టిఆర్‌ఎస్‌ నేతలకు ప్రగతి భవన్‌ గుర్తింపు కార్డులు

సిఎం కెసిఆర్‌ను కలిసేందుకు అవకాశం
పార్టీ, ప్రభుత్వ సమన్వయం పేరుతో ‘ప్రత్యేక’ ప్రయత్నం

ప్రజాపక్షం/ హైదరాబాద్‌ : ప్రగతిభవన్‌లో ప్రవేశానికి టిఆర్‌ఎస్‌ రాష్ట్ర కమిటీకి ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం లోపలికి వెళ్లేందుకు పార్టీ రాష్ట్ర కమిటీకి అవకాశం కల్పించాలని పార్టీ అధ్యక్షులు, సిఎం కెసిఆర్‌ నిర్ణయించినట్లు తెలిసింది. పార్టీలోని రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులకు “ప్రగతిభవన్‌ గుర్తింపు” కార్డులను ముద్రించనున్నారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం మరింత పెరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే పార్టీ కమిటీ స్వయంగా సిఎంను కలిసే అవకాశాన్ని కల్పించాలని పార్టీ భావిస్తున్నది. ప్రస్తుతం ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు నేరుగా ప్రగతిభవన్‌కు వెళ్లేందుకు అవకాశమున్నది. ఇక నుంచి రాష్ట్ర కమిటీలోని 20 మంది ప్రధాన కార్యదర్శులు, 30 మంది కార్యదర్శులు, మరో 10 సంయుక్త కార్యదర్శుల కోసం ప్రత్యేకంగా ప్రభతి భవన్‌ కార్డులను ముద్రించనున్నారు. ఈ కార్డుపై ఫోటో, పార్టీలో హోదా, చిరునామ కూడా ముద్రించనున్నారు. కెటిఆర్‌ టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీ పదవులకు ప్రధాన్యత పెరిగింది. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకుపార్టీ బలోపేతానికి కెటిఆర్‌ చర్యలు తీసుకుంటున్నారు. పార్టీలోని ముఖ్య పదవులలో ఉన్న వారికి అధిక ప్రధాన్యత కల్పించాలని, తద్వారా ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం ఏర్పడుతుందని, దీంతో అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు అందేలా చూడాలని కెటిఆర్‌ భావిస్తున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?