టాప్‌-10లో కెఎల్‌ రాహుల్‌ ఒక్కడే..

దుబాయ్‌: ఇటీవలే ఆస్ట్రేలియాతో ముగిసిన రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో రాణించిన భారత బ్యాట్స్‌మన్‌ కెఎల్‌ రాహుల్‌ తాజా ర్యాంకింగ్స్‌లో ఆరో ర్యాంక్‌ సాధించాడు. గురువారం ఐసిసి విడుదల చేసిన తాజా టి20 ర్యాంకింగ్స్‌లో భారత్‌ తరఫున కెఎల్‌ రాహుల్‌ ఒక్కడే టాప్‌ చోటు దక్కించుకున్నాడు. ఈ సిరీస్‌కి ముందు 10వ ర్యాంక్‌లో ఉన్న రాహుల్‌ 4 స్థానాలు ఎగబాకి 6వ ర్యాంక్‌కు చేరాడు. ఇక భారత సారథి విరాట్‌ కోహ్లీ రెండు స్థానాలు మెరుగుపర్చుకొని 17వ ర్యాంక్‌లో నిలిచాడు. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ 15వ ర్యాంక్‌లో ఉన్నాడు. ఇక సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ చివరి మ్యాచ్‌లో బ్యాట్‌ను ఝుళిపించడంతో ఏడే స్థానాలు ఎగబాకి 56వ ర్యాంక్‌ను అందుకున్నాడు. ఇక భారత బౌలర్లలో పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా 12 స్థానాలు మెరుగుపర్చుకొని 15వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. మరోవైపు ఈ సిరీస్‌లో రాణించిన స్పిన్నర్‌ కృనాల్‌ పాండ్యా సైతం 18 స్థానాలు ఎగబాకి 43వ ర్యాంక్‌లో నిలిచాడు. ఇక భారత్‌ఫై ఆస్ట్రేలియా సిరీస్‌ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన హిట్టర్‌ గ్లేన్‌ మ్యాక్స్‌వెల్‌ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 3వ ర్యాంక్‌లో నిలిచాడు. ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో సంచలనం సృష్టించిన అఫ్ఘానిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ హజ్రతుల్లా జాజయ్‌ 31 స్థానాలు ముందుకు దూకి తన కెరీర్‌ బెస్ట్‌ 7వ ర్యాంక్‌ను అందుకున్నాడు. ఇక టీమ్‌ విభాగంలో భారత్‌ తన రెండో స్థానాన్ని కాపాడుకుంది. ప్రస్తుతం టీమిండియా (122) రేటింగ్‌ పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మరోవైపు భారత్‌ గడ్డపై తొలి సారి సిరీస్‌ను సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా జట్టు సౌతాఫ్రికా, ఇంగ్లాండ్‌లను వెనుకకు నెట్టి మూడో ర్యాంక్‌ను అందుకుంది. పాకిస్థాన్‌ (135) రేటింగ్‌ పాయింట్లతో అగ్ర స్థానంలో కొనసాగుతున్నది. సౌతాఫ్రికా నాలుగు, ఇంగ్లాండ్‌ ఐదో స్థానంలో నిలిచాయి. తర్వాతి స్థానాల్లో న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌, అఫ్ఘానిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు వరుసగా టాప్‌ చోటు దక్కించుకున్నాయి.

DO YOU LIKE THIS ARTICLE?