీలక ఆదేశాలు
కరోనా కట్టడికి సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
ప్రిస్కిప్షన్‌ లేనిదే విక్రయించరాదని మెడికల్‌ షాపులు, అసోసియేషన్లకు ఉత్తర్వులు
కరోనా లక్షణాలున్నా ముందుకు రాని  అనుమానితులు

ప్రజాపక్షం/హైదరాబాద్‌ : కరోనా వ్యాప్తి నేపథ్యంలోతెలంగాణ ప్రభుత్వం మెడికల్‌ షాపు లు, అసోసియేషన్లకు కీలక ఆదేశాలను జారీ చేసింది. డాక్టర్‌ ప్రిస్కిప్షన్‌ లేకుండా మందులు విక్రయించరాదని సంచలన నిర్ణయం తీసుకుంది. దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలతో చాలా మంది ప్రజలు ఇష్టానుసారంగా మెడికల్‌ షాపులకు వెళ్లి అవసరమైన మందులను కొనుగోలు చేసుకొని వేసుకుంటున్నారు. ఇందులో కరోనా అనుమానితులు కూడా ఉంటుండడంతో ప్రభు త్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సొంతంగా మందులు తీసుకోవడంతో స్వల్పంగా ఉపశమన కలుగుతున్నందున కరోనా పరీక్షలకు కొందరు రావడం లేదన్న ఉద్దేశంతో మెడికల్‌ షాపులపై ఈ విధమైన ఆంక్షలకు ప్రభుత్వం తెరలేపింది. కరోనా కేసులు రాష్ట్రంలో నమోదవుతున్నప్పటి నుంచి ప్రజలు అప్రమత్తమై ముందస్తు చర్యల్లో భాగంగా వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే చాలూ ఎవరికివారు స్వతహాగా మందులు కొనుగోలు చేసుకొని వేసుకుంటున్నారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నప్పటికీ కొంత మంది తమ స్థితిని ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు నిరాకరిస్తున్నారని అధికారులు గుర్తించారు. దీంతో తాజా వ్యూహానికి రూపకల్పన చేశారు. తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతుండటంతో ప్రభుత్వం అందుకు తగ్గ విధంగా వ్యూహాలను మార్చుకుంటూ ముందుకు పోతోంది. కరోనా అనుమానితులను ముందస్తుగానే గుర్తించేందుకు సరికొత్త ఓ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఉన్న అన్ని మెడికల్‌ షాపులను ఫీవర్‌ సర్వియలెన్స్‌ పరిధిలోకి తీసుకొస్తూ తాజాగా ఉత్వర్వులు జారీ చేసింది. దీని ప్రకారం మెడికల్‌ షాపులకు వచ్చి జ్వరం, గొంతు నొప్పి మాత్రలు ఎవరైతే కొనుగోలు చేస్తారో వారి వివరాలను సేకరించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  జ్వరం, గొంతు నొప్పి, జలుబు టాబ్లెట్లను మెడికల్‌ షాపుల్లో కొనుగోలు చేసేవారిపై ఇకపై నిఘా ఉండనుంది. ఇలాంటి వారి వివరాలను సేకరించాలని మెడికల్‌ షాపులను ప్రభుత్వం ఆదేశించింది. జ్వరం, గొంతు నొప్పి మందులను కొనుగోలు చేసిన వారి వివరాలను తప్పనిసరిగా అందజేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేయాలని తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన మున్సిపల్‌ కమిషనర్లకు మంత్రి కెటిఆర్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక ఇటీవల గొంతు నొప్పి, జ్వరం, జలుపు కోసం మందు బిళ్లలు కొనుగోలు చేసిన వారి వివరాలను కూడా తెలుసుకోవాలని మంత్రి సూచించారు. మరోవైపు డ్రగ్‌ ఇన్‌ స్పెక్టర్లు కూడా మున్సిపాలిటీల పరిధిలోని ఫార్మసి అసోసియేషన్‌ సభ్యులతో ఈ అంశంపై సమీక్ష జరపాలని తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?