జులై 2, 3, 4 తేదీల్లో బొగ్గు గని కార్మికుల నిరసనలు

పది కేంద్ర కార్మిక సంఘాల మద్దతు
ప్రజాపక్షం/న్యూఢిల్లీ : బొగ్గు గనుల వ్యాపారీకరణ, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బొగ్గు గని కార్మికులు పెద్ద ఎత్తున నిరసనలకు సమాయత్తమవుతున్నారు. జూన్‌ 10, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేసినప్పటికీ, ప్రభుత్వం పట్టించుకోకుండా గనులను ప్రైవేటీకరించింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బొగ్గు గని కార్మిక సంఘాలు జులై 2, 3, 4 తేదీల్లో వరుసగా మూడు రోజులపాటు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టడానికి సిద్ధమయ్యాయి. కోల్‌ ఇండియా, ఎస్‌సిసిఎల్‌లకు ఇప్పటికే నోటీసులు అందజేసినట్లు ఆలిండియా కోల్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి డి.డి.రమానందన్‌ వెల్లడించారు. అయితే అధికారులు ఈ సమ్మెలో పాల్గొంటారా లేదా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. కాకపోతే, 10 కేంద్ర కార్మిక సంఘాలు మాత్రం ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. ఈ మేరకు ఎఐటియుసి, ఐఎన్‌టియుసి, హెచ్‌ఎంఎస్‌, సిఐటియు, ఎఐయుటియుసి, టియుసిసి, ఎస్‌ఇడబ్ల్యు, ఎఐసిసిటియు, ఎల్‌పిఎఫ్‌, యుటియుసి సంఘాలు శుక్రవారంనాడు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. బొగ్గు పరిశ్రమలో కమర్షియల్‌ మైనింగ్‌ నిర్ణయాన్ని ఉపసంహరించాలని, సిఐఎల్‌ లేదా ఎస్‌సిసిఎల్‌లో ప్రైవేటీకరణ ద్వారా ఆ సంస్థలను నిర్వీర్యం చేసే దిశగా చేపట్టిన చర్యలను ఆపాలని, సిఐఎల్‌ నుంచి సిఎంపిడిఐఎల్‌ను విడదీయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించాలని, సిఐఎల్‌, ఎస్‌సిసిఎల్‌లలో ఒప్పంద కార్మికుల వేతనాలను పెంచాలని, నేషనల్‌ కోల్‌ వేజ్‌ అగ్రిమెంట్‌కు సంబంధించిన క్లాజులు 9.3.0, 9.4.0, 9.5.0లను కచ్చితంగా అమలు చేయాలని పది కార్మిక సంఘాలు డిమాండ్‌ చేశాయి. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించేంత వరకు ఈ పోరాటం సాగుతుందని హెచ్చరించాయి.

DO YOU LIKE THIS ARTICLE?