టిఆర్‌ఎస్‌కు పులుసు తాపించండి

ఎంఐఎం చేతిలో కారు స్టీరింగ్‌
ఇలాగైతే కారు బేకారే
బిజెపి బహిరంగ సభలో మోడీ

ప్రజాపక్షం/ హైదరాబాద్‌: ‘పులుసు పుల్లగా ఉంటుంది, పోలింగ్‌ రోజున టిఆర్‌ఎస్‌కు పులుసు తాపించండి, ఆ పులుసు పులుపు మజా చూ పించండి’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆరేళ్ళ సహవాసంతో వాళ్ళు వీళ్ళవుతారనే సామెత ఉన్నదని, అలాగే ఎంఐఎం ఆరేళ్ళ దోస్తీతో టిఆర్‌ఎస్‌ వాళ్ళలాగే తయారైందన్నారు. టిఆర్‌ఎస్‌ సవారీ చేస్తున్న కారు స్టీరింగ్‌ ఎంఐఎం చేతుల్లో ఉందన్నారు. ఇలాంటి వారితో ఉంటే కారు బేకార్‌ అవ్వడం గ్యారెంటీ అని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌ ఎల్‌.బి స్టేడియంలో సోమవారం జరిగిన బిజెపి బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు. తెలంగాణలో కుటుంబ రాజకీయాలు నడుస్తున్నాయని, ఎంతసేపూ దూరపు బంధువుల వరకు బలోపేతం చేసుకోవడంపైన, ఓటు బ్యాంకు పైనే దృష్టి అని టిఆర్‌ఎస్‌, ఎంఐఎంలను ఎద్దే వా చేశారు. ఢిల్లీ మెట్రోకు దీటుగా తాము హైదరాబాద్‌ మెట్రో రైలును అభివృద్ధి చేద్దామనుకుంటే సాధ్యం కాలేదని, పాత నగరంలో ఎంఐఎం అనే పెద్ద స్పీడ్‌ బ్రేకర్‌ అడ్డంగా ఉందని విమర్శించారు. ఐదేళ్ళలో మూసీకి ఇటువైపు ఎంతో మారినా, అటువైపు (పాతబస్తీ) మాత్రం అప్పటి లాగే ఉన్నదని, అవే మురికికాలువలు బాగుపడలేదని, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నదన్నారు. ఎంఐఎంకు ఎప్పుడూ పగలూ రాత్రి మోడీనే గుర్తుకొస్తారని, ఈ చౌకీదార్‌ వాళ్ళకు నిద్ర లేకుండా చేశాడన్నారు. ఐదేళ్ళ తమ పాలనలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ.35 వేల కోట్ల పథకాలు ఇచ్చిందని, ముద్ర కింద 15 కోట్ల యువతకు గ్యారెంటీ లేకుండానే రుణాలిస్తే, అందులో 20 లక్షల మంది తెలంగాణలోనే ఉన్నారని వివరించారు. అలాగే రామగుండం ఫెర్టిలైజర్‌ ఫ్యాక్టరీని పునరుద్ధరించామని, నిమ్స్‌ ఇచ్చామని, యువతకు బాటలు వేశామని తెలిపారు. ఈ ఎన్నికలు కేవలం లోక్‌సభకు మాత్రమే జరగడం లేదని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశ విధానాలపై జరుగుతోందన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?