టిక్‌టాక్‌ నిషేధం

యుసి బ్రౌజర్‌, షేర్‌ ఇట్‌, వియ్‌ చాట్‌ హలో యాప్‌లూ అవుట్‌
59 చైనా యాప్‌లను నిషేధిస్తూ కేంద్ర సర్కారు నిర్ణయం
న్యూఢిల్లీ: చైనాతో ఉద్రిక్తతల వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 59 చైనా మొబైల్‌ యాప్‌లను నిషేధించింది. టిక్‌టాక్‌, యుసి బ్రౌజర్‌, షేర్‌ ఇట్‌, హలో, వైబో, డియూ క్లీనర్‌, డియూ బ్రౌజర్‌ తదితర 59 యాప్‌లను కేంద్రం నిషేధించింది. ప్రభుత్వం నిషేధం విధించిన వాటి లో వియ్‌ చాట్‌, బిగో లైవ్‌, లైకీ, క్యామ్‌ స్కానర్‌, విగో వీడియో, ఎంఐ వీడియో కాల్‌, క్లాష్‌ ఆఫ్‌ వింగ్స్‌, యుసి న్యూస్‌, వైరస్‌ క్లీనర్‌, న్యూస్‌ డాగ్‌, క్యూక్యూ మ్యూజిక్‌, క్యూక్యూ న్యూస్‌ ఫీడ్‌, బైదూ ట్రాన్స్‌లేట్‌, యు వీడియో, ఇ ఫ్లాట్‌ఫామ్స్‌ క్లబ్‌ ఫ్యాక్టరీ, షైన్‌ ఉన్నాయి. జూన్‌ 15న లడక్‌ గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు చనిపోయిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణ యం తీసుకుంది. బలగాల ఉపసంహరణ సమయంలో చైనా సైనికులు కుట్రపూరితంగా వ్యవహరించి 20 మంది భారత జవాన్లను పొట్టన
పెట్టుకున్నారు. ఘర్షణలో 45 నుంచి 50 మంది చైనా జవాన్లు చనిపోయినా అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. 17 మంది చైనా సైనికుల మృతదేహాలను భారత్‌ అప్పగించింది. అంతేకాదు తాము బందీగా పట్టుకున్న చైనా కల్నల్‌ను కూడా భారత్‌ విడుదల చేసింది. అయితే చైనా మాత్రం తమ సైనికుల మరణాలపై క్లారిటీ ఇవ్వకుండా దాచుతోంది. జూన్‌ 15న తలెత్తిన ఉద్రిక్తతలను తగ్గించడానికి రెండు దేశాలూ యత్నిస్తున్నాయి. అయితే అదే సమయంలో చైనా తన బలగాలను పెంచుతున్న కొద్దీ భారత్‌ కూడా ఎల్‌ఎసి వెంబడి తన జవాన్లను మోహరిస్తూ పోతోంది. ఎల్‌ఎసి వెంబడి 3,500 కిలోమీటర్ల వరకూ విమానాలు, హెలికాఫ్టర్ల ద్వారా భారత్‌ నిఘా ఉధృతం చేసింది.

DO YOU LIKE THIS ARTICLE?