టీకా పంపిణీ కట్టుదిట్టం

రాష్ట్రాలకు కేంద్రం సూచన
ఏర్పాట్ల పట్ల సంతృప్తి
న్యూఢిల్లీ : కొవిడ్‌ 19 టీకా పంపిణీ పర్యవేక్షణకు ఆన్‌లైన్‌ వేదికైన కొ విన్‌ మొత్తం టీకా కార్యక్రమానికి ఆధారంగా నిలుస్తుందని కేంద్రం ఆదివారం వెల్లడించింది. ఇది ప్రజలే కేంద్రంగా ఉంటుందని, అందువల్ల టీకా ఎప్పుడైనా, ఎక్కడైనా అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. భారత్‌ కొవిడ్‌ 19 టీకా కార్యక్రమాన్ని ఈ నెల 16 నుంచి ప్రారంభించనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమంగా అభివర్ణించారు. ఇందులో దాదాపు మూడు కోట్ల మంది ఆరోగ్య కార్యకర్తలు, ముందువరస కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దేశవ్యాప్తంగా కొవిడ్‌ 19 టీకా కార్యక్రమం కోసం ఏర్పాట్లలో భాగంగా కొ విన్‌ సాఫ్ట్‌వేర్‌ గురించి, టీకాల డ్రై రన్‌లో దాని వినియోగం గురించి ఫీడ్‌బ్యాక్‌ చర్చ కోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖఆదివారం నాడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. కొవిడ్‌ 19 కట్టడికి సాంకేతికత, సమాచార నిర్వహణపై సాధికార బృందానికి అధ్యక్షుడైన రామ్‌ సేవక్‌ శర్మ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఆయన కొవిడ్‌ 19 టీకా నిర్వహణపై జాతీయ నిపుణుల బృందంలో సభ్యుడు కూడా. కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌, ఇంకా టీకా కార్యక్రమానికి సాంకేతిక మద్దతు అందించే సూత్రాలపై ఆయన కూలంకష సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్త కొవిడ్‌ 19 టీకా కార్యక్రమానికి శక్తిమంతమైన, ఆధారపడదగిన, చురుకైన సాంకేతికత పునాదిగా నిలుస్తుందని తెలిపారు. “ఇది ప్రజలే కేంద్రంగా ఉంటుందని, అందువల్ల టీకా ఎప్పుడైనా, ఎక్కడైనా అందుబాటులో ఉంటుంది” అని శర్మ వ్యాఖ్యానించారు.
ఆధార్‌తోపాటు ఫోన్‌ నంబర్‌ కొవిన్‌ డిజిటల్‌ వేదికను డిజైన్‌ చేసేటప్పుడు నాణ్యత విషయంలో రాజీపడకుండా పట్టువిడుపులు ఉండేలా చూసుకున్నామని శర్మ అన్నారు. ఇంకా అందరినీ సమ్మిళితం చేసుకోవడం, వేగం, పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకున్నామన్నారు శర్మ. కొవిన్‌ ఎక్కడైనా, ఎప్పుడైనా ఉపయోగించుకునేలా ఉంటుందన్నారు. టీకా కార్యక్రమం సమాచారాన్ని ఎప్పటికప్పుడే తెలుసుకోవడంలో “ఇందులో మరో మాటకు తావేలేదు” అని దాని ప్రాధాన్యాన్ని తెలియజేశారు. ఇక లబ్ధిదారులు ఒకరి బదులు వేరొకరు వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. అందుకని టీకా లబ్ధిదారులను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన పునరుద్ఘాటించారు. ఈ దిశగా లబ్ధిదారులకు సమాచారాన్ని ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలియజేసేందుకు వీలుగా వారు రిజిస్ట్రేషన్‌ కోసం ఆధార్‌తోపాటు ప్రస్తుత ఫోన్‌ నంబర్‌ను తెలపాలని రాష్ట్రాలకు శర్మ సూచించారు. టీకా వేసుకున్న వ్యక్తిని గుర్తించి, ఎవరు ఎవరికి టీకా వేశారు, ఎప్పుడు వేశారు, ఏ టీకా వేశారు అన్న వివరాల గురించి ఒక డిజిటల్‌ రికార్డు నిర్వహించాలని శర్మ స్పష్టంచేశారు. రాష్ట్రాల ప్రిన్సిపల్‌ సెక్రటరీలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమం డైరెక్టర్లు, రాష్ట్రాల ఇమ్యునైజేషన్‌ అధికారులు, కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన సీనియర్‌ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
రెండు టీకాల అత్యవసర వినియోగానికి భారత్‌ ఇటీవలే అనుమతులు మంజూరు చేసింది. అవి సీరం ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారుచేసిన ఆక్స్‌ఫర్డ్‌ కొవిషీల్డ్‌, భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌. ఇవి రెండూ సురక్షితం, రోగ నిరోధకం అని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆరోగ్య కార్యకర్తలు, ముందువరస కార్యకర్తలకు టీకాలు వేశాక 50 ఏళ్లు పైబడిన వారు, ఇతర వ్యాధులు ఉన్న 50లోపు వారికి ప్రాధాన్యం ఇస్తారు. వీరంతా కలిపి 27 కోట్లు ఉంటారని ప్రభుత్వ ప్రకటన తెలిపింది.

DO YOU LIKE THIS ARTICLE?