జస్టిస్‌ పున్నయ్య ఇక‌లేరు

విశాఖపట్నం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్‌ ప్రతిభా భారతి తండ్రి, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ కొత్తపల్లి పున్నయ్య(96) విశాఖపట్నంలోని పినాకిని ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అక్టోబరు 25న అనారోగ్యానికి గురికావడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి వెంటిలేటర్‌ పై చికిత్సపొందుతున్న ఆయన ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కావలి గ్రామానికి చెందిన పున్నయ్య 1952లో రెండేళ్లపాటు శ్రీకాకుళం జిల్లా కోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. తరువాత రాజకీయాల్లోకి వచ్చారు. 1952-1962 వరకూ శ్రీకాకుళం జిల్లా ప‌రిష‌త్‌ ఉపాధ్య‌క్షుడిగా పనిచేశారు. 1955లో శ్రీకాకుళం జిల్లా చీపురపల్లి నియోజవర్గానికి ఎంఎల్‌ఎగా గెలుపొందారు. 1962లో రాజకీయాలు వ‌దిలేసి హైకోర్టు న్యాయవాదిగా వెళ్లారు. 1974-85 వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. 2000 సంవత్సరంలో ఎన్‌డిఎ ప్రభుత్వ హయాంలో ఎస్‌సి, ఎస్‌టి కమిషన్‌ ఛైర్మన్‌గా పనిచేశారు. పున్నయ్య కూతురు కావలి ప్రతిభా భారతి ఎచ్చెర్ల నియోజవర్గం నుంచి ఎంఎల్‌ఎగా ఎన్నికై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసన సభ తొలి మహిళా స్పీకర్‌గానూ, రాష్ట్ర కేబినెట్‌ మంత్రిగానూ పనిచేశారు. ఎంఎల్‌సిగా రెండేళ్లపాటు పనిచేశారు. పున్నయ్య మరణంతో కావలితోపాటు శ్రీకాకుళం జిల్లాలో విషాద ఛాయలు అలముకున్నాయి. జస్టిస్ కె. పున్నయ్య మృతిపై ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. పున్నయ్య కుటుంబ సభ్యులకు తన సానుభూతి ప్రకటించారు. ఎపి మంత్రులు నారాలోకేశ్, కళావెంకట్రావు, యనమల‌, అచ్చెన్నాయుడు తీవ్ర‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారిక లాంఛనాలతో జస్టిస్ పున్నయ్య అంత్యక్రియలు నిర్వహిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.

DO YOU LIKE THIS ARTICLE?