జల వివాదాలపై త్వరలో అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ

ప్రజాపక్షం / హైదరాబాద్‌ : ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య తాజాగా ప్రాజెక్టులకు సంబంధించి తలెత్తిన వివాదాల నేపథ్యంలో త్వరలో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం కానుంది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన అపెక్స్‌ కౌన్సిల్‌కు కేంద్ర జలశక్తి మంత్రి చైర్మన్‌గా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. ఇటీవల శ్రీశైలం ప్రాజెక్టు వద్ద పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతులిస్తూ ఎపి ప్రభుత్వం జిఒ 203 జారీ చేయడంతో వివాదానికి తెరతీసినట్లయింది. రాష్ట్రానికి వచ్చే కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్‌ మళ్ళించుకొని పోతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలంగాణలో ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఆ తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. సిఎం ఆదేశాల మేరకు ఈ వ్యవహారంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కెఆర్‌ఎంబి)కి రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ ముఖ్యకార్యదర్శి ఫిర్యాదు చేశారు. ఆ తరువాత ఎపి ప్రభుత్వం కూడా తెలంగాణలో గోదావరి జలాల వినియోగంపై గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జిఆర్‌ఎంబి)కి ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం కేంద్ర ప్రభుత్వం వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో త్వరలో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర జల శక్తి శాఖ అండర్‌ సెక్రెటరీ ఎ.సి.మల్లిక్‌ గురువారం తెలంగాణ, ఎపి రాష్ట్రాల ఇరిగేషన్‌ శాఖ ముఖ్యకార్యదర్శులకు లేఖ రాశారు. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశ అజెండాను రూపొందించి సాధ్యమైనంత త్వరగా తమకు పంపాలని ఆదేశించారు. జలశక్తి కార్యదర్శి అధ్యక్షతన ఫిబ్రవరి 21వ తేదీన జరిగిన సమావేశంలో కెఆర్‌ఎంబి, జిఆర్‌ఎంబిలకు సంబంధించి తదుపరి సమావేశంలో చర్చించాల్సిన ఎజెండాను పంపేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయని తెలిపారు. అయితే ఇప్పటి వరకు రెండు రాష్ట్రాలు ఎజెండాను పంపలేదని పేర్కొన్నారు. త్వరలో అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ కానున్న తరుణంలో మీ మీ రాష్ట్రాలకు సంబంధించిన అంశాల ఎజెండాను సాధ్యమైనంత త్వరగా పంపాలని ఉభయ రాష్ట్రాల ఇరిగేషన్‌ శాఖ ముఖ్యకార్యదర్శులకు రాసిన లేఖలో కేంద్ర జలశక్తి అండర్‌ సెక్రెటరీ కోరారు.

DO YOU LIKE THIS ARTICLE?