జులై 31 వరకు అన్‌లాక్‌ 2.0

కంటైన్మెంట్‌ జోన్లలో నెలరోజులు లాక్‌డౌన్‌ పొడిగింపు
అన్‌లాక్‌ -2 విధివిధానాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
నేడు జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్న వేళ కంటైన్మెంట్‌ జోన్లలో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ పొడిగించింది. ఈ మేరకు సోమవారం అన్‌లాక్‌ -2 విధివిధానాలను ప్రకటించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలవుతున్న సడలింపులతో కూడిన లాక్‌డౌన్‌ జులై 31 వరకూ యథావిధిగా అమలవుతుందని కేంద్రం స్పష్టం చేసింది. కంటైన్మెంట్‌ జోన్లలో జులై 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర శిక్షణాసంస్థలకు జులై 15 నుంచి కార్యకలాపాలకు అవకాశం కల్పించింది. అలాగే, హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకే అంతర్జాతీయ ప్రయాణికులకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. మెట్రో రైళ్లు, థియేటర్లు, జిమ్‌లు, స్విమ్మింగ్‌ పూల్స్‌పై నిషేధం కొనసాగనుంది. సామాజిక, రాజకీయ, మతపరమైన కార్యకలాపాలపైనా నిషేధం కొనసాగుతుందని స్పష్టంచేసింది. బుధవారం నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లు, విద్యా సంస్థలు, అంతర్జాతీయ విమాన సేవలు, మెట్రో రైళ్ల సేవలు, సినిమా థియేటర్లు, జిమ్స్‌, స్విమ్మింగ్‌ పూల్స్‌, ప్రార్థనా మందిరాలకు జూలై 31 వరకూ అనుమతి లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం సాయంత్రం 4 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. కరోనా సంక్షోభం, చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని ప్రసంగానికి ప్రాధాన్యత సంతరించుకుంది.

DO YOU LIKE THIS ARTICLE?