జస్ట్‌ మిస్‌..

టీమిండియా బౌలర్లు విఫలం, చివరి టి20లో 4 పరుగులతో కివీస్‌ గెలుపు, 2 సిరీస్‌ న్యూజిలాండ్‌ వశం, ముగిసిన విదేశి పర్యటన
హామిల్టన్‌: న్యూజిలాండ్‌తో ఉత్కంఠ భరితంగాజరిగిన చివరి టి20లో భారత జట్టు చివరి వరకు పోరాడినా ఆఖరికి 4 పరుగులతో ఓటమి తప్పలేదు. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆతిథ్య న్యూజిలాండ్‌ 2 కైవసం చేసుకుంది. చివరి సిరీస్‌ కూడా గెలిచి విదేశి పర్యటనను సగర్వంగా ముగించాలనుకున్న టీమిండియా ఆశలు ఫలించలేవు. వన్డే సిరీస్‌లో 4 కివీస్‌ను చిత్తు చేసిన భారత్‌ టి20 సిరీస్‌ను మాత్రం కోల్పోయింది. అంతకుముందు ఆస్ట్రేలియా పర్యటనను విజయవంతంగా ముగించిన భారత్‌ అక్కడ టి20 సిరీస్‌ను 1 డ్రా చేసుకుంది. ఆ తర్వాత వన్డే సిరీస్‌ను 2 టెస్టు సిరీస్‌ను 2 గెలుచుకొని కొత్త రికార్డులు సృష్టించింది. ఓవరాల్‌గా మూడు నెలలుగా విదేశి పర్యటనలో ఉన్న టీమిండియా చిరస్మరణీయమైన విజయాలతో ఆసీస్‌, కివీస్‌ పర్యటనలను సగర్వంగా ముగించింది. కివీస్‌తో జరిగిన టి20 సిరీస్‌లో భారత్‌ తమ ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చిన విషయం తెలిసిందే. భారత సారథి విరాట్‌ కోహ్లీ బదులు తాత్కాలికి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ భారత్‌కు సారథ్యం వహించాడు. ప్రధాన బౌలర్లు కూడా జట్టుకు అందుబాటులో లేకపోయినా టీమిండియా అద్భుతంగా పోరాడింది. పొట్టి ఫార్మాట్లో మంచి రికార్డులున్న కివీస్‌ను చెమటలు పట్టించింది. ఆఖరి మ్యాచ్‌లో కూడా చివరి కంఠం వరకు ఉత్కంఠంగా పోరాడి కేవలం నాలుగు పరుగులతో ఓటమిపాలైంది. కివీస్‌ గడ్డపై తొలి టి20 సిరీస్‌ గెలిచి కొత్త చరిత్ర సృష్టించాలనుకున్న భారత్‌ ఆశలు మరోసారి ఆవిరయ్యాయి. ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ తప్పిదాల కారణంగా టీమిండియా భారీ మూల్యం చెల్లించుకుంది. భారత ఫీల్డర్లు చాలా క్యాచ్‌లు జారవిడిచారు. ఆదివారం ఇక్కడ జరిగిన మూడో, చివరి టి20లో మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. కివీస్‌ జట్టులో ఓపెనర్లు కొలిన్‌ మున్రో (72; 40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), టిమ్‌ సీఫెర్ట్‌ (43; 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర బ్యాటింగ్‌తో కివీస్‌కు శుభారంభం అందించారు. తర్వాత గ్రాండ్‌ హోమ్‌ (16 బంతుల్లో 30), కెప్టెన్‌ విలియమ్సన్‌ (27) దూకుడుగా ఆడడంతో కివీస్‌ మరోసారి భారీ స్కోరును టీమిండియాకు నిర్ధేశించగలిగింది. అనంతరం 213 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాలో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (5) విఫలమైనా మరో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (38), విజయ్‌ శంకర్‌ (43; 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), రిషభ్‌ పంత్‌ (12 బంతుల్లో 28) అద్భుతమైన బ్యాటింగ్‌తో భారత్‌ను ఆదుకున్నారు. చివర్లో దినేష్‌ కార్తిక్‌ (33 నాటౌట్‌; 16 బంతుల్లో 4 సిక్సర్లు), కృనాల్‌ పాండ్యా (13 బంతుల్లో 26 నాటౌట్‌) చెలరేగి ఆడినా ఫలితం లేకుండా పోయింది. చివరికి విజయానికి చేరువైన భారత్‌ స్వల్ప తేడాతో ఓటమిని చవిచూసింది. మ్యాచ్‌లో చెలరేగి ఆడిన కివీస్‌ ఓపెనర్‌ కొలిన్‌ మున్రోకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. మరోవైపు సిరీస్‌లో మెరుపులు మెరిపించిన కివీస్‌ యువ ఓపెనర్‌ టిమ్‌ సీఫెర్ట్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ అవార్డు సొంతం చేసుకున్నాడు.
ఆరంభంలోనే షాక్‌..
కివీస్‌ నిర్ధేశించిన 213 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (5) సాంట్నర్‌ బౌలింగ్‌లో వెనుదిరగడంతో భారత్‌ 6 పరుగుల వద్దే తొలి వికెట్‌ కోల్పోయింది. తర్వాత మరో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ, విజయ్‌ శంకర్‌ భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ అద్భుతంగా ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు సాగించారు. కెప్టెన్‌ రోహిత్‌ ఆచితూచి ఆడుతుంటే.. విజయ్‌ శంకర్‌ మాత్రం చెలరేగి ఆడాడు. ఆకాశమే హద్దుగా ఆడుతూ కివీస్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే భారత్‌ 5.2 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును పూర్తి చేసుకుంది. రోహిత్‌ కూడా సింగిల్స్‌, డబుల్స్‌తో పాటు అవకాశం దొరికినప్పుడల్లా బౌండరీలు కొడుతూ స్కోరుబోర్డును పరిగెత్తించాడు. ఈ జంటను విడదీయడానికి న్యూజిలాండ్‌ బౌలర్లు ఎంతగానో ప్రయత్నించారు. వీరిపై ఎదురుదాడికి దిగారు. కానీ వారి దాడులను సమర్ధంగా ఎదుర్కొంటూ వీరిద్దరూ 29 బంతుల్లోనే 50 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు. అయితే ఆఖరికి సాంట్నర్‌ చెలరేగి ఆడుతున్న శంకర్‌ను ఔట్‌ చేసి భారత్‌కు మరో షాకిచ్చాడు. విజయ్‌ శంకర్‌ 28 బంతుల్లోనే 5 ఫోర్లు 2 సిక్సర్లతో 43 పరుగులు చేసి వెనుదిరిగాడు. టీమిండియా 81 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు కీలకమైన 75 పరుగులు జోడించి మంచి పునాది వేశారు.
పంత్‌ మెరుపులు..
తర్వాత వచ్చిన యువ సంచలనం రిషభ్‌ పంత్‌ మెరుపులు మెరిపించాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో కలిసి వేగంగా ఆడుతూ స్కోరుబోర్డును పరిగెత్తించాడు. మొదటి నుంచే దూకుడుగా ఆడుతూ బౌండరీల వర్షం కురిపించాడు. ఏ బౌలర్లను వదలకుండా అందరిపై ఎదురుదాడులకు దిగాడు. మరోవైపు రోహిత్‌ స్ట్రయిక్‌ రొటేట్‌ చేస్తు ఇతనికి సహకరించాడు. ఈ క్రమంలోనే టీమిండియా 9.2 ఓవర్లలోనే 100 పరుగుల మైలురాయిని పూర్తి చేసుకుంది. వరుస సిక్సర్లతో జోరుమీదున్న పంత్‌ చివరికి భారీ షార్ట్‌ కోసం ప్రయత్నించి టిక్నర్‌ బౌలింగ్‌లో విలియమ్సన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. విజృంభించి ఆడిన పంత్‌ 12 బంతుల్లో 3 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 28 పరుగులు చేశాడు. దీంతో భారత్‌ 121 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది.
వెనువెంటనే..
అనంతరం క్రీజులోకి వచ్చిన పాండ్యా కూడా ధాటిగా ఆడాడు. ఆరంభం నుంచే కివీస్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరోవైపు రోహిత్‌ శర్మ నిధానంగా ఆడుతూ నెమ్మదిగా పరుగులు చేశాడు. ఎక్కువగా యువ ఆటగాళ్లకు స్ట్రయిక్‌ రొటేట్‌ చేస్తూ వారికే అవకాశం ఇచ్చాడు. హార్దిక్‌ దూకుడుగా ఆడుతూ ఒక ఫోర్‌తో పాటు రెండు భారీ సిక్సర్లు కొట్టడంతో స్కోరుబోర్డుపై వేగంగా పరుగులు వచ్చాయి. మరోవైపు కుదురుగా ఆడుతున్న రోహిత్‌ వేగాన్ని పెంచే క్రమంలో భారీ షాట్‌కి ప్రయత్నించి డారిల్‌ మిచెల్‌ బౌలింగ్‌లో చిక్కాడు. గత మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడిన రోహిత్‌ ఈ మ్యాచ్‌లో 32 బంతుల్లో 3 ఫోర్లతో 38 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం. తర్వాత మరో నాలుగు పరుగుల వ్యవధిలోనే ధాటిగా ఆడుతున్న హార్దిక్‌ పాండ్యా (21) కూడా పెవిలియాన్‌ చేరాడు. అదే స్కోరు వద్ద సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ (2) కూడా ఔటవ్వడంతో భారత్‌ 15.2 ఓవరల్లో 145 పరుగుల వద్ద 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత్‌ ఈ మూడు వికెట్లు కేవలం నాలుగు పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది.
ఆశలు రేపిన కార్తిక్‌, కృనాల్‌..
ఈ సమయంలో దీనేష్‌ కార్తిక్‌, కృనాల్‌ పాండ్యాలు భారత్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. ఓటమి అనుకున్న తరుణంలో అద్భుతమైన బ్యాటింగ్‌తో విజయంపై ఆశలు రేపారు. తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాల్సి ఉండడంతో వీరు వచ్చిన వెంటనే బౌండరీలు కొట్టడం ప్రారంభించారు. ఇద్దరూ కూడా ధాటిగా ఆడడంతో భారత్‌ లక్ష్యంవైపు వేగంగా ప్రయాణించింది. ఒకవైపు కార్తిక్‌.. మరోవైపు కృనాల్‌ విజృంభించడంతో కివీస్‌ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఇక చివరి ఓవర్లో విజయం కోసం 16 పరుగులు చేయాల్సి ఉండగా టిమ్‌ సౌథి తెలివిగా బౌలింగ్‌ చేయడంతో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 208/6 పరుగులే చేయగలిగింది. విజయానికి ఆశలు రేపిన చివరికి భారత్‌ 4 పరుగుల దూరంలో నిలిచిపోయింది. దినేశ్‌ కార్తిక్‌ (33 నాటౌట్‌), కృనాల్‌ (26 నాటౌట్‌)లు ఏడో వికెట్‌కు అజేయంగా 63 పరుగులు జోడించారు. కివీస్‌ బౌలర్లలో మిచెల్‌ సాంట్నర్‌, డారిల్‌ మిచెల్‌ చెరో రెండు వికెట్లు తీశారు.
రాణించిన టాప్‌ ఆర్డర్‌..
అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లతో పాటు టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్స్‌ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆదుకున్నారు. కళ్లు చెదిరే షాట్లతో ఓపెనర్లు టిమ్‌ సీఫెర్ట్‌ (43; 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కొలిన్‌ మున్రో (72; 40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) విధ్వంసకర ఆరంభాన్ని అందించారు. వీరు తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించారు. అనంతరం సీఫెర్ట్‌ పెవిలియన్‌ చేరాడు. ఆతర్వాత విలియమ్స్‌నతో కలిసి మున్రో రెండో వికెట్‌కు 55 పరుగుల మరో కీలక భాగస్వామ్యాన్ని ఏర్పర్చాడు. అనంతరం విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడిన కొలిన్‌ మున్రో కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తర్వాత కెప్టెన్‌ విలియమ్సన్‌ (21 బంతుల్లో 3 ఫోర్లతో 27), గ్రాండ్‌హోమ్‌ (30; 16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) చెలరేగి ఆడారు. దీంతో కివీస్‌ స్కోరుబోర్డు వేగంగా ముందుకు సాగించింది. ఆఖరికి విరిద్దరూ కూడా ఔటవడంతో కివీస్‌ మరోసారి కష్టాల్లో పడింది. కానీ చివర్లో డారిల్‌ మిచెల్‌ , రాస్‌ టేలర్‌ ధాటిగా ఆడి జట్టుకు భారీ స్కోరును అందించారు. ఆఖరి వరకు అజేయంగా ఉండి వేగంగా పరుగులు చేశారు. ఒకవైపు డారిల్‌, మరోవైపు సీనియర్‌ రాస్‌ టేలర్‌ విజృంభిచడంతో భారత బౌలర్లు నిసహాయులైపోయారు. ఆఖరికి కివీస్‌ జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. డారిల్‌ మిచెల్‌ (19 నాటౌట్‌ 11 బంతుల్లో 3 ఫోర్లు), రాస్‌ టేలర్‌ 7 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌తో 14 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో 4 ఓవర్లలో 26 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఇతర బౌలర్లలో భువనస్త్రశ్వర్‌ కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. కృనాల్‌ పాండ్యా 4 ఓవర్లలో 54 పరుగులు సమర్పించుకున్నాడు.

DO YOU LIKE THIS ARTICLE?