జోక్యం చేసుకోలేం!

‘రాఫెల్‌’ పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు
నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఊరట

న్యూఢిల్లీ: మోడీ ప్రభుత్వానికి ఊరటనిచ్చే విధం గా సుప్రీంకోర్టు శుక్రవారం రాఫెల్‌ ఒప్పందంపై దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అక్రమాలు జరిగాయని, దీనిపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరుతూ న్యాయవాది, మానవహక్కుల కార్యకర్త ప్రశాంత్‌ భూషణ్‌ సహా మరి ఇద్ద రు మాజీ కేంద్రమంత్రులు యశ్వంత్‌ సిన్హా, అరుణ్‌ శౌరీ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసి న సంగతి తెలిసిందే. వీరికన్నా ముందు న్యాయవాదులు ఎం ఎల్‌ శర్మ, వినీత్‌ ధండ, ఆప్‌ నాయకుడు సంజయ్‌ సింగ్‌ కూడా పిటిషన్లు దాఖలు చేశారు. కాగా వీటిని కొట్టేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. రెండు దేశాలు అంతర్గత ప్రభు త్వ ఒప్పందం(ఐజిఎ) చేసుకున్న రూ. 56,000 కోట్ల ఒప్పందంలో అక్రమాలు జరిగాయని, దాని పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని పెట్టుకున్న పిటిషన్లను కోర్టు కొట్టేసింది. ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషనర్లు లేవనెత్తిన మూడు అంశాలు- ఒప్పందం నిర్ణయ ప్రక్రియ, ధర, భారతీయ ఆఫ్‌సెట్‌ భాగస్వామి(ఐఒపి) పరిశీలించి 36 జెట్‌ యుద్ధ విమానాల కొనుగోలు వంటి సున్నిత అంశంలో కోర్టు జోక్యం చేసుకోవలసిన అవసరంలేదని పేర్కొంది. భారతీయ వాయుసేనకు అత్యాధునిక యుద్ధ విమానాల అవసరం ఉందని, శత్రువుల వద్ద నాలుగోతరం, ఐదో తరం యుద్ధ విమానాలున్న నేపథ్యంలో మనకు ఒక్కటి కూడా లేకుండా ఉండడం సరికాదని, సన్నద్ధంకానీ లేక తగినంతగా సిద్ధంగాలేని యుద్ధవిమానాలు మనకుండడం సమంజసం కాదని కోర్టు అభిప్రాయపడింది. మేము మూడు అంశాలు పరిశీలించాక, పూర్తిగా విచారించాక సున్నితమైన అంశంలో ఈ కోర్టు జోక్యం చేసుకోవలసిన అవసరంలేదని భావిస్తోందని ధర్మాసనం తెలిపింది. న్యాయమూర్తులు ఎస్‌కె కౌల్‌, కె.ఎం. జోసెఫ్‌ కూడా ఉన్న ధర్మాసనం ఈ మేరకు 29 పేజీల తీర్పును వెలువరించింది. రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం 2016 సెప్టెంబర్‌ 23న ముగిసిందని, ఆ సమయంలో ఎలాంటి ప్రశ్నలను ఎవరూ లేవనెత్తలేదని, కానీ తర్వాత భారతీయ ఆఫ్‌సెట్‌ భాగస్వాముల గురించి ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలాండే ప్రకటన చేశాకనే పిటిషన్లు దాఖలు చేశారని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. భారతీయ ఆఫ్‌సెట్‌ భాగస్వాములను ఎంచుకోవడంలో భారత ప్రభుత్వం కమర్షియల్‌ ఫేవరెటిజంకు పాల్పడిందనడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని కోర్టు తెలిపింది. కేవలం పత్రికా ఇంటర్వ్యూలు, సూచనల ఆధారంగా కోర్టు న్యాయ సమీక్ష చేయజాలదని ధర్మాసనం పేర్కొంది. సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును అటార్నీ జనరల్‌ కెకె వేణుగోపాల్‌ స్వాగతించారు. తీర్పును ఆయన ‘అద్భుతం’, ‘బాగుంది’ అని కొనియాడారు. ధర్మాసనం ప్రభుత్వానికి ‘క్లీన్‌చిట్‌’ ఇచ్చిందని విలేకరులకు చెప్పారు.

DO YOU LIKE THIS ARTICLE?