డబ్బుల ఇబ్బంది లేదు

తెలంగాణ ఎప్పటికీ ధనిక రాష్ట్రమే : కెసిఆర్‌
అడవులు పునరుద్ధరణే ప్రభుత్వ ధ్యేయం
అక్రమ కలప నిరోధించేందుకు ప్రత్యేక విభాగం
మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో హరితహారాన్ని ప్రారంభించిన సిఎం
ప్రజాపక్షం / నర్సాపూర్‌  ‘రాష్ట్రంలో డబ్బులకు ఎలాంటి ఇబ్బందిలేదు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించిన కారణంగా మూడు నెలలు ఉద్యోగులకు సగం జీతాలు ఇచ్చాం. ప్రస్తుతం మొత్తం జీతాలు ఇస్తాం. వేతనాలు ఆపినప్పటికీ రైతుబంధు, గ్రామాలు, మున్సిపాలిటీలకు నిధులను ఆడం లేదు. తెలంగాణ ఎప్పటికి ధనిక రాష్ట్రమే. అందులో ఎలాంటి సందేహంలేదు’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో అడవులు పునరుద్ధరణే తెలంగాణ హరితహారం ముఖ్య ఉద్దేశమని, అందుకు గాను ప్రభుత్వం ఎన్ని నిధులు ఖర్ఛు చేయడానికి అయినా వెనుకాడేదిలేదని చెప్పా రు. గురువారం మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో హరితహారం కార్యక్రమాన్ని సిఎం కెసిఆర్‌ ప్రారంభించారు. అక్కడే ఆరు మొక్కలను నాటారు. అర్బన్‌ పార్కు ప్రాంతంలో నిర్మించిన వాచ్‌ టవర్‌పైకి ఎక్కి నర్సాపూర్‌ అటవీ ప్రాంతం అందాలను తిలకించారు. అనంతరం సిఎం మాట్లాడుతూ అక్రమ కలపను నిరోధించడానికి ప్రభుత్వం ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసిందని, దీని వల్ల అడవుల్లో చీమ చిటుక్కుమన్నా తమకు తెలిసిపోతుందన్నారు. ప్రస్తుతం చెట్లను కొట్టివేయడంతో మళ్ళీ మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఎక్కడా వర్షాలు పడకున్నా ఎక్కువగా అటవీ ప్రాంతం ఉన్న నర్సాపూర్‌ ప్రాంతంలో వర్షాలు కురిసేవని ప్రస్తుతం ఈ ప్రాంతంలో అటవీ విస్తీర్ణం క్షీణించడంతో ఆ పరిస్థితి లేదని చెప్పారు. అడవుల వల్ల సమాజానికి కలిగే ఉపయోగాలను గుర్తించి వాటి పునరుద్ధరణకు ప్రభత్వం అధిక ప్రాధన్యతనిస్తుందన్నారు. ఇప్పటికే అటవీశాఖలో రెండు వేల ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు 2200 వాహనాలు సమకూర్చామని సిఎం అన్నారు. మనం చేతులారా పోగొట్టుకున్న అడవిని తిరిగి మనమే వందశాతం తెచ్చుకోవాలని తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీకి ఒక ట్రాక్టర్‌, ట్యాంకర్‌ సమకూర్చినట్లు ఆయన వివరించారు. హరితహారంలో నాటిన మొక్కలకు నీరు పోసేందుకు వీటిని ఉపయోగించుకోవాలని కోరారు. వచ్చే ఏడాదిలోగా కాళేశ్వరం నుంచి సంగారెడ్డికి నీళ్ళు వస్తాయని, ఇప్పటికే నర్సాపూర్‌ దాటి పాములపర్తి వరకు వచ్చాయని అన్నారు. తాను సిద్దిపేట ఎంఎల్‌ఎగా ఉన్న సమయంలో హరితహారం కార్యక్రమం కింద పది వేల మొక్కలు నాటేందుకు నానా ఇబ్బందులు పడ్డానని, అదే అనుభవంతో రాష్ట్రంలోని అన్ని గ్రామపంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేసినట్లు సిఎం స్పష్టం చేశారు. ఈ విధానం దేశంలో ఎక్కడా లేదని మన రాష్ట్రంలోనే ఉందని, ఇదే విధానాన్ని ప్రస్తుతం ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ రైతులు బాగుపడాలన్నాదే ప్రభుత్వ ధ్యేయమని, రైతుల అప్పలు తీరిపోవడంతో పాటు వారి బ్యాంకు ఖాతాల్లో ఎప్పటికీ కనీసం లక్ష రూపాయలు ఉండాలని, ఆ దిశగా తాము చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం నియంత్రిత సాగు విధానం ప్రవేశపెట్టిందని, దీనివల్ల డిమాండ్‌ ఉన్న పంటలనే సాగు చేయాలని, పంట ఉత్పత్తులను ఎలా కొనుగోలు చేయాలనే దాని గురించి ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. ఈ విషయంలో రైతులకు సౌకర్యవంతంగా ఉండే విధానాన్ని తీసుకువచ్చి వారికి ఎలాంటి తిప్పలు లేకుండా చూస్తామన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?