జెఇఇ మెయిన్స్‌, నీట్‌పరీక్షలు వాయిదా

సెప్టెంబర్‌ 1-6 తేదీల్లో జెఇఇ మెయిన్స్‌, 27న అడ్వాన్స్‌డ్‌
సెప్టెంబర్‌ 13న నీట్‌
న్యూఢిల్లీ: కరోనా దెబ్బతో కీలక ప్రవేశ పరీక్షలు జెఇఇ, నీట్‌ పరీక్షలు వాయిదా పడ్డా యి. కరోనా వైరస్‌ ఉధృతి నేపథ్యంలో జెఇఇ మెయిన్స్‌, నీట్‌ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు కేంద్ర మానవ వనరుల శాఖ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. షెడ్యూల్‌ ప్రకారం జెఇఇ పరీక్ష జులై 18 వరకు, నీట్‌ పరీక్ష జులై 26న జరగాల్సి ఉంది. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో ఈ పరీక్ష లు వాయిదా వేస్తున్నట్టు హెచ్‌ఆర్‌డి మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ తెలిపారు. సెప్టెంబర్‌ 1 నుంచి 6వ తేదీ మధ్య జెఇఇ మెయిన్స్‌, సెప్టెంబర్‌ 13న నీట్‌ పరీక్ష నిర్వహించనున్నామని ఆయన వెల్లడించారు. అలాగే జెఇఇ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను సెప్టెంబర్‌ 27న నిర్వహిస్తామని తెలిపారు. కాగా, మహమ్మారి కరోనా భయాలతో జెఇఇ, నీట్‌ పరీక్షలను వాయిదా వేయాలని పలు రాష్ట్రాల విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి విజ్ఞప్తులు అందడంతో.. విద్యార్థుల భద్రత, ఆరోగ్యం తమకు ముఖ్యమని కేంద్ర మానవ వనరుల శాఖ ఇదివరకే స్పష్టం చేసింది. పరీక్షలు వాయిదా వేయాలని కొందరు, వాటి నిర్వహణపై క్లారీటీ ఇవ్వాలని మరికొందరు మానవ వనరుల శాఖకు విన్నవించారు. ఈక్రమంలో పరిస్థితిని సమీక్షించి తగిన సిఫార్సులు చేసేందుకు కేంద్ర మానవ వనరుల మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ గురువారం ఓ కమిటీని నియమించారు. కమిటీ నివేదికను అనుసరించి పరీక్షలు వాయిదాకు శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా జెఇఇ మెయిన్స్‌కు దాదాపు 9 లక్షల మంది, నీట్‌కు సుమారు 16 లక్షల మంది దరఖాస్తు చేయగా.. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు లక్షన్నర మంది దరఖాస్తు చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?