జిల్లాల్లో హడలెత్తిస్తున్న కరోనా

వనపర్తికీ సోకిన కొవిడ్‌ 19
కొత్తగా 74 కేసులు, వాటిలో 60 స్థానికమే
ఒకేరోజు ఆరుగురు మరణం
ప్రజాపక్షం/హైదరాబాద్‌ : రాష్ట్రంలో కరోనావైరస్‌ ఉన్నట్టుండి తన దశమార్చుకుంది. అనూహ్యమైన రీతిలో ఈ వైరస్‌ హడలెత్తిస్తోంది. కేసుల సంఖ్య వందలకు పెరుగుతోంది. తాజాగా శనివారంనాడు ఒక్క రోజే 74 కేసులు నమోదయ్యాయి. వీటిలో 60 కేసులు స్థానికంగా నమోదైనవే. మిగిలిన 14 కేసులు ప్రవాసులు, వలస కార్మికులకు సంబంధించినవి. అయితే జిహెచ్‌ఎంసినే అట్టుడికించిన కరోనా వైరస్‌ మరోసారి జిల్లాలను కుదిపేస్తున్నది. ఇప్పటివరకు కరోనా రహిత జిల్లాగా ఉన్న వనపర్తిలో తొలి కేసు నమోదైంది. కొత్తగా నమోదైన 60 కేసుల్లో 41 కేసులు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో నమోదుకాగా, 5 కేసులు రంగారెడ్డి జిల్లాలోనూ, రెండేసి కేసులు మహబూబ్‌నగర్‌, జగిత్యాల జిల్లాలోనూ, మూడు కేసులు సంగారెడ్డిలోనూ నమోదయ్యాయి. సూర్యాపేట, వనపర్తి, వరంగల్‌ అర్బన్‌, వికారాబాద్‌, మేడ్చల్‌, నాగర్‌కర్నూల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో ఒక్కొక్క కేసు చొప్పున బయటపడ్డాయి. ఇతర 14 కేసుల్లో 9 కేసులు వలస కార్మికులకు సంబంధించినవి కాగా, మిగిలిన ఐదు కేసులు ప్రవాసులకు చెందినవి. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన స్థానిక కేసుల సంఖ్య 2068కి పెరగ్గా, వలస, ప్రవాస కేసుల సంఖ్య 431కి చేరాయి. మొత్తంగా పాజిటివ్‌ల సంఖ్య 2499కి చేరింది. కరోనా కారణంగా శనివారంనాడు ఆరుగురు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 77కి పెరిగింది. ఇప్పటివరకు 1412 మంది డిశ్చార్జి కాగా, ఇంకా 1010 మంది చికిత్స పొందుతున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తన హెల్త్‌ బులిటెన్‌లో వెల్లడించింది. యాదాద్రి భువనగిరి, వరంగల్‌ రూరల్‌ జిల్లాలు కరోనా రహిత జిల్లాలుగా నిలిచాయి.

DO YOU LIKE THIS ARTICLE?