జెపిసి దర్యాప్తు చేయాలి

సిపిఐ డిమాండ్‌
న్యూఢిల్లీ: దేశంలోని ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, ఉద్యమకారులు, ఇతర అనేక మంది ఫోన్ల ట్యాపింగ్‌ కోసం ఇజ్రాయిల్‌ స్పై సాఫ్ట్‌వేర్‌ ‘పెగాసస్‌’ను ఉపయోగించారనే ఆరోపణల వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి)తో సమగ్ర విచారణ జరిపించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) డి మాండ్‌ చేసింది. వాస్తవాలను తెలుసుకునే హక్కు దేశ ప్రజలకు ఉందని సిపిఐ కార్యదర్శి వర్గం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇజ్రాయిల్‌ స్పై సాఫ్ట్‌వేర్‌ ‘పెగాసస్‌’ ద్వారా ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, ఉద్యమకారులు, ఇతర అనేక మంది ఫోన్ల సంఖ్యను పరిశీలిస్తున్నారని అంశం దిగ్భ్రాంతిని కలిగించిందని సిపిఐ తెలిపింది. మోడీ ప్రభుత్వం ఇజ్రాయెల్‌ ప్రభుత్వంతో మంచి సంబంధాలు కలిగి ఉందని, భారత ప్రభుత్వానికి తెలియకుండానే ఇలాంటి నిఘా ఎలా నిర్వహించగలదని ప్రజలు ప్రశ్నిస్తున్నారని, ఈ నేపథ్యంలో వాస్తవాలు బయటకు రావాలని సిపిఐ కోరింది. అనధికార వ్యక్తులచే ‘ఎలాంటి అక్రమ నిఘా‘ భారతదేశంలో సాధ్యం కాదని ప్రభుత్వం పేర్కొన్నదని గుర్తు చేసింది. భారత రాజ్యాంగం పౌరులందరికీ గోప్యత హక్కును ఇస్తుందని, సుప్రీంకోర్టు కూడా ఈ హక్కును సమర్థించిందని సిపిఐ తెలిపింది. ‘మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి తన ప్రజా వ్యతిరేక, లౌకిక వ్యవస్థ వ్యతిరేక విధానాలను ముందుకు తీసుకురావడానికి పౌరులు, రాష్ట్రాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులపై నిరంతరం దాడి చేస్తోందని సిపిఐ విమర్శించింది. కాగా ఇజ్రాయిల్‌ స్పై సాఫ్ట్‌వేర్‌ ‘పెగాసస్‌’ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని అన్ని ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్‌, సిపిఐ (ఎం), టిఎంసి సోమవారం డిమాండ్‌ చేశాయి. ఇదిలా ఉండగా ఇద్దరు మంత్రులు, 40 మందికి పైగా జర్నలిస్టులు, ముగ్గురు ప్రతిపక్ష నాయకులు, ఒక సిట్టింగ్‌ జడ్జితో పాటు 300 మందికి పైగా ధృవీకరించబడిన మొబైల్‌ ఫోన్‌ నంబర్లు స్పువేర్‌ ద్వారా హ్యాకింగ్‌ కోసం లక్ష్యంగా పెట్టుకున్నదని అంతర్జాతీయ మీడియా కన్సార్టియం ఆదివారం నివేదించిన విషయం తెలిసిందే.

DO YOU LIKE THIS ARTICLE?