టెర్రర్‌ రాక్షసానికి 215 మంది బలి

ఈస్టర్‌ రోజున చర్చీలు, ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో వరుస పేలుళ్లు

శరీర భాగాలు చెల్లాచెదురు
పలు ఆసుపత్రుల్లో రక్తం కొరత
మృతుల్లో ముగ్గురు భారతీయులు
ఎల్‌టిటిఇతో అంతర్యుద్ధం ముగిశాక అతిపెద్ద దాడి ఇదే
దాడులు జరగవచ్చని ముందే హెచ్చరించిన విదేశీ నిఘా సంస్థ
రాత్రిపూట కర్ఫ్యూ విధింపు
దాడిని ఖండించిన ప్రపంచ దేశాలు
ఇలాంటి ఆటవిక చర్యలకు స్థానం లేదు:భారత ప్రధాని మోడీ
పరిస్థితిని గమనిస్తున్నాం: సుష్మాస్వరాజ్‌

కొలంబో: శ్రీలంకలో ఆదివారం కైస్తవుల పవిత్ర ఈస్టర్‌ పర్వదినం రోజున మూడు చర్చీలు, లగ్జరీ హోటళ్లు లక్ష్యంగా ఎనిమిది ప్రాంతాల్లో దాడులు జరిగాయి. ఈ దాడుల్లో కనీసం ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లు పాల్గొని ఉంటార ని భావిస్తున్నారు. ఈ వరుస బాంబు దాడుల్లో 215 మంది చనిపోగా, దాదాపు 500 మంది ఇతరులు గాయపడ్డారు. ఎల్‌టిటిఇతో అంతర్యుద్ధం ముగిశాక శ్రీలంకలో ప్రశాంతతకు విఘాతం కలిగించిన అతిపెద్ద దాడి ఇదే. ఈస్టర్‌ సామూహిక ప్రార్థనలు జరుగుతున్నప్పుడు కొలంబోలోని సెయింట్‌ ఆంథోని చర్చి, నెగోబో పట్టణం పశ్చిమ తీరంలో ఉన్న సెయింట్‌ సెబాస్టియన్‌ చర్చి, బట్టికలోవ తూర్పున ఉన్న చర్చిలో ఆదివారం స్థానిక కాలమానప్రకారం ఉదయం 8.45 గంటలకు బాంబు పేలుళ్లు జరిగాయని పోలీస్‌ ప్రతినిధి రువాన్‌ గుణశేకెర తెలిపారు. కొలంబోలో మూడు ఫైవ్‌స్టార్‌ హోటళ్లు… ద షాంగ్రి-లా, ద సిన్నమన్‌ గ్రాండ్‌, కింగ్స్‌బరీలో కూడా పేలుళ్లు చోటుచేసుకున్నాయని వార్తాలందాయి. సిన్నమన్‌ గ్రాండ్‌ హోటల్‌ రెస్టారెంట్‌లో ఓ ఆత్మాహుతి బాంబరు తనను తాను పేల్చేసుకున్నాడని అధికారులు చెప్పారు. విదేశీయులు సహా అనేక మంది చనిపోయారని శ్రీలంక ఆర్థిక సంస్కరణలు, ప్రజా పంపిణీ శాఖ మంత్రి హర్షా డీసిలా చెప్పారు. బాంబు పేలుళ్లలో చనిపోయిన వారిలో ఇద్దరు చైనీయులు సహా కనీసం 11 మంది విదేశీయులున్నట్లు సమాచారం. చనిపోయినవారిలో అమెరికన్లు, బ్రిటన్‌ దేశీయులు కూడా ఉన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?